గోదావరి పుష్కరాల నిధులు, పనులపై పబ్లిక్ ఆడిట్ వుండాలి ప్రణాళికలో భక్తుల అవసరాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 ఆగష్టు, 2026.

గోదావరి పుష్కరాల నిధులు, పనులపై పబ్లిక్ ఆడిట్ వుండాలి

ప్రణాళికలో భక్తుల అవసరాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి - సిపిఐ(యం)

గోదావరి పుష్కరాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.4 వేల కోట్ల నిధులను యాత్రికుల అవసరాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఖర్చు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. చేపట్టాల్సిన పనుల నిర్ణయం త్వరగా జరగాలని, తగినంత ముందుగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని కోరుతున్నది. గతంలో పనుల నిర్ణయం, ప్రారంభం, పూర్తి చేయడం చాలా ఆలస్యంగా జరిగి యాత్రికులకు సకాలంలో తగు సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం జరిగింది. అంతేకాదు పనులు హడావుడి చేయడం వల్ల తీవ్ర నాణ్యత లోపం, భారీ స్థాయిలో అవినీతి, అవకతవకలు జరిగాయన్న వార్తలు వచ్చాయి. చేసిన కొన్ని పనులు పుష్కరాలు జరుగుతుండగానే దెబ్బతిన్నాయి. తీర్థయాత్రలు, పుష్కరాలు, ఉత్సవాల్లో ప్రజల, భక్తుల ప్రాణాలను, భద్రతను గాలికొదిలేస్తున్నారు. గత పుష్కరాల్లో భద్రతా వైఫల్యం, ప్రజల ప్రాణాల పట్ల తీవ్ర అశ్రద్ధ స్పష్టంగా కనబడ్డాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలను ఆదుకోలేదు. ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.  ప్రజల ప్రాణాలకు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. పనులు అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా ఉండేలా, అవినీతికి తావు లేకుండా చూడాలని, వీటిపై నిరంతర పర్యవేక్షణకు “పబ్లిక్ ఆడిట్ ” ఉండాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. పనుల నిర్వహణలో అధికార దుర్వినియోగం, రాజకీయజోక్యం లేకుండా చేయాలి. పనుల నాణ్యతకు, భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా ముందునుండే తగు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి