డాక్టర్ ప్రియాంక మృతిపై విచారణ జరిపించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 12 ఆగష్టు, 2026.

డాక్టర్ ప్రియాంక మృతిపై విచారణ జరిపించాలి

సిపిఐ(యం) డిమాండ్

రాజమహేంద్రవరంలో ఆగష్టు 3వ తేదీ రాత్రి మద్యం సేవించి కొందరు దుండగులు పలుమార్లు కారుతో ఢీ కొట్టించి దారుణంగా హత్య చేసిన ఘటనలో డా॥ ప్రియాంక తీవ్రంగా గాయపడి మృతిచెందడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

సీసీటీవీ దృశ్యాల ప్రకారం మద్యం మత్తులో ఉన్న నిందితులు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడుపుతూ ప్రియాంకను పలుమార్లు ఢీకొట్టారు. ప్రమాదానికి ముందు కూడా ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద భద్రతా సిబ్బందితో వారు ఘర్షణకు దిగినట్లు సి సి కెమెరా ల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి నేపథ్యంలో ఈ ఘటనను కేవలం రోడ్డు ప్రమాదంగా పరిగణించడం సరైంది కాదు. నిందితుల వెనుక పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులున్నారని, వారు కేసు నీరు కార్చడానికి ప్రయత్నిస్తున్నారని  ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

కేవలం రాజమండ్రిలో ప్రజాసంఘాలు, పౌర సమాజం స్పందించి అందోళన చేశాకే నిందితులపై హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది.

ఘటన జరిగిన రెండు రోజుల తరువాత సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు. సమాచారం బయటకు రాకుండా తొక్కి పెట్టారు అనేది అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి ఈ మొత్తం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి.

రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి ప్రకటించిన సహాయం సక్రమంగా లేదు. ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించటమే సరిపోదు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలి. ప్రత్యేకంగా డా॥ ప్రియాంక మృతి ఘటనపై పూర్తి స్థాయిలో, పారదర్శకంగా విచారణ జరిపించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి