ఈరోజు (07 అక్టోబర్) అఖిలపక్ష పార్టీల విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ఓట్చోర్కా హఠావో...దేశ్‌కి బచావో
10న చలో రాజ్‌భవన్
అఖిలపక్ష పార్టీల వెల్లడి
దేశ చరిత్రలో చీకటి అధ్యాయం
ఓటుహక్కును కాపాడేందుకు ప్రజాస్వామ్య ఉద్యమం
బిజెపి బంటు జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాల్సిందే
బిజెపి బంటుగా ఉంటూ 13 కోట్ల ఓట్లను తొలగించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ ఈనెల 10వ తేదీన చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అఖిలపక్ష పార్టీల నాయకులు వెల్లడించారు. బుధవారం బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓట్ల చోరీపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళన జరుగుతోందని, రాష్ట్రంలోనూ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఓటు హక్కును కాపాడుకునేందుకు జరిపే ఈ ఉద్యమంలో అన్ని పార్టీలూ, ప్రజాసంఘాలు, పౌరసంఘాలు కలిసి 10వ తేదీన చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. దీనికి బిజెపి యేతర పార్టీలన్నిటినీ ఆహ్వానిస్తున్నామని, వైసిపి ఇప్పటికే కలిసి వస్తోందని, టిడిపిని కూడా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో జ్ఞానేష్‌కుమార్ కూరుకుపోయారని అన్నారు. ఫారం 6 మార్పు విషయంలో ఎన్నికల కమిషన్ తమను సంప్రదించలేదని, తాము ఎటువంటి మార్పులనూ ఆమోదించలేదని సుప్రీంకోర్టు చేసిన ప్రకటనతో అసలు విషయం బయటకు వచ్చిందని తెలిపారు. ఇదే సమయంలో సిఈసి బిజెపి రాజకీయాల్లో ఉన్నారని కేరళం మాజీ చీఫ్ సెక్రటరీ చేసిన ప్రకటన అతను బిజెపితో అంటకాగే విషయాన్ని బయటపెట్టిందని అన్నారు. ప్రధాని మోడీ, హోమ్శాఖమంత్రి అమిత్‌షాకు తెలియకుండా అతను ఏమీ చేయలేడని, అయినా వారు ఇప్పటికీ నోరెత్తడం లేదని విమర్శించారు. సిఈసికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపిలందరూ ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేసినా ఎన్నికల కమిషన్లోగానీ, ప్రభుత్వంలోగానీ కనీసం చలనం లేదని విమర్శించారు. జెన్‌జీ యువత ఆందోళన చేపట్టారని, జర్నలిస్టులపై ఆరఎసఎస్ ప్రోత్సాహక పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారిపైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. నిరసనల్లో అరెస్టు చేసిన వారిని ఎక్కడ ఉంచారో కూడా తెలియకుండా వ్యవహరించారని, బిజెపి పూర్తి నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. దాని ప్రోద్బలంతోనే సిఈసి కూడా ఎన్నికల నియమ నిబంధనలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా సిఇసిగా ఉండటానికి వీల్లేదని, 140 కోట్ల దేశ ప్రజలు అతన్ని ఏ మాత్రం అంగీకరించే పరిస్తితి లేదని అన్నారు. దేశ చర్రితలో ఇదొక చీకటి అధ్యాయమని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ సిఈసి తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని అన్నారు. దీనిపై ప్రధాని, అమిత్‌షా నోరు విప్పాలని పేర్కొన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.శంకర్ మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య హక్కును కాలరాశారని, 13 కోట్లమందికి ఓటు హక్కు లేకుండా పోవడం అంటే మరణంతో సమానమని అన్నారు. జ్ఞానేష్‌కుమార్ బిజెపికి చీఫ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న బిజెపిని ఎండగట్టకపోతేû దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండదని అన్నారు.
న్యూడెమెక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎం.రామకృష్ణ మాట్లాడుతూ పోలీసులు ఆరఎసఎస్ కార్యకర్తల్లా మహిళల పట్ల నీచాతినీచంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఓటు హక్కు కోసం జరుగుతున్న ఆందోళనల్లో అందరూ కలిసి రావాలని కోరారు.
ఎంసిపిఐయు నాయకులు ఖాదర్‌భాషా మాట్లాడుతూ దేశ ప్రజలకు ప్రధాని మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని అన్నారు.
ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
