కృష్ణా డెల్టాకు తగినంత నీరు ఇచ్చి పంటలను కాపాడాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 ఆగష్టు, 2026.

కృష్ణా డెల్టాకు తగినంత నీరు ఇచ్చి పంటలను కాపాడాలి

ఎగువన పడ్డ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు నీళ్ళు చేరుకున్న కారణంగా డెల్టాలో నాట్లు వేసుకోడానికి నీరు వదలాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.

రాష్ట్ర ముఖ్యమంత్రిగారు ఒక నెల ముందుగానే నీరు విడుదల చేస్తామని, రైతులను ముందుగానే నార్లు పోసుకోవాలని కోరారు. ఆయన పిలుపుపై రైతాంగం నార్లు పోయటం, దుక్కులు దున్నటం ప్రారంభించారు కొందరు రైతులు ఎద చల్లడం ద్వారా వరి వేశారు.

జూలై చివర్లో ముఖ్యమంత్రిగారు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా వస్తాయని కృష్ణా డెల్టాలో వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రకటించారు. అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా లేకుండానే ప్రకటించడంతో రైతుల్లో గందరగోళానికి దారి తీసింది. కృష్ణా డెల్టాలోని కృష్ణాజిల్లా, బాపట్ల జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వరితప్ప మరొక పంటకు పనికిరావు. అటువంటి ప్రాంతాలలో రైతాంగం మరింత ఆందోళనగా ఉంది.

పట్టిసీమ నుండి ప్రస్తుతం రోజుకు 5200 క్యూసెక్కుల నీరు వస్తుంది. గోదావరిలో వరద ప్రవాహం పెరిగిన దృష్ట్యా అన్ని పంపులు పనిచేయించి 7వేల క్యూసెక్కులు తీసుకునే అవకాశం ఉంది. పులిచింతలలో 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో శ్రీశైలానికి 1,36,000 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఇంకా వచ్చే అవకాశం ఉంది కావున పులిచింతల నుండి రోజుకు 5000 క్యూసెక్కులు తీసుకోవడం ద్వారా కృష్ణా డెల్టాలో ఎక్కువ ప్రాంతంలో పంటలు పండించడానికి అవకాశం ఉంది.

ఎల్‌నినో ప్రభావం పేరుతో వరి పండదని అంచనా వేసిన గుత్త వ్యాపారస్తులు బియ్యాన్ని నిల్వ చేసుకొని అధికరేట్లకు అమ్ముతున్నారు. తద్వారా మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోంది. కావున ఆహార పంటగా వరికున్న ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వరిపంటను ఆదుకోవాలి.

గోదావరి నదిలో సరిపడా నీరు ఉంది. ధవళేశ్వరం నుండి ఏలూరు కాల్వ ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టులోని పెదపాడు, దెందులూరు మండలాలకు సాగునీరు ఇవ్వటానికి అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. గతంలో 80 టీఎంసీలతోనే కృష్ణా డెల్టాలో వారబందీ పెట్టి పంటలు పండించిన అనుభవం ఉంది.

కావున రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా చర్చించి కృష్ణా డెల్టాకు అవసరమైన నీరు ఇచ్చి పంటలు పండించేందుకు తోడ్పడాలని ప్రత్యామ్నాయ పంటలు వేయగలిగిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయించేందుకు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి