ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రజలే తిరస్కరించాలి..

స్వాతంత్రనంతర చరిత్రలో సత్ప్రవర్తనతో ఉంటానని వ్రాత పూర్వకమైన హామీ ప్రభుత్వానికిచ్చి పనిచేస్తున్న ఒకే ఒక్క సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. సరిగ్గా 68 సంవత్సరాల క్రితం 1948 ఫిబ్రవరి 4న ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు)ను నాటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత మరి రెండుసార్లు ఆర్‌ఎస్‌ఎస్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఒకసారి 1975 అత్యవసర పరిస్థితిలో, 1993లో బాబరీ మసీదును కూల్చినప్పుడు. పైకి ఏమి చెప్పినా, వ్రాత పూర్వకంగా క్షమార్పణలు చెప్పినా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వభావంలో ఎటువంటి మార్పులేదని చరిత్ర నిరూపిస్తున్నది. ప్రస్తుతం అది మరింత శక్తివంతంగా తయారై తన ఫాసిస్టు భావజాలాన్ని విరజిమ్ముతున్నది. అనేక మంది మధ్యతరగతి మేధావులు దాని పుట్టుపూర్వోత్తరాలు, పాపాల చిట్టా గురించి మర్చిపోతున్నారు.
నిషేధించదగిన పాపాలే చేసింది
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు దారుణమైన పాపాలకు ప్రేరణగా నిల్చింది. ఒకటి, గాంధీజీ హత్య (30.1.1948), రెండు, బాబరీ మసీదు విధ్వంసం (6.12.1992). ఈ రెండూ మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు జీవనాడిలాంటి లౌకిక వ్యవస్థపై విసిరిన సవాళ్లు. స్వాతంత్య్రం వచ్చిన ఐదు నెలలకే స్వాతంత్రోద్యమానికి తిరుగులేని నాయకత్వం వహించిన మహాత్మాగాంధీని ఆర్‌ఎస్‌ఎస్‌/ హిందూ మహాసభల కార్యకర్త నాథూరం గాడ్సే కాల్చి చంపాడు. గాంధీజీ హత్యపై ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు తమ అభిప్రాయాలను పరోక్షంగా చెబుతూనే ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి గాడ్సే ఒకనాడు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైనా గాంధీజీ హత్యనాటికి తమ సభ్యుడు కాదని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఈ విషయాన్నే గోపాల్‌ గాడ్సే 'నాథూరాం గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌కు సైద్ధాంతికంగానూ, ఆచరణలోనూ సభ్యుడే. ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిమానేయడం ఆ సంస్థ కార్యకర్తలను హత్యానేరం నుంచి కాపాడడానికే' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఇదే తతంగం బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా కూడా ఆర్‌ఎస్‌ఎస్‌, దాని కాషాయపరివారం నడిపింది. బాబరీ మసీదుపై కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. కేవలం సేవ చేస్తా మని పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ (బిజెపి) అగ్రనాయకులే దగ్గరుండి 1992 డిసెంబరు 6న బాబరీ మసీదును కూల్చేశారు. కానీ కూల్చివేత పూర్తికాగానే మొసలి కన్నీరు కార్చడం, క్షమాపణలు చెప్పడం మొదలెట్టారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ నిజస్వరూపం..
నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ను అభిమానిస్తున్న, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి పట్టించుకోనివారిలో చాలామందికి దాని నిజస్వరూపం తెలియదు. గాంధీజీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించే సందర్భంగా ప్రభుత్వ ప్రకటనలో ''అవాంఛనీయమైన, ప్రమాదకరమైన కార్యకలాపాలను సంఘం నిర్వహిస్తున్నది. దేశంలోని అనేక ప్రాంతాలలో దీని సభ్యులు లూఠీలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, వంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. తుపాకులు, మందుగుండు సామాగ్రి వంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా సేకరిస్తున్నారు. ప్రజలను ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించే కరపత్రాలు పంచుతున్నారు. అందువల్ల నిషేధించడం జరిగింది' అని పేర్కొంది. వాస్తవానికి గాంధీజీ హత్యకు ముందు దేశ విభజన సందర్భంగా భయంకరమైన మత కలహాలు చెలరేగాయి. దారుణమైన మారణకాండ జరిగింది. ఆ ఘటనలను నిలవరించడానికి, మత సామరస్యాన్ని ప్రచారం చేస్తున్నాడనే గాంధీజీపై ఆర్‌ఎస్‌ఎస్‌ వారికి ద్వేషం. నిషేధం తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతలకూ, ప్రభుత్వానికీ మధ్య చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ప్రభుత్వం వీరి మీద నిషేధం ఎత్తివేయడానికి పెట్టిన షరతులు చూస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ నిజస్వరూపం అర్థం అవుతుంది. 1. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం, 2. మూడు రంగుల జాతీయ పతాకాన్ని గౌరవించడం, 3. హింస, రహస్య కార్యకలాపాలను నిలిపివేయడం, 4. ప్రత్యక్ష రాజకీయాలో పాల్గొనకుండా ఉండటం. ఈ షరతులన్నింటినీ ఆర్‌ఎస్‌ఎస్‌ రాతపూర్వకంగా అంగీకరిస్తూ నిబంధనావళిని రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. 1949 జులై 11న ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మన దేశ రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని తీవ్రంగా వ్యతిరేకించే సంస్థ. మూడు రంగుల జెండాను రాజ్యాంగ సభ ఆమోదించగానే దాన్ని అపహాస్యం చేస్తూ తన పత్రిక 'ఆర్గనైజర్‌' సంపాదకీయంలో 'అదృష్టం కొద్దీ తంతే గారెల బుట్టలో పడ్డట్టు అధికారంలోకి వచ్చిన వాళు ్ల మన చేతుల్లో మూడు రంగుల జెండా తెచ్చిపెట్టారు. కానీ దీన్ని హిందువులు ఎవరూ గౌరవిం చరు. సొంతం చేస్కోరు. మూడు అంటేనే అశుభం. ఇక మూడు రంగుల జెండా అనేది కచ్చితంగా ఒక చెడ్డ మనస్వత్వాన్ని, ముప్పును మన దేశానికి తెచ్చిపెడుతుంది' అని రాశారు. భారత రాజ్యాంగాన్ని కూడా వీరు అదే విధంగా అపహాస్యం చేశారు. నిషేధం ఎత్తేయించుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమి రాసిచ్చినా ఆచరణలో తమ సిద్ధాంతం నుండి ఇసుమంతైనా పక్కకు జరగలేదని అర్థం అవుతుంది.
ప్రమాదకరమైన సిద్ధాంతం-ఆచరణ
హిందూమహాసభ నాయకుడు, గాంధీజీ హత్యకేసులో మొదటి కుట్రదారుడైన విడి సావర్కార్‌ 'రాజకీయాలను హిందూకరించాలి. హిందూ మతాన్ని సైన్యీకరించాలి' అని పిలుపునిచ్చాడు. ఆర్‌ఎస్‌ఎస్‌, దాని ఉపాంగాలు తు.చ తప్పకుండా దాన్ని పాటిస్తున్నాయి. 2014లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఆ వైపు వారి కృషి జోరందుకున్నది. తమ నాయకత్వాన స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ తన వేగాన్ని పెంచింది. దేశంలోని ఏడువందల కీలకమైన సంస్థలను ఎంచుకొని వాటికి తమ అనుయాయుల్ని అధినేతలుగా పెట్టడానికి నిర్ణయించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ జాబితాను కేంద్ర మంత్రివర్గానికి ఇచ్చింది. ఇప్పటికే ఎన్‌సిఇఆర్‌టి, ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెసు, పూణే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, అనేక ప్రతిష్టాత్మక మైన విద్యాసంస్థలకు, వేదికలకు ఎవరిని అధిపతులుగా పెట్టాలో నిర్ణయించి అమలు జరపడం ప్రారంభించారు. దీనిపై ఎంత వివాదం చెలరేగినా ఏమాత్రం బెరుకు లేకుండా తాము అనుకున్నది చేసుకుపోతున్నది బిజెపి ప్రభుత్వం. చివరకు కేబినెట్‌ సమావేశం ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతల సమక్షంలో జరిగి నట్లు, అనేక విషయాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ సూచనలు ఇచ్చినట్లు, కొందరు మంత్రులను చివాట్లు పెట్టినట్లు కూడా పత్రికలలో వచ్చింది. హర్యానాలో క్రూరమైన కుల దురహంకార హత్యలు కొనసాగుతూ ఉంటే ప్రధాన మంత్రి మహిళల అభ్యున్నతిలో హర్యానాను పొగుడుతూ ''మన్‌ కీ బాత్‌''లో ప్రకటించడం చూస్తే ఎంత ప్రమాదకరమైన ధోరణు లు ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు తెస్తున్నదో అర్థం అవుతున్నది. మళ్ళీ అయోధ్యలో రామమందిర నిర్మాణం సమస్యను ముందుతెస్తున్నది.
విస్తరిస్తున్న ప్రమాదం...
1938లోనే నాటి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత గోల్వాల్కర్‌ పేర్కొన్న అంశాలన్నింటినీ ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆర్‌ఎస్‌ఎస్‌ తు.చ తప్పకుండా పాటిస్తున్నది. గోల్వాల్కర్‌ ప్రపంచ మానవాళిని సర్వ నాశనం చేసిన మానవ రాక్షసుడు, జర్మనీ అధినేత హిట్లర్‌ను పొగుడుతూ 'జర్మనీ తమ దేశం నుంచి యూదులు వంటి జాతుల్ని నిర్మూలించడం ద్వారా ప్రపంచాన్ని కుదిపేసింది. జాతీయ గౌరవాన్ని సముచిత స్థానంలో నిలిపింది. వివిధ జాతులు, సంస్కృతులు తమ మధ్యనున్న మౌలిక విభేదాలన్నింటినీ విస్మరించి ఐక్యం కావడం ఎంత అసాధ్యమో వారు చేసి చూపించారు. ఇది హిందుస్థాన్‌లో మనం నేర్చుకోవాలి. లాభపడాలి' అంతేకాదు 'ఇతర మతస్థులు విదేశీయుల్లా ఉండకుండా ఉండాలంటే హిందువులకు లోబడి ఉండాలి. ఎటువంటి కోరికలూ కోరరాదు. ప్రత్యేకతలు ఆశించకూడదు. కనీసం పౌరహక్కులు కూడా అడగకూడదు' అని గోల్వాల్కర్‌ తన గ్రంథంలో రాశాడు. ఇది నేటికీ ఆర్‌ఎస్‌ఎస్‌వారికి ఆరాధ్య గ్రంథమే. ఇతర మతస్థులు ఈ దేశస్థులు కాదని, భారత్‌ అంటే హిందూ అని ఒప్పించటానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నం.
ప్రజలే తిరస్కరించాలి...
ఆర్‌ఎస్‌ఎస్‌ లేక హిందూత్వ శక్తులు అత్యంత శక్తివంతంగా తయారైన నేటి తరుణంలో దీన్ని పరిగణించ డానికి, దాని పుట్టుపూర్వోత్తరాలను, దాని వాదనలలోని అసలు బండారాన్ని బయటపెట్టాలి. ఎన్నికలలో బిజెపి గెలుపు ఓటములతో మతోన్మాద ప్రమాదం ముడిపడిలేదు. హిందు మతోన్మాదం లౌకిక తత్వంపైనా, ప్రజాస్వామ్య విలువలపైనా, ఫెడరల్‌ వ్యవస్థపైనా చేస్తున్న దాడిని ఓడించడంపై మతోన్మాద ప్రమాదాన్ని తుదముట్టించడం ఆధారపడి ఉంటుంది. అలాగే మతోన్మాదానికి ఊపిరులూదు తున్నది ఉదారవాద ఆర్థిక విధానాలు. మరో పక్క కరుడుగట్టిన కులవ్యవస్థ. వీటికి వ్యతిరేకంగా జరిగే అన్ని పోరాటాలను మిళితం చేయడం ద్వారా ఈ ఫాసిస్టు తరహా హిందూ మతోన్మాదాన్ని శాశ్వతంగా ఓడించగలుగుతాం. అందువలన చాలామంది మధ్యతరగతి మేధావులు కోరుతున్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ప్రజలు చైతన్యపూరితంగా హిందూ మతోన్మాదాన్ని, అలాగే ఇతర మతాలలో పెరుగుతున్న మత ఛాందస భావాలను, వేర్పాటువాదాలను తిరస్కరించడం ద్వారానే అది సాధ్యమవుతుంది.
-- ఆర్‌ రఘు
(వ్యాసకర్త సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి)