ప్రయివేటు మరియు విదేశీ విద్యా సంస్థలను ప్రోత్సహించే మంత్రివర్గ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 09 అక్టోబర్, 2026.
ప్రయివేటు మరియు విదేశీ విద్యా సంస్థలను ప్రోత్సహించే
మంత్రివర్గ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి.
- సిపిఐ(యం) డిమాండ్

ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ రాష్ట్రమంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్రకమిటీ డిమాండ్ చేస్తున్నది. విద్యా హక్కును ఎత్తేసి చదువును పూర్తి స్థాయి వ్యాపార సరుకుగా మార్చే విధంగా మంత్రివర్గ నిర్ణయాలు ఉన్నాయని సిపిఐ(యం) విమర్శిస్తున్నది. ప్రైవేటు విద్యాసంస్థలను కొద్ది మేరకైనా నియంత్రించేందుకు ఉన్న కొద్దిపాటి నిబంధనలను కూడా ఎత్తేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం కావడాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలని కోరుతున్నది.
ఇప్పటికే పేద, మధ్య తరగతి ప్రజలకు ఉన్నత విద్య మోయలేనంత భారంగా మారింది. ప్రభుత్వ విద్యా సంస్థలు నిధులు, సౌకర్యాలు లేక వెల వెల పోతున్నాయి. విశ్వవిద్యాలయాలు బోసి పోతున్నాయి. ఈ స్థితిలో ప్రభుత్వ విద్యను బలపరచాల్సిన ప్రభుత్వం దాన్ని మరింతగా దెబ్బ తీస్తున్నది. ఫ్రాన్స్, ఢిల్లీలలో సాగుతున్న విద్యార్థి పోరాటాలను చంద్రబాబు విస్మరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. తక్షణం ఈ విధానాన్ని ఉపసంహరించుకోకపోతే విద్యార్థుల నుండే పాఠం నేర్చుకోవాల్సి వస్తుందని గుర్తించాలి.
ఆంధ్రప్రదేశ్ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ప్రోత్సాహక విధానం-2026 విద్యా వ్యాపారీకరణకు, ఫీజులు భారీగా పెరగడానికి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరింతగా బలహీన పడడానికి కారణమవుతుంది. ఈ విధానం వివిధ సామాజిక తరగతుల పై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రైవేట్ కళాశాలల్లో ఇప్పటివరకు ఉన్న 70శాతం కన్వీనర్ కోటా కొనసాగుతుందో లేదో కూడా ప్రభుత్వం స్పష్టం చేయలేదు.
రాష్ట్రంలో బ్రౌన్‌ఫీల్డ్ యూనివర్సిటీల పేరుతో ఉన్న ప్రైవేట్ కళాశాలలను యూనివర్సిటీలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలు లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీ, విదేశీ ఉన్నత విద్యాసంస్థలను ప్రోత్సహించడంవల్ల రాష్ట్రంలో కన్వీనర్ సీట్ల విధానం ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వ యూనివర్సిటీలలో 20ఏళ్ల నుంచి బోధనా సిబ్బంది పోస్టుల నియామకం చేయలేదు. దీనివల్ల యూనివర్శిటీలలో అత్యధిక డిపార్ట్ మెంట్స్‌లో విద్యార్థులు చేరడంలేదు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసి మౌలిక సదుపాయాలు పెంచి పరిశోధనలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ విద్యా ప్రైవేటీకరణ విధానాన్ని గుడ్డిగా రాష్ట్రంలో అమలు చేస్తే ప్రజాగ్రహానికి గురవుతామని పాలకులు గుర్తించాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి