తిరుపతి ఎయిర్‌పోర్టును ప్రయివేటుకు ఇవ్వొద్దు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 ఆగష్టు, 2026.

తిరుపతి ఎయిర్‌పోర్టును ప్రయివేటుకు ఇవ్వొద్దు

-సిపిఐ(యం)

తిరుపతి విమానాశ్రయాన్ని పిపిపి పద్ధతిలో ప్రైవేటు కంపెనీకి అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. తిరుపతి ఎయిర్పోర్టును ప్రభుత్వ రంగంలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలోనే కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నది.

వ్యూహాత్మకంగా విలువైన జాతీయ సంపదలో ఎయిర్‌పోర్టులు ముఖ్యభాగం. అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే దేశానికి మంచిది. అందుకు భిన్నంగా 11 ఎయిర్ పోర్టులను పిపిపి విధానంలో ప్రైవేటు పరం చేయాలని ఇటీవల సమావేశమైన కేంద్ర ప్రభుత్వ కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతి విమానాశ్రయం కూడా వాటిలో ఉండడం ఆందోళనకరం. తిరుపతి విమానాశ్రయం ద్వారా ఇప్పటికే ఏటా 10 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధాన నగరాలతో ఇప్పటికే కనెక్టివిటీ కలిగి ఉన్న తిరుపతికి ఇంకొన్ని విమానయాన సంస్థలు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న తిరుపతి విమానాశ్రయాన్ని ఇంకా మెరుగుపర్చాల్సింది పోయి ప్రైవేటుకు ఇవ్వాలనుకోవడం తగదు. దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతిలో విమానాశ్రయం ప్రభుత్వ అజమాయిషిలో ఉంటేనే భక్తులకు సౌకర్యవంతంగానూ, అదనపు భారాలు పడకుండా వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తిరుపతి విమానాశ్రయం ఏఏఐ పరిధిలోనే కొనసాగేలా చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరుతున్నది. రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి తిరుపతి జిల్లా ప్రజానీకం దీనిపై గళం విప్పి కాపాడుకోడానికి ముందుకు రావాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి