దళిత, ఆదివాసీల కోసం ఉద్దేశించిన స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంస్థలను ప్రభుత్వమే నిపుణులను నియమించి నిర్వహించాలి. కార్పొరేట్ యాజమాన్యాలకు ఇవ్వొద్దు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 ఆగష్టు, 2026.

దళిత, ఆదివాసీల కోసం ఉద్దేశించిన స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంస్థలను ప్రభుత్వమే

నిపుణులను నియమించి నిర్వహించాలి. కార్పొరేట్ యాజమాన్యాలకు ఇవ్వొద్దు. 

ఆ పేరుతో దళిత, ఆదివాసీ విద్యార్థులను గురుకులాల నుండి తరలించ వద్దు.

-సిపిఐ(యం) డిమాండ్

పిపిపి పేరుతో స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అనే ఆశ చూపించి ప్రభుత్వం స్కూళ్ళు, కాలేజీల భవనాలు, స్థలాలు ఫిజిక్స్‌వాల, నారాయణ కోచింగ్ సెంటర్‌లకు దారాధత్తం చేయవద్దని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. రాష్ట్రంలో 12 చోట్ల దళిత, గిరిజన విద్యార్థులకు ఐఐటీ, నీట్, జెఈఈ పరీక్షల్లో శిక్షణ ఇవ్వడానికి అదే తరగతులకు చెందిన విద్యార్థులను బలిచేయకుండా ప్రభుత్వమే ప్రత్యామ్నాయ భవనాలలో నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. మారికవలస సహా అనేక చోట్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్యాయం చేయొద్దని ప్రతిఘటిస్తున్నారు. అయినా కార్పొరేట్ల కోసం తల్లిదండ్రులను లెక్క చేయకుండా బలవంతంగా చిన్న పిల్లలని కూడా చూడకుండా రాత్రికి రాత్రి తరలించడం అమానుషం. ఇలాంటి దళిత, గిరిజన వ్యతిరేక చర్యలను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. విద్యను అందించడానికి విశాఖ జిల్లా మారికవలస ప్రాంతంలో స్కూలు, కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమంది ఈ విద్యాసంస్థల్లో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పటికే ఈ విద్యాసంస్థలో జెఈఈ మెయిన్స్, నీట్ వంటి కోచింగ్ విద్యార్థులకు అందిస్తున్నారు. దానిలో లోపాలేమైనా ఉంటే సరిదిద్దాల్సింది పోయి మొత్తం విద్యార్థులు లేకుండా ఖాళీచేసి కోచింగ్ సెంటర్‌లకు అప్పగించడం సరైంది కాదు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ 69 తీసుకొని వచ్చారు. కనీసం అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించిన సందర్భం కూడా లేదు. అకస్మాత్తుగా వందలాది మంది విద్యార్థులను అనేక ఇబ్బందులు పెట్టి తల్లిదండ్రులకు సమాచారం లేకుండా ఉన్నపళంగా పాడేరు సహా అన్ని ప్రాంతాలకు బస్సులో తరలించారు. దీనిని ఆగ్రహించిన తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. దీనికి ఆదివాసీ గిరిజన సంఘం. కెవిపిఎస్ సంపూర్ణమైన మద్దతు తెలియజేశాయి. నిర్బంధం ప్రయోగించినా వెనకాడకుండా విద్యార్థుల తల్లిదండ్రుల పోరాట ఫలితంగా మారిక వలసలో ఆదే స్కూలులో తిరిగి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. నేడు మరలా అదే క్యాంపస్ దగ్గరలో ఉన్న విద్యార్థినులను ఖాళీ చేయించాలని కుట్రలు పన్నుతున్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు నిరసన తెలియజేస్తున్నారు. దీనికి మద్దతు ఇవ్వడానికి వెళ్ళిన ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పి.అప్పలనర్స, సిఐటియు నాయకులు రాజ్‌కుమార్, విశాఖజిల్లా ఎసఎఫఐ జిల్లా కార్యదర్శి జి.అజయ్, ప్రగతి తదితరులను అరెస్టు చేశారు. ఇది పచ్చి అప్రజాస్వామిక చర్య.

గిరిజన విద్యకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సింది పోయి ఇలాంటి చర్యలవల్ల గిరిజనులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఏజెన్సీ ప్రాంతానికి విద్యకు సంబంధించి ట్రైబల్ అడ్వయిజరీ కమిటీలో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదు. ఇప్పటికైనా ఈ విధానాలు మానుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. లేనట్లయితే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి