
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,
తేది : 15 అక్టోబర్, 2026.
డేటా సెంటర్లపై నీతి ఆయోగ్ మార్గ దర్శకాల ప్రకారం
నిపుణులచే అధ్యయనం చేపించాలి.
నిపుణుల నివేదికలు వచ్చే వరకు డేటా సెంటర్ల అనుమతులు నిలిపివేయాలి.
` సిపిఐ(యం)
రాష్ట్రాల్లో డేటా సెంటర్లు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే సమయంలో పంచ సూత్రాలపై నిర్దిష్ట అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ తెలియజేసిన ఐదు అంశాలపై నిపుణులచే అధ్యయనం జరిపించాలని, ఆ అధ్యయన నివేదికలు వచ్చేవరకు డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులు అన్నింటిని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
డేటా సెంటర్లపై నీతి అయోగ్ నివేదికలో పేర్కొన్న ఏ అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం జరిపించలేదు. విద్యుత్తు సరఫరా చేసేందుకు అవసరమైన గ్రిడ్ ఉందా? లేదా ? అలాగే డేటా సెంటర్లు, సాధారణ విద్యుత్తు డిమాండ్ మధ్య తేడాను కూడా నిశితమైన పరిశీలన చేయలేదు. దీర్ఘకాలిక నీటి లభ్యత, నిల్వలపై కూడా అధ్యయనం చేయకపోగా, ఈ డేటా సెంటర్లకు ఎంత నీటి సరఫరా అవసరమో కూడా బహిర్గతం చేయకుండా రహస్యంగా ప్రభుత్వం తొక్కి పెట్టింది. పర్యావరణ, సామాజిక, ఆర్థిక ప్రభావ అంచనా నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల చేత రూపొందించలేదు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకపోగా డేటా సెంటర్ల వర్గీకరణను కుట్రపూరితంగా ఏ కేటగిరి నుండి బి కేటగిరీకి మార్చేసింది. 2006 కేంద్ర పర్యావరణ నిబంధనల్నింటినీ ఉల్లంఘించింది. ప్రమాదకర వ్యర్ధాలు, ఈ వేస్టు, బ్యాటరీలు, విపరీత శబ్ద కాలుష్యంవల్ల ప్రజలపై కలిగే దుష్ఫలితాలపై కూడా అధ్యయనం చేయకపోగా లక్షలాదిమంది ప్రజల నివాసాల మధ్య భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. దీర్ఘ కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సబ్సిడీలు, పన్ను రాయితీల రూపంలో వేలకోట్ల రూపాయలు రాయితీలు డేటా సెంటర్లకు కల్పించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు దీర్ఘకాలంలో కోట్లాది రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతుంది. పైగా వేల కోట్ల రూపాయల ప్రజల పన్నుల ఆదాయాన్ని కూడా డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలు కల్పనలు ప్రభుత్వం వినియోగిస్తుంది. పైగా పెద్దగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడటం లేదు.
ఈ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో ప్రజలు, మేధావులు, పౌర సంస్థలు, సంఘాలు, పర్యావరణవేత్తలు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోగా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ఈ నియంతృత్వ చర్యలు నిలిపివేయాలని, తక్షణం డేటా సెంటర్కి ఇచ్చిన అనుమతులన్నింటిని నిలిపివేయాలని, డేటా సెంటర్లవల్ల కలిగే తీవ్ర దుష్ఫలితాలపై నీతి అయోగ్ సూచించిన ఐదు సూత్రాల కనుగుణంగా నిపుణుల చేత నిశిత అధ్యయనం జరిపించాలని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని రాయితీలు, పన్ను మినహాయింపులు, భూములను వెనక్కి తీసుకోవాలనికూటమి ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
