
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 అక్టోబర్, 2026.
ఎన్నికలకోసమే అడవితల్లిబాట
ఆదివాసీల మౌళిక సమస్యలు విస్మరించిన పవన్‌కళ్యాణ్
-సిపిఐ(యం)
అడవితల్లి బాట పేరుతో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పర్యటన గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు విస్మరించిందని, ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలు, 1/70 పరిరక్షణ, జివో నెం.3 పునరుద్దరణ, పోలవరం నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
రంపచోడవరం మండలం కాకవాడ గ్రామంలో అడవితల్లి బాట2.O బహిరంగ సభకు హాజరయిన పవన్‌కళ్యాణ్ ఆదివాసీలను ఆందోళనకు గురిచేస్తున్న సమస్యలపట్ల మాట్లాడకపోవడం శోచనీయం. అనేక సంవత్సరాలుగా పోడు భూముల పట్టాలకోసం గిరిజనులు పోరాడుతున్నారు. అటవీ హక్కుల చట్టం క్రింద వేలాది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అయినా వారికి ఇంకా పట్టాలివ్వలేదు. పైగా అటవీ అధికారులు ఆదివాసీ రైతుల్ని సాగుభూముల నుండి బలవంతంగా గెంటేస్తున్నారు. అటవీ అధికారులను నిలువరించి ఆదివాసీలకు రక్షణ కల్పించేందుకు ఆయనశాఖే అయినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
జివో నెంబర్ 3 పునరుద్దరించమని ఆందోళన చేస్తూ నిరుద్యోగ యువత రెండు పర్యాయాలు బంద్ నిర్వహించారు. 2025 డిఎస్సీలో గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు పోస్టులు కేటాయించకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. గిరిజన ప్రాంతానికి స్పెషల్ డిఎస్సీ ప్రకటించాలని కోరుతున్నారు. అందుకవసరమైన జివో నెంబర్ 3 పునరుద్దరించాలని పోరాడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నారు. అయినా కనీసం వాటిని పవన్‌కళ్యాణ్ తన పర్యటనలో ప్రస్తావించలేదు.
అనేక సంవత్సరాలుగా ఆదివాసీలు 1/70 చట్టం అమలుకోసం పోరాడుతున్నారు. సుప్రీం కోర్టులో గిరిజనేతర పెత్తందారులు వేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. గిరిజనుల్ని ఉద్దరిస్తామని మాటలు చెప్తున్న ప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా భూస్వాముల ఒత్తిడితో చేతులు ముడుచుకొని కూర్చున్నది. పైగా కేంద్రం మైనింగ్‌కు అనుమతులివ్వడంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని ప్రభుత్వం ఒకవైపు ప్రకటిస్తున్నది. మరోవైపు నిర్వాసితులకు పరిహారం పూర్తిగా అందలేదు. నష్టపరిహారం కోసం అనేక విజ్ఞప్తులు చేశారు. పాదయాత్రలు నిర్వహించారు. ఐటిడిఏ వద్ద, కలెక్టరు ఆఫీసుల వద్ద పలు దఫాలు ధర్నాలు చేశారు. అయినా పరిష్కారం కాలేదు. నష్టపరిహారం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. కొత్తగా కట్టిన కాలనీలలో సమస్యలు చెప్పనలవి కాదు.
ఈ సమస్యలపై కనీసం స్పందించకుండా తనవద్ద మంత్రదండం లేదని, సమయం కావాలని పవన్‌కళ్యాణ్ అనటం అన్యాయం. కేవలం స్థానిక ఎన్నికలలో లబ్ది పొందడానికే ఈ పర్యటన ఉద్దేశమైతే అంతకంటే మోసపూరితం మరొకటి లేదు.
ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు గిరిజనుల సమస్యల పరిష్కారం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి, బాధ్యత ఉన్నా వెంటనే పోడు భూములకు పట్టాలివ్వాలి. 1/70 అమలు చేయాలి. జివో నెం.3 పునరుద్దరించాలి, పోలవరం నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి నష్టపరిహారం అందచేయడానికి తక్షణం చర్యలు తీసుకొని తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
