
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 31 జూలై, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: వర్జీనియా పొగాకు సంక్షోభాన్ని పరిష్కరించాలని, రూ.1000 కోట్లు సొసైటీకి కేటాయించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ...
అయ్యా!
వర్జీనియా పొగాకు ధరలేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొనుగోళ్ళు మందకొడిగా సాగుతున్నాయి. దీనిపై రైతులు గత 100 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కానీ సమస్య తీవ్రంగానే కొనసాగుతున్నది. ఈ స్థితిలో మÖడు రోజులక్రితం మీరు ప్రతిపాదించిన ధరలు, ఇచ్చిన హామీ పరిస్థితిని మరింత దిగజార్చేదిగా ఉంది. మార్కెట్ ధరకంటే మీరు ప్రతిపాదించిన ధరలు తక్కువగా ఉన్నాయి. ఇది రైతులను మరింత ఆందోళనలోకి నెట్టివేసింది.
మార్కెట్‌లో ప్రస్తుతం పొగాకు ఏగ్రేడ్‌కు ధర రూ.250లు, బిగ్రేడ్ ధర రూ.195లు, సిగ్రేడ్ ధర రూ.160లు ఉండగా మీరు అంతకన్నా తక్కువగా ఏగ్రేడ్‌కు రూ.240లు, బిగ్రేడ్‌కు రూ.190లు, సిగ్రేడ్‌కు రూ.100లు ఉండాలని ప్రతిపాదించారు. ధర వ్యత్యాసం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలోకు రూ.20లు బోనస్ ఇస్తామని, అందుకోసం రూ.188 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. బోనస్ కావాలని ఏ రైతూ అడగలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో పోటీని సృష్టించడానికి సొసైటీ ద్వారా ప్రభుత్వమే వెయ్యికోట్లు కేటాయించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్న విషయం మీకు తెలుసు. గత అనుభవాన్ని బట్టి అది ప్రభుత్వంపై ఎలాంటి భారాన్ని మోపదు. మీరు ప్రకటించిన ధర వ్యత్యాసం విధానం రైతులకన్నా కంపెనీలకే ఎక్కువ లాభం చేకూరుస్తుంది. మీ ప్రకటన రైతులను హతాశులను చేసింది.
ఈ సంవత్సరం 240 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటికీ కంపెనీలు కొన్నది 34 మిలియన్ల కేజీలు (14%) మాత్రమే. మరలా సీజన్ దగ్గరపడుతోంది. ఉన్న నిల్వలు రైతులను కుంగదీస్తున్నాయి. పచ్చాకు కూలీలకు సైతం చెల్లింపులు చేయలేని దుస్థితిలో రైతులున్నారు. కనీసం సగటు ధర రూ.250లు కూడా లేకుండా రైతులు ఈ సంక్షోభం నుండి బయటపడలేరు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.190`210లు మధ్య ఉంది. మీ ప్రతిపాదన ప్రకారం రూ.180లు కూడా రాదు. నెల రోజుల క్రితం రూ.200లు సగటు ధర ఇవ్వాలని మీరే చెప్పారు. కానీ అదికూడా అమలుకు నోచుకోలేదు. ఈ స్థితిలో పొగాకు రైతులను ప్రభుత్వమే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఆదుకోవాలి.
పొగాకు బోర్డు దగ్గర ఆర్డర్లు తెచ్చుకొని నమోదైన కంపెనీలు 34 కాగా 18 కంపెనీలు మాత్రమే ఇప్పటికీ కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేయని కంపెనీలను రంగంలోకి దింపాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు సొసైటీకి కేటాయించి కొనుగోలు ప్రారంభిస్తే ఇతర కంపెనీలు కూడా పోటీపడి పని అనివార్యంగా ధరలు పెంచి కొనుగోలు చేయవలసి వస్తుంది.
కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సొసైటీకి రూ.1000 కోట్లు కేటాయించి, పొగాకు కొనుగోలు ప్రారంభించాలని, పొగాకు రైతుల ఆందోళన విరమించేటట్లు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
