గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల అక్రమ అరెస్టులకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 14 అక్టోబర్, 2026.
గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల అక్రమ అరెస్టులకు ఖండన
నష్ట పరిహారం కోసం గత 16 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గన్నవరం విమానాశ్రయ నిర్వాసితులను వారికి మద్దతుగా నిలిచిన నాయకులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నెపంతో పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.
విమానాశ్రయ విస్తరణ, ఏలూరు కాలువ మళ్లింపు పేర్లతో గత 13 ఏళ్లుగా వెయ్యి పేద కుటుంబాలకు చెందిన నివాసాలు, నివేశన స్థలాలు స్వాధీనం చేసుకుని ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించకపోవడం అన్యాయం.
బాధితుల ప్రతినిధి వేదవతి, తిరివీది ఏసురత్నం తదితరులను అదుపులోకి తీసుకోవడం గర్హనీయం. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సమస్య తీర్చమని కోరిన వేదవతిని మహిళ అనే విచక్షణ లేకుండా గన్నవరం వెంకటేశ్వర థియేటర్ సెంటర్‌లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం అప్రజాస్వామికం.
నిర్వాసితులకు అండగా ఉన్న సిపిఐ(యం) మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు, నాయకులు బడుగు మర్యాద దాసు, మిరప నాగేశ్వరరావు, సీపీఐ నాయకుడు కాట్రగడ్డ రామచంద్ర జోషి, ఇళ్లపై బడి అరెస్టు చేయడం దారుణం.
అరెస్టయిన వారిని ఏ స్టేషన్‌లో ఉంచారనే కనీస సమాచారం ఇవ్వకపోవడం, ఇతర ప్రాంతాలకు తరలించడం హేయమైన చర్య. సమస్యలు పరిష్కరించలేకనే ప్రభుత్వం ఇలాంటి దమనకాండకు పాల్పడుతోంది. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పోలీసు నిర్భంధం ద్వారా కాకుండా నష్టపరిహారం చెల్లించి, సమస్యను పరిష్కరించాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి