వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి, అర్హులైన నిర్వాసితుల సక్రమమైన తుది జాబితాలను ప్రకటించి, అందరికీ పునరావాసం-పునరావాస ప్యాకేజీ కల్పించాలని కోరుతూ.

(సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శ్రీమతి పి. ప్రశాంతి గారిని ఈరోజు (05 అక్టోబర్) కమిషన్  కార్యాలయం లో కలిసి వినతిపత్రం సమర్పించారు. కమిషనర్ గారు స్పందిస్తూ లబ్దిదారుల లిస్టులు వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు స్పెషల్ సెల్ పనిచేస్తుందన్నారు. కొన్ని కాలనీలలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. పెళ్లి అయిన ఆడపిల్లల విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. కమిషనర్ గారికి అందజేసిన మెమోరాండం కాపీని ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాం - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేదీ : 05 అక్టోబర్, 2026.

గౌరవనీయులైన కమిషనర్ గారికి,
పునరావాసం మరియు పునరావాస పునరుద్దరణ (ఆర్అండ్ఆర్),
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి, అర్హులైన నిర్వాసితుల  సక్రమమైన తుది జాబితాలను ప్రకటించి, అందరికీ పునరావాసం-పునరావాస ప్యాకేజీ  కల్పించాలని కోరుతూ...
అమ్మా!
మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురయిన గ్రామాల ప్రజలు అనేక సంవత్సరాలుగా తమ భూములు, ఇళ్లు, జీవనోపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. నీళ్ళు నింపుతున్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం మరింత పెరిగింది. అయితే, ప్రస్తుతం నిర్వాసితుల జాబితాల తయారీ, సవరణ, ప్రకటనా ప్రక్రియలో అనేక గందరగోళాలు, అభ్యంతరాలు నెలకొన్నాయి. అర్హులైన పలువురి పేర్లు జాబితాల్లో లేకపోవడం, కొందరి వివరాల్లో తప్పులు ఉండటం, ఒకే కుటుంబానికి సంబంధించిన అర్హతలను సక్రమంగా నమోదు చేయకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల వెలువడిన వార్తా కథనంలో కూడా వెలిగొండ నిర్వాసితుల జాబితాలను సక్రమంగా రూపొందించి, అర్హులైన వారందరి పేర్లను ప్రకటించాలని డిమాండ్ చేయబడింది. కాబట్టి నిర్వాసితులపట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి, క్రింది చర్యలను తక్షణం చేపట్టాలని కోరుతున్నాము.
మా ప్రధాన డిమాండ్లు క్షేత్రస్థాయిలో పరిశీలన ఆధారంగా ఇప్పటికే ప్రకటించిన నిర్వాసితుల జాబితాలను గ్రామాల వారీగా పేర్లు తొలగించబడినవారు, పేర్లు నమోదు కానివారు, తప్పులు ఉన్నవారికి అభ్యంతరాల దరఖాస్తులను అధికారులకు అనేక సార్లు ఇస్తూ వచ్చారు.
:: మా విజ్ఞప్తి ::
(1) అర్హులైన ప్రతి నిర్వాసిత కుటుంబాన్ని తుది జాబితాలో చేర్చాలి.
(2) నిర్వాసితుల తుది అర్హుల జాబితాలను పారదర్శకంగా, గ్రామాల వారీగా బహిరంగంగా ప్రకటించాలి. రాజకీయ పార్టీలకు అందించాలి.
(3) జాబితాలను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్అండ్ఆర్ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. జాబితాలో పేరులేని అర్హులైన నిర్వాసితులకు అప్పీల్/ గ్రీవెన్స్ పరిష్కారానికి ప్రత్యేక అవకాశం కల్పించి, నిర్ణీత గడువులో వారి సమస్యలను పరిష్కరించాలి.
(4) ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి అర్హులైన ప్రతి కుటుంబానికి చట్టప్రకారం పూర్తి పరిహారం, పునరావాస ప్రయోజనాలు, ఇల్లు, స్థలం మరియు ఇతర సౌకర్యాలు కల్పించాలి.
(5) పునరావాస కాలనీల్లో ఇళ్లు, రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఉపాధి మరియు ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి.
(6) పునరావాసం మరియు పరిహారం పూర్తిగా అందించకముందే నిర్వాసితులను వారి గ్రామాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. యువత, మహిళలు, భూమిలేని కుటుంబాలు, సాగుదారులు, కౌలు రైతులు, పశువుల, జీవాల పెంపకందార్లు తదితర వర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి, చట్టపరంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి.
(7) 18 సంవత్సరాలు నిండి వివాహామైన మహిళలను కూడా జాబితాలో చేర్చి ప్యాకేజీ ప్రకటించాలి. ఆస్తి హక్కులో వారసులైన మహిళలు పెళ్ళి అయింది గనుక అర్హులు కారని చర్చించడం అంటే స్త్రీలకు స్వంత వ్యక్తిత్వాన్ని వారి కాళ్ళపై వారు నిలబడేందుకు, జీవోనోపాధిని కల్పించుకునేందుకు అవకాశాన్ని నిరాకరించడమే! చట్టాన్ని అమలు చేయకపోవడమే. ఈ సమస్యపై ఒక మహిళా అధికారిగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
(8) నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు ఆర్అండ్ఆర్ కమిషనర్‌గా మీరు నిర్వాసిత ప్రతినిధులతో నేరుగా చర్చించాలి.
(9) వెలిగొండ ప్రాజెక్టు అభివృద్ధి కోసం తమ భూములను, ఇళ్లను, స్వస్థలాలను త్యాగంచేసిన నిర్వాసితులు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారు. వారి త్యాగాలకు తగిన న్యాయం జరగాలంటే ముందుగా ప్రతి అర్హుడైన నిర్వాసితుడిని గుర్తించి, సక్రమమైన తుది జాబితా రూపొందించడం అత్యంత ముఖ్యమైనది. గుర్తించిన వారికి ప్యాకేజీ అందజేయడం జరగాలి.
కావునపై సమస్యలపై తక్షణం జోక్యం చేసుకుని, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, అర్హులైన నిర్వాసితులందరి పేర్లతో సక్రమమైన తుది జాబితాలను ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న ఆర్అండ్ఆర్ సమస్యలను కాలపరిమితిలో పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము.
నమస్కారములతో...

(డి.రమాదేవి)
సిపిఐ(ఎం) కేంద్ర కేంద్ర కమిటీ సభ్యులు
9490098620