ఆంధ్రుల స్ఫూర్తి ప్రదాత బ్రౌన్‌..

ఆంధ్ర భాషా సారస్వతాలకు ఎనలేని సేవచేసిన ఆంగ్లేయ సివిల్‌ ఉద్యోగి, ఆంగ్ల విద్వాంసుడుగా గణుతికెక్కిన సర్‌ ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. మిణుకు మిణుకు మంటున్న తెలుగు సాహిత్యాన్ని ఒంటి చేత్తో కృషిచేసి జాజ్వల్యమానంగా వెలిగించే కర్తవ్యాన్ని నిర్వహించిన ఆంగ్లేయుడు. 1798 నవంబరు 10న ఒక క్రైస్తవ మిషనరీ కుటుంబంలో కలకత్తాలో (కోల్‌కతా) జన్మించాడు. ఆయన తండ్రి డేవిడ్‌ బ్రౌన్‌ బహు భాషా కోవిదుడు. తన పిల్లలు కూడా అలాగే కావాలని కోరుకునేవాడు. బ్రౌన్‌ చిన్ననాటి నుంచే ఇంగ్లీషు, హిబ్రూసిరియన్‌, అరబ్బీ, పారశీక, గ్రీకు, లాటిన్‌, బెంగాలీ, వంటి పెక్కు భాషలను క్షుణ్ణంగా అభ్యసించాడు. తన తండ్రి మరణానంతరం 1812లో ఇంగ్లాండుకు వెళ్లి ఐసిఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై 1817లో ఈస్టిండియా కంపెనీలో సివిల్‌ ఉద్యోగిగా మద్రాసు ప్రెసిడెన్సీకి వచ్చాడు. అప్పటి వరకు తెలుగే ఆయనకు తెలియదు. అప్పటి మద్రాసు గవర్నర్‌ సర్‌ధామన్‌ మన్రో జూనియర్‌ సివిల్‌ సేవకులను ప్రజల భాష తెలుసుకోవాలని, అప్పుడే ఆ దేశ ప్రజల బాధలు, మనోభావాలు అర్థం చేసుకోవడం వీలవుతుందని సలహా ఇచ్చాడు. సిపి బ్రౌన్‌ను ఆ మాటలెంతో ఆకర్షించాయి. మొదట ఆయన కడపలో హన్‌బరీ దగ్గర పనిచేయడానికి నియమితుడయ్యాడు. హన్‌బరీ ధారాళంగా తెలుగు మాట్లడడం గమనించిన బ్రౌన్‌ రెండు సంవత్సరాల కాలంలో తెలుగు భాషపై ఆయన కంటే ఎక్కువ పట్టు సాధించాడు. ఆంధ్ర ప్రాంతంలో భిన్న పదవులు నిర్వహించటం వల్ల ఆయనకు తెలుగు భాష నేర్చుకోవాలనే దృఢసంకల్పం కలిగింది. మద్రాసులో వెలగపూడి కోదండరామయ్య వద్ద తెలుగు భాషను నేర్చుకున్నాడను. పరబ్రహ్మ శాస్త్రి వల్ల తెలుగు కావ్యాలు చదువడం మొదలు పెట్టాడు. 1822లో తెలుగువారి ముఖ్యకేంద్రమైన మచిలీపట్నం వచ్చిన తర్వాత తెలుగులో మరింత పాండిత్యం సంపాదించాడు. ఆంధ్ర భాషను అధ్యయనం చేయడమేగాక, తాను పరిశోధకుడై అంతకుముందు ఎవరూ చేపట్టని మహోన్నత కార్యాలను చేపట్టాడు. ఆంధ్ర భాషాభివృద్ధికి గణనీయమైన సేవ చేశాడు. మొట్టమొదట రాష్ట్ర భాషా మండలిలో ఆంగ్లేయులతో పాటు తెలుగు పండితులు కూడా కూర్చొనే అవకాశం కల్పించాడు. ఆయన ఆంధ్ర భాషా పరిజ్ఞానం గుర్తించిన ఆంగ్ల ప్రభుత్వం లండన్‌ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు గౌరవ ఆచార్యునిగా నియమించింది. రాయల్‌ ఏసియాటిక్‌ సొసైటీ సభ్యునిగా, మద్రాస్‌ లిటరరీ జర్నల్‌ సంయుక్త సంపాదకునిగా, మద్రాసు ప్రభుత్వానికి తెలుగు అనువాదకునిగా, మద్రాసు లిఖిత పుస్తక భాండాగార క్యూరేటర్‌గా ఆయన ఎనలేని సేవ చేవలందించాడు. 1854లో పక్షవాతానికి గురైనా ఆంధ్ర భాషాభివృద్ధిని మాత్రం విస్మరించలేదు.
తెలుగుభాషకు బ్రౌన్‌ చేసిన సేవలు అమోఘం. ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు తయారు చేయడమే కాక తెలుగు సామెతలను సంకలనం చేశాడు. వేమన పద్యాలు, ఎన్నో గ్రంథాలను పండితులతో పరిష్కరింపజేశాడు. ఎక్కడెక్కటి నుంచో తాళపత్ర గ్రంథాలు సేకరించి భద్రపరచడమే కాక ఒక గ్రంథానికి సంబంధించిన మూడు నాలుగు రకాల ప్రతులు లభించినప్పుడు ఏది అసలో తెలుసుకోవడానికి శ్రమించి పరిష్కరించి ముద్రింపజేశాడు. ఆయన తన సొంత వ్యయంతో మచిలీపట్నంలో రెండు, కడపలో రెండు తెలుగు పాఠశాలలు నిర్వహించాడు. తన సొంత డబ్బు వెచ్చించి మరుగునపడిన కావ్యాలను వెలికి తీసి, రాతప్రతులను సేకరించి వాటికి ప్రతీకలు రాయించాడు. శ్రీకృష్ణ దేవరాయల వలె ఆయన అనేక మంది పండితులను, కవులను పోషించి అనేక గ్రంథాలను పరిష్కరింపజేసి వ్యాఖ్యానాలు రాయించి, శిథిలమైపోతున్న ఎన్నో గ్రంథాలను ముద్రింపజేశాడు. ఆయన పోషించిన పండితులను ''బ్రౌన్‌ కాలేజీ'' అంటారు. ఈ కాలేజీలోని ముఖ్య పండితులుగా రావిపాటి గురుమూర్తి శాస్త్రి, పఠ్యం ఆదిత్య పరబ్రహ్మశాస్త్రి, జూలూరు అప్పయ్య మొదలగు వారు ఉన్నారు. వీరి సేవలను వినియోగించుకుని వసుచరిత్రము, మనుచరిత్రము, కళాపూర్ణోదయము, విజయవిలాసము మొదలగు కావ్యాలను ప్రచురించాడు. తాను స్వయంగా పరిశోధకుడై ఆంధ్రేతరులు ఆంధ్ర భాషను సులువుగా అభ్యసించేందుకు నిఘంటువులు, వ్యాకరణము, వాచకము రాశాడు. 1852 నుంచి 1862 మధ్య కాలంలో సుమారు 30 గ్రంథాలు ప్రచురించాడు. వేలకొలది వేమన పద్యాలను సేకరించి వాటిని ఆంగ్లంలోకి అనువదించి ముద్రించాడు. మెకంజీ సేకరించిన లిఖిత ప్రతులను, ఆయన స్వీకరించిన లిఖిత ప్రతులను మద్రాసు కాలేజీ లైబ్రరీకి, మద్రాసు లిటరరీ సొసైటీకి ఉచితంగా బహూకరించాడు. మద్రాసు నగరంలోని ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారమే ఆయన సాహిత్య సేవకు నిదర్శనం. తన కృషి ద్వారా మిణుకు మిణుకు మంటున్న ఆంధ్ర భాషా సాహిత్య దీపాన్ని దేదీప్యమానంగా వెలుగొందేట్టు చేశాడు. ఆయన 1884లో లండన్‌లో కన్నుమూశాడు. ఆంధ్రులకు ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు.
- గోల రామారావు
నేడు సిపి బ్రౌన్‌ జయంతి