
ఈరోజు (06 ఆగష్టు) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ముడిపెట్టొద్దు
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు ఆమోదమే
జెన్‌జి, విద్యార్థి ఉద్యమాన్ని ప్రధాని గౌరవించాలి
అమిత్‌షా పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పాలి
బిజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత బీహార్లో కనిపించింది
ఎపిలో ఉద్యోగ కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలి : విఎసఆర్
పొగాకు రైతును మోసగించిన ప్రభుత్వం
మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ముడిపెట్టొద్దని, వాటిని విడదీసి మహిళా బిల్లు విడిగా పెడితే ఆమోదించేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. ఈ రెండిటినీ కలిపి పెట్టడం ద్వారా ప్రతిపక్షాలు మహిళా బిల్లును అడ్డుకుంటున్నాయనే తప్పుడు ప్రచారం చేసేందుకు, బిజెపి దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తోందనీ అన్నారు. గురువారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ముందుకు వస్తున్నారని, వాటిని విడదీసి ప్రవేశపెట్టాలని అన్నారు. మహిళా బిల్లును పెడితే ఆమోదించేందుకు అందరూ సిద్ధమేనని తెలిపారు. డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం లేదని, ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదించలేదని తెలిపారు. అనిశ్చితిలో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి మహిళా బిల్లును ఆమోదించకుండా చేసి ప్రతిపక్షాలపై నెపం నెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పైగా ఆపరేషన్ లోటస్‌లో భాగంగా ప్రతిపక్ష పార్టీలను చీల్చి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలూ చేస్తున్నారని అన్నారు. బిల్లు విషయంలో కేంద్ర ప్రతిపక్షాలతో చర్చించిన అనంతరమే ముందుకు వెళ్లాలని అన్నారు.
అమిత్‌షా సమాధానం చెప్పాలి
ఢిల్లీలో జరిగిన జెన్‌జీ, విద్యార్థి ఉద్యమం తరువాత కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని, బిజెపి నిర్బంధాన్ని ఎదిరించి మరీ విద్యార్థులు నిలబడ్డారని తెలిపారు. ఈ ఉద్యమాన్ని తప్పుబడుతూ ప్రధాని వీడియో కూడా రిలీజ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు ఉద్యయంలో పాల్గొన్న వారిపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని, అటువంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఉద్యమాన్ని ప్రధాని గౌరవించాలని, ముద్రలు వేసి ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులపై డిల్లీ పోలీసులు దారుణంగా విరుచుకుపడ్డారని, పెల్లెట్‌గన్స్ పేల్చారని అన్నారు. దీన్ని సుప్రీం కోర్టు కూడా తప్పుబట్టిందని, బాధ్యత వహించాల్సిన హోమ్‌శాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. దాడికి కారణమైన దోషులపై చర్యలు తీసుకుని ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఇదే పద్ధతిలో బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
బీహార్లో ప్రజలు బుద్ది చెప్పారు
జెన్‌జీ, విద్యార్థి ఉద్యమం అనంతరం బీహార్లో జరిగిన ఎన్నికల్లో బిజెపికి అక్కడి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన బంకీపూర్ నియోజవకర్గంలో ప్రశాంత్ కిషోర్ గెలుపువెనుక బిజెపి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
ఎపిలో ఉద్యోగ కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
రాష్ట్రంలో ఉపాధి కల్పనకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, పదిలక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు, 11.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబుతున్నారని, ఉపాధి ఎక్కడా కనిపించడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగ కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా స్థానికులకు ఎక్కడా ఉద్యోగ అవకాశాలు లేవని, మరి ఉపాధి ఎవరికి కల్పించారో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. విశాఖ స్టీలు ప్లాంటులోనే 10 వేల ఉద్యోగాలు పోయాయని అన్నారు. ఇప్పుడు గ్యాస్ లేక ఉత్పత్తి నిలిచిపోయిందని అన్నారు. స్పిన్నింగ్, డెయిరీ రంగంలోనూ ఉపాధి పోయిందని తెలిపారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో సగానికిపైనా కూలీలు పనికోల్పోయారని తెలిపారు.
పొగాకు రైతులను మోసం చేశారు
పొగాకు రైతుల పట్ల ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. వారికి కిలోకు రూ.250కు కొని న్యాయం చేయాల్సిన ప్రభుత్వం అప్పులిచ్చి ఆదుకుంటామని చెప్పడం, కిలోకు అదనంగా రూ.10 ఇస్తామనడం వారిని మోసం చేయడమేనని తెలిపారు. పొగాకు కొనకపోడంతో పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వారితో సహా రైతులంతా ఆందోళనలో పాల్గొంటున్నారని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులిచ్చి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
డెల్టాకు నీరిచ్చి పంటలను కాపాడాలి
కృష్ణాడెల్టా ప్రాంతంలో పంటలకు నీరందించి ఆదుకోవాలని శ్రీనివాసరావు కోరారు. ఇప్పుడున్న నీటిలో రాయలసీమకు తాగునీరు ఇచ్చి డెల్టాలో పంటలు నష్టపోకుండా సాగునీరు ఇవ్వాలని కోరారు. పట్టిసీమ పంపింగ్ పెంచాలని సూచించారు.
కులనిర్మూలన మార్క్సిస్టు ధృక్పథం పుస్తకావిష్కరణ
ప్రజాశక్తి బుక్‌హౌస్ ప్రచురించిన కుల నిర్మూలన, మార్క్సిస్టు ధృక్పథంపై పుస్తకాన్ని బి.వి.రాఘవులు, వి.శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కుల నిర్మూలనయితేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రపంచం అభివృద్ధి చెందుతోందని, జిడిపిలో నాలుగోస్థానంలోకి వెళుతున్నామని ప్రధాని మోడీ చెబుతున్నా కుల నిర్మూలన కాకుండా దేశం ముందుకు వెళ్లలేదని తెలిపారు. కులాన్ని ప్రోత్సహించడం అంటే శ్రమను అవమానించడమేనని, శ్రమను చులకనచేసే చోట అభివృద్ధి ఉండదని అన్నారు. కుల వ్యవస్థ చేసే తొలి పని శ్రమను చులకనచేయడమేనని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుల సమస్య పరిష్కారానికి అవసరమైన ఆలోచన చేయాలని రాఘవులు సూచించారు. పుస్తకావిష్కరణలో బుక్‌హౌస్ సంపాదకులు ఎం.వి.ఎస్.శర్మ, జనరల్ మేనేజర్ కె.లక్ష్మయ్య పాల్గొన్నారు.
