
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 అక్టోబర్, 2026.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో డేటా సెంటర్ నిర్మాణానికి
ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు నిలిపివేయాలి.
పర్యావరణ ప్రభావంపై నిపుణుల కమిటీ నియమించాలి.
-సిపిఐ(యం) డిమాండ్
విశాఖపట్నం రూరల్ మండలం అడవివరం, ముడుసర్లోవ గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టు నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. తుది తీర్పు వచ్చే వరకు డేటా సెంటర్ ప్రాజెక్టు సొంత రిస్క్‌తో పనులు చేపట్టాలని కోర్టు చెప్పినందున ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఇన్సెంటీవ్లను ఉపసంహరించుకోవాలి. జనావాసాల మధ్య డేటా సెంటర్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీనికనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి. దానితో పాటు అన్ని రకాల సహాయాన్ని తక్షణం నిలిపివేసి ప్రజా ధనాన్ని కాపాడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. పెట్టుబడులు పెట్టామన్న కారణంతో భవిష్యత్‌లో ఎలాంటి హక్కులు కోరడానికి ప్రాజెక్టుకు వీలులేదని కోర్టు స్పష్టంగా పేర్కొంది.
పర్యావరణ నిబంధనల ఉల్లంఘనతో పాటు, నీరు, భూమి, ఇతర పర్యావరణ ప్రభావాలపై వెంటనే ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ వేసి నిర్ధిష్టంగా అంచనా వేయాలి, ఆ నివేదికలకనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఆ వివరాలను బహిరంగ పరచి ప్రజలకు తెలియచేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. డేటా సెంటర్ నిర్మాణంపై ఇప్పటికే అనేక మంది నిపుణులు, పుర ప్రముఖులు, విశాఖపట్నం నగర ప్రజలు అనేక సందేహాలను లేవనెత్తారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ ప్రభావంపై ప్రభుత్వం స్పష్టమైన అంచనాకు రావాలి.
భూములు కోల్పోతున్న గ్రామాల ప్రజలపై ప్రభుత్వం పోలీసు నిర్బంధ ప్రయోగించి, ప్రభుత్వ యంత్రాంగాన్నంతా కేంద్రీకరించి ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్నది. దీనిపై ప్రజల్లో తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. సింహాచలం దేవస్థానం కేసులను ఉపసంహరించుకొని పంచ గ్రామాల ప్రజల భూములకు పూర్తి హక్కులివ్వాలి. కావున ఇప్పటికైనా గ్రామసభలు జరిపి ప్రజాభిప్రాయాలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
