అఖిల భారత సమ్మెలు సంస్కరణలకు బ్రేకులు..

 ''ఇప్పటి వరకూ జరిగిన మానవ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే'' అని మార్క్ప్‌ మహానీయుడు నిర్వచించాడు. బానిసలు-బానిస యజమానులు, ప్యూడల్‌ ప్రభువులు-రైతాంగానికి మధ్య జరిగిన పోరాటాలు చరిత్రగతినే మార్చివేశాయి. ప్రస్తుతం నడుస్తున్న పెట్టుబడి దారీయుగంలోనూ కార్మిక వర్గపోరాటాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భారత కార్మికవర్గం కూడా ఉన్నత పోరాట లెన్నింటినో నిర్వహించింది. 1862 హౌరా రైల్వే కార్మికులు ఎనిమిది గంటల పనికోసం ప్రారంభించిన తొలి సమ్మెతో కార్మిక వర్గం దుర్భరమైన పని పరిస్థితులపై సమరశంఖం పూరించింది. 1908లో స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్‌ అరెస్టుకు నిరసనగా బొంబాయిలో ఆరు రోజులు జరిగిన సమ్మె నుంచి ప్రారంభించి నేటి వరకూ తమ ఆర్థిక కోర్కెల పైనే కాక దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం కార్మికవర్గ పోరాడుతూ వచ్చింది. 1990 నుంచి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాలపై నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెల్లో కూడా అదే పోరాట స్ఫూర్తి కనపడుతుంది.
1990లో తొలి సోషలిస్టు రాజ్యం కూలిపోవటంతో ప్రపంచ కార్మికోద్యమానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సామ్రాజ్యవాదం బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం ప్రపంచీకరణ పేరుతో కార్మికవర్గంపై దోపిడీకి తెగబడింది. ప్రపంచ కార్మికవర్గానికి నూతన సవాల్‌ ఎదురైన సమయంలో భారత కార్మికవర్గం ఆ సవాలును స్వీకరించి పోరాటాలకు సన్నద్ధమైంది. 1990వ దశకంలో మారిన ప్రపంచ పరిస్థితుల్లో మన దేశంలో సరళీకరణ విధానాలు అమలు జరుగుతున్నాయి. ఈ విధానాలపై భారత కార్మికవర్గం తిరుగుబాటు చేస్తూనే ఉంది. సంస్కరణలు ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే అఖిల భారత సమ్మెకు కార్మిక వర్గం ప్రచారం చేస్తున్నా తన ప్రయోజనాలతోపాటు దేశంలోని ఇతర కష్టజీవుల ప్రయోజనాల కోసం కూడా అఖిల భారత సమ్మెలు ఉపయోగపడ్డాయి. సమ్మె డిమాండ్లు ప్రజల చైతన్యం పెంపుదలకు, సంస్కరణలపై చర్చకు దోహదపడ్డాయి.
పివి రాగం మన్మోహన్‌ తాళం
1991 జూన్‌ 21న పివి నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన్మోహన్‌సింగ్‌ను ఐఎంఎఫ్‌ నుంచి దిగుమతి చేసి ఆర్థిక మంత్రిగా నియమించారు. జూన్‌ 25న నూతన పారిశ్రామిక విధాన ప్రకటనతో కార్మికవర్గంపై దాడి ప్రారంభమైంది. ప్రైవేటీకరణ తారకమంత్రంగా ప్రచారం మొదలు పెట్టింది. దీని ఆచరణకు ప్రారంభంగా ఉత్తరప్రదేశ్‌లోని దల్లా సిమెంటు ఫ్యాక్టరీని దాల్మియా కంపెనీకి అమ్మకానికి ప్రయత్నం జరిగింది. రూ.700 కోట్ల విలువైన ఆ పరిశ్రమను రూ.26 కోట్లకు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నించగా కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆరు వేల మంది కార్మికులు పోరాటంలో పాల్గొన్నారు. పోలీసు కాల్పుల్లో 14 మంది మరణించారు. ప్రైవేటీకరణకు తొలి బ్రేకు పడింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కార్మిక వర్గం తొలి విజయం సాధించింది. 1991 సెప్టెంబర్‌ 21న తొలిసారిగా సంస్కరణలపై భారత కార్మిక సంఘాలు సమర భేరీ మోగించాయి. కోటి మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. 1992 జూన్‌ 16న మరో దేశవ్యాప్త సమ్మె జరిగింది. ఇందులో కోటీ 40 లక్షల మంది పాల్గొన్నారు. 1992 నవంబర్‌ 11న న్యూఢిల్లీలో అతి పెద్ద కార్మిక ప్రదర్శన జరిగింది. 1993 ఆగస్టు 19న జైల్‌భరో కార్యక్రమం జరిగింది. ఏప్రిల్‌ 15న జరిగిన జాతీయ సదస్సులో 1993 సెప్టెంబర్‌ 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపుఇవ్వబడింది. 1994లో ప్రజాసంఘాల ఐక్యవేదిక సారథ్యంలో ఆగస్టు 15న ప్రతిజ్ఞా దినం పాటించబడింది. ఆ మరురోజే శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది. సెప్టెంబర్‌ 29 సమ్మెలో దేశవ్యాప్త కార్మికవర్గం పాల్గొంది. 1996 ఫిబ్రవరి 23న నూతన పెన్షన్‌ పథకానికి వ్యతిరేకంగా సమ్మె జరిగింది.
బిజెపి ప్రభుత్వ హయాంలో...
దేశంలో అనేక ప్రాంతాలలో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టటం ద్వారా 1998 మార్చి 19న కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలలో మార్పువస్తుందని ఆశించిన కార్మికవర్గ ఆశలు వమ్మయ్యాయి. ఏకంగా ప్రభుత్వ రంగం సంస్ధల అమ్మకానికి ఒక మంత్రినే కేటాయించిన ఘనత బిజెపి ప్రభుత్వానిది. 1998 డిశంబర్‌ 11న సమ్మె జరిగింది. నాలుగు కోట్ల మంది ఆ సమ్మెలో పాలొన్నారు.1999 అక్టోబరు 28న బీమా రంగాన్ని ప్రైవేయిటీకరించే ఐఆర్‌డిఎ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బీమారంగ ఉద్యోగులు దీనికి వ్యతిరేకంగా వినూత్న పోరాటాన్ని నిర్వహించారు. 200 మంది లోక్‌సభ సభ్యులతో పాటు కోటీ యాభై లక్షల సంతకాలు ప్రజల నుంచి సేకరించి స్పీకర్‌కు సమర్పించారు. 1993లో మల్హోత్రా కమిటీ సిఫారసులను పాక్షికంగా తిప్పికొట్టారు. 2000 మే 11న దేశవ్యాప్త సమ్మె జరిగింది. దీనికి ముందుగా 56 జాతీయ ప్రజాసంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు మార్చి 9న ఢిల్లీలో మహా ప్రదర్శన జరిగింది. 2002 ఏప్రిల్‌ 16న జరిగిన జాతీయ సమ్మెకు ఏడు కేంద్ర కార్మిక సంఘాలు, 55 ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. 2002 మార్చి 5న ఢిల్లీలో జరిగిన సమావేశంలో సమ్మె నిర్ణయం జరిగింది. ప్రజాసంఘాల జాతీయ ఐక్యవేదిక(ఎన్‌పిఎంఒ) ఈ సమ్మెను బలపర్చింది. కోటిన్నర మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. రెండవ దశ సంస్కరణల పేరుతో ప్రభుత్వం రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ, ఉద్యోగాల కుదింపు, విఆర్‌ఎస్‌, తొలగింపులు, పిఎఫ్‌ వడ్డీరేటు తగ్గింపు, ట్రేడ్‌ యూనియన్ల హక్కుల నిరాకరణ మొదలగు సమస్యలపై ఈ సమ్మె ప్రధాన డిమాండ్లు. 2003 మే 21న మరో దేశవ్యాప్త సమ్మె జరిగింది. దానికి ముందుగా ఫిబ్రవరి 26న చలో ఢిల్లీ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌టియుసి, బియంఎస్‌ ఈ సమ్మెకు దూరంగా ఉన్నాయి. లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వరంగం సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేయరాదని, వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలని, దిగుమతులపై ఆంక్షలు విధించాలని, బోనస్‌ సీలింగ్‌ ఎత్తివేయాలని, పిఎఫ్‌ వడ్డీరేటు 12 శాతానికి పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.
సమ్మె హక్కు కోసం సమ్మె
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 12 లక్షల మంది 16 డిమాండ్ల సాధన కోసం 2003 జులై 3 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. జూన్‌ 30 అర్ధరాత్రి నుండే జయలలిత ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ నాయకులందరినీ అరెస్టు చేసింది. సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్‌ చేసే ప్రయత్నం జరిగింది. హైకోర్టు సమ్మె ప్రారంభించినందుకు ఉద్యోగులను క్షమాపణ చెప్పాలని కోరింది. సుప్రీంకోర్టు ఉద్యోగులు సమ్మె చేయడం తప్పని తమిళనాడు ప్రభుత్వ నిరంకుశ చర్యలను అభినందించింది. దోపిడీదార్లు, వారి తాబేదార్లయిన పాలక వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. దీనిపై దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2004 ఫిబ్రవరి 24న మరో దేశవ్యాప్త సమ్మె జరిగిన నేపథ్యమది. సమ్మె హక్కు జన్మహక్కనే నినాదంతో దేశంమంతా హోరెత్తింది. బియంఎస్‌ మినహా మిగిలిన కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. 2003 సెప్టెంబర్‌ 26న ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాల సదస్సులో ఈ నిర్ణయం జరిగింది. 2004 జనవరి మొదటి వారంలో ఐయన్‌టియుసి కార్యాలయంలో దాని జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమ్మె నిర్ణయం చేసినా, తరువాత ఐఎన్‌టియుసి ప్లేటు ఫిరాయించింది. ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, బియంఎస్‌ ఈ సమ్మెలో పాల్గొనక పోయినా జయప్రదంగా దేశవ్యాప్త సమ్మె జరిగింది. ఐదు కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనడం విశేషం.
మన్మోహన్‌ ప్రభుత్వ హయాంలో...
2005 సెప్టెంబర్‌ 29న మరో జాతీయ సమ్మె జరిగింది. అసంఘటితరంగ కార్మికుల సమగ్ర చట్టం చేయాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, నియామకాలపై నిషేధం ఎత్తి వేయాలని, కాంట్రాక్టీకరణ నిలుపుదల చేయాలని, లైంగిక వేధింపలుు అరికట్టాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిలిపివేయాలని, విద్యుత్‌ బోర్డులను విడగొట్టడం ఆపాలని, సమ్మె హక్కు చట్టబద్ధం చేయాలనే డిమాండ్లతో ఈ సమ్మె జరిగింది. 124 విమానాశ్రయాల్లో పని చేసే ఉద్యోగులు కొత్తగా ఈ సమ్మెలో కలవడం గమనించదగ్గ విషయం. 2006 డిసెంబరు 14న జరిగిన జాతీయ సమ్మెలో అత్యధికంగా 10 కోట్ల మంది పాల్గొన్నారు. 2008 ఆగస్టు 20న ట్రేడ్‌ యూనియన్ల స్పాన్సరింగ్‌ కమిటీ పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మెలో ఐఎన్‌టియుసి, బిఎంఎస్‌ మినహా మిగిలిన కార్మిక సంఘాలన్నీ పాల్గొన్నాయి. 2010 సెప్టెంబరు 7వ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. 2012 ఫిబ్రవరి 28న మరో జాతీయ సమ్మె జరిగింది. ఐఎన్‌టియుసి, బియంఎస్‌తో సహా దేశవ్యాప్తంగా కార్మికవర్గం సమ్మెలో పాల్గొంది.
2013 ఫిబ్రవరి 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన అఖిల భారత సమ్మె మరొక ముఖ్య ఘటన. కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఐఎన్‌టియుసి, బిఎంఎస్‌లతో సహా సమ్మెకు పిలుపునివ్వటం ఒక ప్రత్యేకత. అప్పటి వరకు జరిగిన 14 సార్వత్రిక సమ్మెలను మించి దేశ చరిత్రలో మొదటిసారిగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. పైగా కార్మికుల వేతనాలు, సౌకర్యాలకు సంబంధించిన కోర్కెలకు పరిమితం కాకుండా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాయి. ఏమైనా ఈ అఖిల భారత సమ్మెలు సంస్కరణల వేగాన్ని అడ్డుకున్నాయి. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాయి. ఇప్పుడు మరోసారి కార్మికుల, కష్టజీవుల, రైతుల, కూలీల, సామాన్య ప్రజల హక్కుల కోసం సాగుతున్న పోరాటంలో సెప్టెంబర్‌ 2 సమ్మె ఒక పెద్ద ముందడుగుగా ఉండబోతోంది.
- కారుసాల శ్రీనివాసరావు