
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 14 నవంబర్, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: రాప్తాడు బాధిత అమ్మాయిల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, విద్యార్థినులకు మరింత మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కలిపించాలని కోరుతూ...
అయ్యా!
అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన గోపిక, లక్ష్మిల ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో అనంతపురం ప్రభుత్వ వైద్యులు సమన్వయంతో అభినందనీయమైన కృషి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన సిబ్బంది, పరికరాలు అందుబాటులో ఉంచగలిగితే ఎంతటి క్లిష్టమైన వాటినికూడా అక్కడి వైద్యులు, సిబ్బంది ఎదుర్కోగలరని మరోసారి రుజువైంది.
ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి బెంగుళూరులో వైద్యం పొందుతున్న గోపిక రాప్తాడు మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన బోయ వెంకట్రాముడు, పార్వతమ్మల కుమార్తె. వీరికి ఈ అమ్మాయితోపాటు ఒక కుమారుడు ఉన్నాడు. వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ ఇద్దరి పిల్లలను చదివించుకుంటున్నారు. ఉమ్మడి ఆస్థిలో ఒకటిన్నర ఎకరం మెట్టపొలం మాత్రమే ఉంది. గోపిక ప్రస్తుతం బెంగుళూరులో వైద్యం పొందుతున్నది.
గోపికకు అండగా వెనువెంటనే స్పందించి గాయాలపాలైన విద్యార్థిని లక్ష్మి రాప్తాడు గ్రామానికి చెందిన నాగరాజు, రమాదేవిల పెద్ద కుమార్తె. వీరికి ముగ్గరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దళిత కుటుంబానికి చెందిన వీరికి ఎలాంటి ఆస్తులు లేవు. ఆర్డిటివారి సహాయంతో నిర్మించుకున్న చిన్నఇల్లు మాత్రమే ఉంది. స్నేహితురాలిపై జరుగుతున్న దారుణాన్ని సాహసంతో అడ్డుకోబోయిన లక్ష్మిపై ఆ ఉన్మాది దాడిచేయడంతో రెండు కాళ్లు తీవ్రంగా గాయమయ్యాయి. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నది.
బెంగుళూరులో చికిత్స పొందుతున్న గోపిక ఆరోగ్యాన్ని ప్రభుత్వ వైద్య సిబ్బందికి చెందిన ఒకరు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అయితే అనంతపురంలో చికిత్స పొందుతున్న లక్ష్మి దగ్గర అలాంటి ఏర్పాటులేదు. రెండు రోజుల్లో ఈ అమ్మాయిని ఆసుపత్రి నుండి డిశ్చార్జీ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారని నేను, మా పార్టీ బృందంతో కలిసి 13-11-2026న పరామర్శించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం లక్ష్మి కోలుకుంటున్నప్పటికీ వైద్య సిబ్బంది సహాయం అవసరం ఉంది.
ఈ రెండు కుటుంబాలు వ్యవసాయ కూలీ పనులమీద ఆదారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తున్నప్పటికీ ఈ అమ్మాయిల భవిష్యత్తు, చదువులు, ఇతర అవసరాలు, తల్లితండ్రులకు మానసిక ధైర్యం కలిగించేందుకు ప్రభుత్వం ఈ కుటుంబాలకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు, 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి. లక్ష్మి తల్లికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని కోరుతున్నాను.
ఈ దాడికి కారణమైన ఉన్మాది గత కొన్ని నెలలుగా గంజాయి తీసుకోవడం, ఆరాచకంగా ప్రవర్తించడం చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నివారించడంపై ప్రభుత్వ మరింత దృష్టిని పెట్టడం, గంజాయి అమ్ముతున్న, సహకరిస్తున్న వారిని అన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించడం వెంటనే చేయాల్సిన అత్యవసర కర్తవ్యంగా ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టడానికి పటిష్టమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరుతున్నాను.
గతంలో నెల్లూరులో డ్రగ్స్ మాఫియా చేతిలో హత్యగావించ బడిన పెంచలయ్య కుటుంబానికి ఇప్పటికీ ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో సహాయం అందలేదు. ఇలాంటి ఘటనల్లో నిర్లక్ష్యమైనా, కాలయాపనైనా డ్రగ్స్ వ్యతిరేక పోరాటాన్ని నీరు గారుస్తుంది. విశ్వాసాన్నిచ్చే నిర్దిష్ట చర్యలు లేకుండా కేవలం ప్రచారానికే పరిమితమైతే అది ఎలాంటి ఫలితాలు ఇవ్వదని మీ దృష్టికి తేదలిచాను.
పై అంశాలపై మీరు సకాలంలో వేగవంతమైన చర్యలు తీసుంటారని ఆశిస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
