టిఐఎల్ హెల్త్‌కేర్ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి మృతుల కుటుంబాలకు కోటి పరిహారం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 అక్టోబర్, 2026.
టిఐఎల్ హెల్త్‌కేర్ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి
మృతుల కుటుంబాలకు కోటి పరిహారం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి -సిపిఐ(యం)

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో ఈరోజు ఉదయం బాయిలర్ పేలి భారీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను వెంటనే రక్షించి కోలుకునే వరకు వైద్య సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలి. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలకు తగ్గకుండా నష్టపరిహారం చెల్లించాలి. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. చనిపోయిన కార్మికులకు శ్రద్దాంజలి ఘటిస్తున్నది.
మన రాష్ట్రంలో పారిశ్రామిక వాడల్లో, అనేక రసాయనిక పరిశ్రమల్లో, పెద్ద పరిశ్రమల్లో పదే పదే ప్రమాదాలు సంభవిస్తున్నా నివారణకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతున్నది. ఈ ప్రమాదాలకు కార్మికులు, వారి కుటుంబాలు అన్యాయంగా బలైపోతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం సందర్భంగా అన్ని పరిశ్రమల్లో సమగ్ర పరిశీలన చేసి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామన్న ప్రభుత్వ మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ఇప్పటికైనా పేలుడు ప్రమాదం ఉన్న అన్ని పరిశ్రమల్లో నిపుణులతో తనిఖీలు చేయించి వాటిని సరిచేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. శ్రీసిటీలోని టిఐఎల్ హెల్త్‌కేర్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదబారిన పడిన కార్మికులను, కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, వారి కుటుంబాలు వీధిన పడకుండా ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. నిర్లక్ష్యంగా వ్యవహరించి అనేక మంది మరణాలకు కారణమైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి