
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 15 అక్టోబర్, 2026.
నక్కపల్ల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ స్వేచ్ఛగా జరగాలి.
నిర్బంధంతో ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కడం చట్ట విరుద్దం. - సిపిఐ(యం)
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అక్టోబర్ 15న జరగనున్న మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి వెళుతున్న సిపిఐ(యం) అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణలను ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డులో పోలీసులు అడ్డుకొని అరెస్టుచేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే వారిని విడుదల చేసి ప్రజాభిప్రాయసేకరణలో పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నది.
ఈరోజు తెల్లవారి నుంచి సిపిఐ(యం) ఎస్.రాయవరం మండల కార్యదర్శి ఎం. సత్యనారాయణ, నక్కపల్లి మండల కార్యదర్శి ఎం.రాజేష్, రాజయ్యపేట సిపిఎం శాఖ కార్యదర్శి మైలపల్లి మహేష్ బాబులను గృహ నిర్బంధించడం అప్రజాస్వామికం. రైతు సంఘం జిల్లా కార్యదర్శి, సిపిఐ(యం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. అప్పలరాజును 3 రోజులుగా గృహనిర్బంధంలో ఉంచడం గర్హనీయం. అరెస్టు చేసిన వారిని, గృహనిర్బంధంలో ఉన్న వారిని భేషరతుగా విడుదల చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తుంది.
పబ్లిక్ హియరింగ్లో ప్రజలందరూ పాల్గొని వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా తెలియజేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య. కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడటానికి ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తున్నది. ప్రజాభిప్రాయ సేకరణకు వారికి అనుకూలంగా ఉండే వారిని ఆహ్వానించడం, వ్యతిరేకించే వారిపై నిర్బంధం ప్రయోగించడం దుర్మార్గమైన చర్య. దీనిని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. స్వేచ్ఛగా ప్రజాభిప్రాయ సేకరణకు వాతావరణం సృష్టించాలని కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
