
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 ఆగష్టు, 2026.
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి - సిపిఐ(యం) డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలి
విద్యాహక్కు చట్టం ఆమోదించబడిన 2010వ సంవత్సరంకన్నా ముందు నియమించబడిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్రంలో అటువంటి టీచర్లు దాదాపు 90 వేల మంది ఉన్నారు. ఇప్పటికే వారు దీర్ఘకాలం అనుభవం ఉండి బోధన చేస్తున్నారు. ఇప్పుడు వారంతా టెట్ రాసి ఉత్తీర్ణులయితేనే ఉద్యోగంలో కొనసాగుతారని చెప్పడం సహేతుకంగా లేదు. ఈ నిబంధన కోచింగ్ సెంటర్లకు తోడ్పడవచ్చు తప్ప విద్యార్థులకు, విద్యా నాణ్యతకు ఉపయోగపడదు.
2028 ఆగష్టులోగా 2010కి ముందు వారు కూడా ఉత్తీర్ణులు కావాలన్న సుప్రీం కోర్టు ఆదేశంతో సర్వీసులో ఉన్న టీచర్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వారిలో కొన్ని వేలమంది తొందరలోనే రిటైర్ అవుతున్నారు కూడా! ఇటువంటి నేపథ్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఊరట కలిగించడం అవసరం. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ అయితే వేసింది గాని వెంటనే ఉపశమనం లభించలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి విద్య హక్కు చట్టం సెక్షన్ 23(1)ను సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఈలోగా ఉపాధ్యాయులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉపశమనం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
