జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలన నిర్వహిస్తున్న తీరు అప్రజాస్వామికం, దుర్మార్గం. ఏ మాత్రం చట్టబద్ధత కానీ, రాజ్యాంగబద్ధత కానీ లేని ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో సర్వం తామే అయి వ్యవహరిస్తున్న విధానం విస్మయాన్ని కలిగిస్తోంది. రేషన్ కార్డులు, ఫించన్ల నుండి వరద సాయం వరకు క్షేత్రస్థాయిలో అన్ని అంశాల్లో జన్మభూమి కమిటీలదే పెత్తనం కావడంతో స్థానిక సంస్థలు నామమాత్రంగా మారుతున్నాయి. జన్మభూమి కమిటీల నీడలో ఉనికి కోల్పోతున్న స్థానిక సంస్థల ప్రతినిధులు తమ హక్కుల కోసం ఎలుగెత్తాల్సిన స్థితి వచ్చినా రాష్ట్ర సర్కారులో చలనం లేకపోవడం చూస్తుంటే అస్మదీయులకు లబ్ధి చేకూర్చే రంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతగా పట్టుకుందో అర్థమవుతోంది. స్థానిక సంస్థలకు సమాంతరంగా మరో వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనే రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తామంటూ చేసిన ప్రమాణానికి విరుద్ధం. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి, అనుభవజ్ఞుడినంటూ ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఈ విషయం తెలియదనుకోలేం. తెలిసే స్థానిక సంస్థల హక్కులను ధ్వంసం చేయడానికి సిద్ధపడుతున్నారంటే సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం బరితెగించడం మినహా మరొకటి కాదు. అస్మదీయులను సంతృప్తి పరచడం, తమ వారు కాదనుకున్నవారిని అన్ని విధాల ఇబ్బంది పెట్టడమే దీని అర్థం. ఈ తరహా రాజకీయ కక్ష సాధింపునకు ముఖ్యమంత్రి స్థాయిలోనే వ్యూహ రచన జరగడం దారుణం!
జన్మభూమి కమిటీల ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఉదాత్తంగా కనిపిస్తాయి. రాజకీయాలకు సంబంధం లేకుండా గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలందరిని కలుపుకుని ఈ కమిటీలు పనిచేస్తాయన్నట్లుగా అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. అయితే, ఆచరణలో దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించింది. పచ్చచొక్కాలతో కమిటీలను నింపేసింది. తెలుగుదేశం పార్టీకి అనుబంధ కమిటీలుగా వాటిని మార్చివేసింది. పచ్చ చొక్కాలమయంగా మారిన జన్మభూమి కమిటీల పర్యవేక్షణలోనే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ధేశించింది. ఆ కమిటీలు సిఫార్సు చేసిన వారికే సంక్షేమ ఫలాలను అందాలని ఆదేశించడంతో గ్రామ పంచాయతీల వంటి రాజ్యాంగబద్ధ సంస్థల ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ప్రజలందరి సమక్షంలో పారదర్శకంగా నిర్వహించే గ్రామసభలు ప్రాధాన్యత కోల్పోయాయి. లబ్ధిదారుల జాబితా ఖరారు కోసం అధికారులు కూడా జన్మభూమి కమిటీల వెంట తిరగాల్సి వస్తోందంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దీనిని అవకాశంగా తీసుకున్న కమిటీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అర్హుల పేర్లను సైతం జాబితాల నుండి నిర్దాక్షణ్యంగా తొలగిస్తున్నారు. పై స్థాయి నేతల అండదండలు తోడవడంతో మరింత అడ్డగోలుగా వ్యవహరించడానికీ సిద్ధపడుతున్నారు. అధికారపార్టీ కార్యకర్తలకు తప్ప ఇతరులకు సంక్షేమ ఫలాలు అందించడానికి ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న ఒకప్పటి సారా ఉద్యమ నేత దూబగుంట రోశమ్మకు పించను నిలిచిపోవడమూ ఈ తరహా వికృత చర్యల్లో భాగమే! పత్రికల్లో ఆ విషయం వచ్చి రచ్చ కావడంతో నాలుక కరుచుకున్న ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇదే తరహాలో పించన్లు కోత పడి, జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరుగుతున్న ఇతర అభాగ్యుల విషయంలో ప్రభుత్వం ఈ మాత్రం ఉదారత చూపించలేకపోయింది. మీడియా కథనాలను ప్రసారం చేసినా, పత్రికలు వార్తలు ప్రచురించినా, బాధితులు ఎంఆర్‌ఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి మొరపెట్టుకున్నా దున్నపోతుమీద వానపడిన చందంగానే మారుతోంది. భారీ వర్షాలు, వరదల బారిన పడి సర్వస్వాన్ని కోల్పోయిన ప్రజానీకం పట్ల దేశమంతా సానుభూతి చూపిస్తుంటే జన్మభూమి కమిటీలు మాత్రం రాజకీయ విధేయతలు వెతుకుతున్నాయంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు భాదితులను గుర్తించి, వారికి సాయం అందించాల్సి ఉండగా, ఆ పనిని కూడా ఈ కమిటీలకు అప్పగించడం, ప్రభుత్వమిచ్చే అరకొర సాయాన్ని కూడా సొంత పార్టీ నేతలకు పలహారంగా మార్చడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట! రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ తరహా దుర్మార్గపు విధానాలకు స్వస్థిపలకాలి. రాజ్యాంగేతర శక్తులుగా మారి, పేద ప్రజలకు నామమాత్రంగా దక్కే ప్రయోజనాలను గద్దలా తన్నుకెళ్లుతున్న జన్మభూమి కమిటీలను తక్షణం రద్దు చేయాలి. నిరంకుశత్వంతో కూడిన అప్రజాస్వామిక విధానాలకు భిన్నంగా పారదర్శకతతో నిండిన ప్రజాస్వామిక చర్యలను చేపట్టాలి. దీనికి భిన్నంగా అస్మదీయుల ప్రయోజనాలే కీలకమని భావిస్తే బాధిత ప్రజానీకం తమ సమయం వచ్చినప్పుడు చెప్పే గుణపాఠానికి సిద్దపడాలి.