సిపిఐ(యం) నాయకుల అరెస్టుకి ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 ఆగష్టు, 2026.

సిపిఐ(యం) నాయకుల అరెస్టుకి ఖండన

వెలుగొండ ప్రాజెక్టు కోసం మొదటి నుండి పోరాడుతూ నేడు నిర్వాసితుల పక్షాన నిలబడుతున్న సిపిఐ(యం), ప్రజాసంఘాల నాయకులపై ప్రభుత్వ నిర్బంధాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. మార్కాపురం పట్టణంలో జిల్లా పార్టీ కార్యదర్శి డి.సోమయ్య, జిల్లా నాయకులు బాలనాగయ్య, రఫీ రూబెన్, రైతు సంఘం సీనియర్ నాయకులు వెంకటరామిరెడ్డితో సహా మరో 8 మంది ఇల్ల దగ్గర పోలీసులు కాపలా పెట్టి దిగ్బంధించారు. వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.

వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం మార్కాపురం వస్తున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం సిపిఐ(యం) మార్కాపురం జిల్లా కార్యాలయాన్ని ఆక్రమించి పార్టీ, ప్రజాసంఘాల నాయకులను నిర్బంధానికి గురిచేయడం గర్హనీయం. గత 30 సంవత్సరాలుగా వెలుగొండ ప్రాజెక్టు కోసం  పోరాడుతున్నది సిపిఎం, వామపక్షాలు, ప్రజాసంఘాలేñ. ప్రాజెక్టు మొదటి నుండి నిర్వాసితులకు రావాల్సిన పరిహారం కోసం పోరాడుతున్న వారిని గత మూడు రోజులుగా వెంటాడుతూ అరెస్టు చేయటం, సిపిఎం ఆఫీస్ వద్ద, ప్రజాసంఘాల నాయకుల ఇళ్ల వద్ద పోలీసులను కాపలా పెట్టి నిర్భంధానికి గురిచేయడం  ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని తెలియజేస్తున్నది. ఇటువంటి దుర్మార్గపూరితమైన చర్యలు ప్రభుత్వం యొక్క అభద్రతను రుజువు చేస్తున్నాయి. ఇది ప్రజలను, ప్రజాఉద్యమాలను అవమానించేవిగా ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తూనే అర్హులైన ప్రతి నిర్వాసితుడికి ఒక స్థిర నివాసం నష్టపరిహారం అందేవరకు, చివరి ఎకరం భూమికి నీరందే వరకు పోరాటం కొనసాగుతుందని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రకటిస్తున్నది. 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి