అక్రమ బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయాలి..

 విశాఖలో బాక్సైట్‌ గనులను కొల్లగొట్టి రూ.లక్ష కోట్లు లూటీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సిపిఎం నాయకులు జితేన్‌ చౌదరి ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రస్‌ ఆల్‌ఖైమా, జిందాల్‌తో చేసుకున్న గత ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, గతంలో సిపిఎం చెప్పిన విషయాన్నే కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విడుదల చేసిన నివేదికలో పేర్కొందన్నారు. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ ఖనిజం మొత్తం 550 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ఉంటుందని, దీని విలువ సుమారు రూ.లక్ష కోట్లు ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం దీనికి రూ.11,400కోట్లుగా లెక్కకట్టి, తర్వాత ఒప్పందంలో రూ.2800 కోట్లకు కుదించిందన్నారు.బాక్సైట్‌ ఒప్పందాల్లో 98.5 శాతం ప్రయివేటు పెత్తనం ఉండేలా ప్రభుత్వాలు చూస్తున్నా యన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన తప్పుడు ఒప్పందా లనే తెలుగుదేశం, బిజెపి తిరగదోడుతూ పబ్బం గడుపుకుని కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నాయన్నారు. పార్లమెంట్‌లో సిపిఎం సభ్యులంతా దీన్ని వ్యతిరేకిస్తామని, ఇప్పటికే ప్రధానికి లేఖలు రాశామని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ బాక్సైట్‌ తవ్వకాలను ఆపకపోతే భవిష్యత్‌లో సిపిఎం, ప్రజాసంఘాలు పెద్దఎత్తున పోరాడుతాయని హెచ్చరించారు..