అసలే ఇసుక మాఫియా, దానికి అధికార పార్టీ అండ చేరితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వంలో భాగమైన శాసనసభ్యుడు అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి తానే స్వయంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి ఆనక అడ్డొచ్చిన తహసీల్దార్‌పై మహిళ అని కూడా చూడకుండా మందీమార్బలంతో విచక్షణారహితంగా దాడి చేయడం ఘోరం. అక్రమ ఇసుక దందాను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి చితక బాదడం దారుణం. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ప్రభుత్వ యంత్రాంగ మనోనిబ్బరంపై వేసిన వేటు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రౌడీయిజం కేవలం కొంత మంది ఉద్యోగులకు పరిమితమైంది కాదు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగంపై అధికార పార్టీ దొమ్మీగా పరిగణించాలి. తహసీల్దార్ వనజాక్షి, రెవెన్యూ సిబ్బంది ఇసుక తవ్వకాల్లో అక్రమాలను అడ్డుకోకూడదా? వారు తమ అధికార విధులను నిర్వహించకూడదా? పొద్దున లేచింది మొదలు సక్రమంగా పని చేయని అధికారులను వదిలిపెట్టే సమస్యే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే వల్లిస్తుంటారు. సిఎం ఆదేశాలను తహసీల్దార్, సిబ్బంది పాటించడం టిడిపి ఎమ్మెల్యేకు కంటగింపు అయింది. తన ఆదేశాల ప్రకారం పని చేసిన తహసీల్దార్‌పై దౌర్జన్యానికి దిగిన తమ పార్టీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటేనే చంద్రబాబు తానిచ్చిన ఆదేశాలపై నిబద్ధతగా ఉన్నట్లు లెక్క. నిందితుడు స్వపక్ష ఎమ్మెల్యే కాబట్టి వెనకేసుకొస్తే ముఖ్యమంత్రి చెప్పే సుద్దులు సచ్చుముద్దలేనని భావించాలి. ఎమ్మెల్యే దాడి చేసి మూడు రోజులవుతున్నా అరెస్టు చేయలేదంటేనే ప్రభుత్వం ఎవరి వైపున ఉందో తెలిసిపోతున్నది. పైగా అదేదో డ్వాక్రా మహిళలు, రెవెన్యూ సిబ్బంది గొడవగా, జిల్లా సరిహద్దు సమస్యగా చిత్రీకరించి ఎమ్మెల్యేని కాపాడేందుకు ప్రయత్నించడం ఆశ్రితపక్షపాతం. టెక్నాలజీని తాను తప్ప ఎవరూ అందిపుచ్చుకోలేరని తరచూ సవాల్ విసిరే చంద్రబాబు ఇప్పటి వరకు తహసీల్దార్‌పై జరిగిన దాడిపై నోరు మెదపలేదెందుకు? సమాచారం సిఎంకు ఇంకా చేరలేదా, తెలిసినా స్పందించదలుచుకోలేదా?
ప్రభుత్వ పాలనలో తహసీల్దార్ అంటే సాదా సీదా ఉద్యోగి కాదు. రెవెన్యూ మండలానికి సర్వోన్నత అధికారి. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. పోలీస్ ఫైరింగ్‌కు ఆదేశాలిచ్చే అధికారం ఉన్న వ్యక్తి. అలాంటి అధికారినే జుట్టుపట్టుకొని ఈడ్చిపారేశారు. ఆమె సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశారు. తహసీల్దార్ ముందే రెవెన్యూ సిబ్బందిని బాదారు. తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, రక్షణ కల్పించాలని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని తహసీల్దార్ కంటతడిపెట్టి, సర్కారుకు ఫిర్యాదు చేశారంటే అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్మార్గాల తీవ్రత అర్థం కావట్లేదా? మహిళా అధికారిని ఎమ్మెల్యే చెరబడితే, ఇక సాధారణ మహిళల రక్షణ సంగతేంటి? మహిళలను ఉద్ధరిస్తామంటున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఇసుక అక్రమ రవాణాకు ఒడిగట్టిన చింతమనేని మామూలు ఎమ్మెల్యే కూడా కాదు. ప్రభుత్వ విప్. కేబినెట్ మంత్రి హోదాలో ఇసుక అక్రమాలకు పాల్పడటమేంటి? అడ్డుకున్న ప్రభుత్వ యంత్రాంగంపై వీధి రౌడీలా గూండాయిజానికి దిగడమేంటి? సర్వత్రా నిరసనలు ఎగసిపడ్డాకైనా సదరు ఎమ్మెల్యేలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోగా దుందుడుకుతనం తన నైజమని నొక్కి వక్కాణించడం మరీ దారుణం. చింతమనేనిపై రౌడీషీట్ సహా 34 కేసులున్నాయి. గతంలో తన ఇసుక అక్రమాలకు అడ్డొచ్చిన ఆర్‌డిఒ, డిపిఒలపై దాడి చేసిన చరిత్ర ఉంది. ఉన్నతాధికారులపైనే దాడి చేసిన సదరు ఎమ్మెల్యేకి మహిళా తాహసీల్దార్ ఒక లెక్కా? ఇంత నేర చరిత్ర ఉన్న వ్యక్తిని చంద్రబాబు ఎమ్మెల్యేను చేయడమే కాకుండా విప్ పదవి కూడా కట్టబెట్టారంటే అతని అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లే అనుకోవాలి.
కొన్నేళ్లుగా ఇసుక అక్రమాలకు భౌగోళిక, రాజకీయ ఎల్లలు ఏమాత్రం లేవు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ప్రధాన పార్టీల నేతలు ఇసుక దోపిడీలో పాల్పంచుకోవడం తెలిసిందే. దొంగలు దొంగలు ఊళ్లుపంచుకున్న బాపతు. లావాదేవీల్లో తేడా వచ్చినప్పుడు విమర్శించుకోవడం, అంతా బాగుంటే గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని కానివ్వడం మామూలైపోయింది. విచ్చలవిడి తవ్వకాల వలన భూగర్భ జలాలకు, పర్యావరణానికి ముప్పు వాటిల్లిందని గతంలో హైకోర్టు కొరడా ఝుళిపించింది. కోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. దీంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇసుక ధర మాత్రం కొండెక్కింది. పేదలకు, పక్కా ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఉన్నా అమలు కావట్లేదు. సంప్రదాయక ఎడ్లబళ్లపై ఏ నది నుంచైనా ఇసుక తీసుకెళ్లొచ్చనే నిబంధన ఏమైందో తెలీదు. డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్‌ల వద్ద సీనరేజి వసూలు బాధ్యతలు అప్పగింత మోసం. పేరు డ్వాక్రా మహిళలది కాగా ఆ ముసుగులో 'పెద్దలు' ఇసుకను అక్రమంగా కొల్లగొడుతూ కోట్లకు పడగలెత్తడం ప్రభుత్వ లోపభూయిష్ట విధానానికి నిదర్శనం. తాజాగా కృష్ణా జిల్లాలో మహిళా తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ప్రజలకు రక్షణ లేదని, సెక్షన్ 8 అమలు చేయాలని ఢిల్లీకి ప్రదక్షిణలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం తన ఏలుబడిలో తన అధికారులకే రక్షణ కల్పించలేకపోతే ఎలా?