గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు విశాఖ మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్దరించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 ఆగష్టు, 2026.

 

గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు

విశాఖ మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్దరించాలి

-సిపిఐ(యం)

తల్లిదండ్రుల అనుమతి లేకుండా గిరిజన విద్యార్థులను వేరే ప్రాంతాలకు తరలించడం అత్యంత బాధ్యతారాహిత్యం. విశాఖపట్నం మారికవలస గిరిజన గురుకుల (ఎపిటిడబ్ల్యూఆర్) పాఠశాలలో చదువుతున్న 480 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, పాఠశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

25వ తేదీ అర్ధరాత్రి నుంచి తల్లిదండ్రులకు ఫోన్‌లు చేసి, 26వ తేదీ తెల్లవారుజామున విద్యార్థులను బస్సుల్లో బలవంతంగా తరలించడం, పోలీసులతో భయభ్రాంతులకు గురిచేయడం, వారి సామాన్లను బయటకు పడేయడం వంటి చర్యలు అత్యంత బాధ్యతారాహిత్యం. సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ పేరుతో కోచింగ్ సెంటర్ పెట్టడానికి గిరిజన పాఠశాలను తరలించడం విజ్ఞత కాదు. విశాఖలో ఇందుకు అనేక భవనాలున్నాయి. ఖాళీ స్థలాలున్నాయి. ఇంటర్‌లో ప్రవేశ పరీక్షల శిక్షణకోసం వాటిని ఉపయోగించుకోవచ్చు. దీనికోసం మరొక పాఠశాలను బలిచేయడం సరికాదు.

2004లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను కొనసాగించాలి. ఇందుకోసం తల్లిదండ్రులు పాడేరులో ఐటిడిఎ వద్ద ఆందోళన చేస్తున్నారు.

480 మంది గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవించి, విశాఖపట్నం మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్దరించాలని, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను మరొకచోట ప్రారంభించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

 

నోట్ : హాస్టల్ నుండి విద్యార్థులను బలవంతంగా బయటకు తరలిస్తున్న ఫోటో జతచేయబడింది.