కారణాలు చూపకుండా ఎన్నికల అధికారులు వేల సంఖ్యలో ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈవో) వివరణ ఇవ్వాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 అక్టోబర్, 2026.

కారణాలు చూపకుండా ఎన్నికల అధికారులు వేల సంఖ్యలో ఓటర్లపై

అభ్యంతరం వ్యక్తం చేసిన విషయంపై 

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈవో) వివరణ ఇవ్వాలి -సిపిఐ(యం)

రాష్ట్రంలో సర్ ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించే సమయంలో కారణాలు చూపించకుండా వేల ఓటర్ల సంఖ్యలో స్వయంగా ఎన్నికల అధికారులే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గారు వివరణ ఇవ్వాలని, వాస్తవాలు వెల్లడించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. గుండుగుత్తగా ఫారం7 సమర్పించిన వాటిని తిరస్కరించాలని కోరుతున్నాము. ఇప్పటి వరకు తొలగించిన, కొత్తగా చేర్పించిన ఓటర్ వివరాలను బహిరంగ పర్చాలని, రాజకీయ పార్టీలకు లిస్టులివ్వాలని కోరుతున్నాము.

క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పణకు గడువు పెంచకముందు ఆఖరుతేదీ అయిన అక్టోబర్ 10వ తేదీకి ముందు 12 రోజుల పాటు 20,959 మంది పేర్లు తొలగించడానికి సిఫార్సు చేసినట్లు మీడియాలో నిర్దిష్టంగా ఉదాహారణలతో వార్తలు వచ్చాయి. రాష్ట్రవ్యాపితంగా వివిధ జిల్లాల్లో తొలగింపునకు ఫారం 7 ద్వారా 40వేల పేర్లు ఇవ్వబడినాయి. ఇందులో 20,959 పేర్లు ఎన్నికల అధికారులే (ఇఆర్‌వో మరియు ఎఈఆర్‌వో) అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మీడియాలో వచ్చాయి. అయితే ఆ ఓటర్ల తొలగింపుకు నిర్దిష్టమైన కారణాలేవీ పేర్కొనలేదని వార్తలు రావడంతో ఓటర్లలో ఆందోళన మరియు అపోహలు కలుగుతున్నాయి.

ఈసిఐ రూపొందించిన యాప్ వల్లనే కారణాలు చూపించబడడం లేదని ఎన్నికల అధికారులు చెప్పడం  మరింత ఆందోళన కలిగిస్తున్నది. నిష్పక్షపాతంగా వాస్తవాలు వెల్లడించేందుకు వీలుగా అవసరమైతే ఈసిఐ యాప్‌లో తగు మార్పులు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

సర్ ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాపితంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి వార్తలు రావడం ఆందోళనకరం. అందువలన ఆంధ్రప్రదేశ్ సిఈవో గారు దీనిపై వాస్తవాలు వెల్లడించాలని  సిపిఐ(యం) కోరుతున్నది. అర్హులైన ఓటరు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది.

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి