ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్‌పై శుక్రవారంనాటి ఉగ్రవాద దాడితో టర్కీలో జరుగుతున్న జి20 సమావేశం దృష్టి ప్రపంచ ఆర్థిక పరిస్థితి మీదనుండి ఉగ్రవాదం మీదికి మళ్లింది. ప్రపంచంలోని అన్ని సంస్కృతులకు ద్వారాలు తెరిచి ఉంచే పారిస్ నగరంలో ఉగ్రవాదలు సృష్టించిన మారణ హోమంలో 128 మంది అమాయకులు మ్యత్యువాత పడడం, వందలాది మంది క్షతగాత్రులు కావడం దిగ్భ్రాంతికరం. ఈ దాడి తరువాత నగరం ఇప్పుడు పాత ధోరణిని కొనసాగిస్తుందా లేక శరణార్ధులకు, ఇతర జాతుల ప్రజలకు ద్వారాలు మూసేస్తుందా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లో ఇప్పుడు జరిగింది అతిపెద్ద ఘాతుకం. పారిస్‌పై బరితెగించింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్-సిరియా (ఐఎస్‌ఐఎస్-ఐసిస్) ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించింది. సిరియాలో ఫ్రాన్స్ సైనిక దాడులకు ఇది ప్రతీకార చర్య అని పేర్కొంది. 2008లో మన ముంబయి నగరంపై జరిగిన దాడిని ఇది తలపింపజేసిందంటున్నారు. నివ్వెరపర్చిన పారిస్ నరమేధంపై తరతమ భేదం లేకుండా ఒకవైపు సంఘీభావాలు వ్యక్తమవుతుంటే మరో వైపు ఉగ్రవాదంపై పోరును తాను ముందుండి నడిపిస్తామని శపథం చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు సిరియాలోని అమాయక ప్రజలపై వైమానిక దాడులకు తెగబడడం ప్రపంచాన్ని కలవర పరుస్తోంది. ఉగ్రవాదుల భయానక హత్యాకాండను మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అదే సమయంలో ఉగ్రవాదంపై పోరు పేరుతో ఫ్రాన్స్ దాని మిత్ర దేశమైన అమెరికా సిరియా ప్రజలపై హత్యాకాండ సాగిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నారు. గతంలో న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై ఉగ్రవాద దాడికి నిరసనగా నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసిన శపథాలు గుర్తుకొస్తున్నాయి. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌లోనూ, ఇరాక్‌లోనూ సాగించిన మారణ కాండ, చివరికి ఈ పేరుతో అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ పౌరహక్కులపై జరిగిన దాడులూ ప్రపంచ ప్రజల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇరాక్‌లోనూ, క్యూబాలోని గ్వాంటినామో బే లోనూ ప్రపంచంలోని ఇంకా అనే దేశాల్లోనూ రహస్య కేంద్రాలు తెరిచి వేలాదిమందిని చిత్రహింసలకు గురిచేసిన వికృతాలు నిన్నటి వరకు సరికొత్త వార్తలుగానే సాగాయి. ఇప్పుడు ఐసిస్‌పై పోరు పేరుతో మరో సారి చెలరేగిపోతే అది సిరియాకే కాదు, మొత్తం ప్రపంచానికే చేటు తెస్తుంది.
నిజమే ఐఎస్ ఉగ్రవాదాన్నే కాదు, ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడున్నా మట్టు బెట్టాల్సిందే. కాని ఈ ఉగ్రవాదం ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? సామ్రాజ్యవాదపు వికృత శిశువే ఉగ్రవాదం. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ 2003లో ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో పుట్టింది. లిబియా, సిరియాల్లో అంతర్యుద్ధాల సందర్భంగా మరింత పెరిగి విస్తరిస్తూ వచ్చింది. అంతకు ముందు ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి సందర్భంగా అల్‌ఖైదా అభివృద్ధి చెంది, విస్తరించింది. దానికన్నా ముందు ఆఫ్ఘన్‌లో రష్యాపై అమెరికా యుద్ధం చేసిన సందర్భంగా తాలిబాన్లు పుట్టుకొచ్చారు. అందువల్ల ప్రపంచంలో ఉగ్రవాద పుట్టకకూ, సామ్రాజ్యవాద యుద్ధ కాంక్షకూ సంబంధం ఉన్నదన్న విషయం గత రెండు దశాబ్దాల ప్రపంచ పరిణామాలు గమనిస్తే స్పష్టమవుతుంది. సిరియాలో అంతర్యుద్ధాన్ని రగిలించి, అన్ని రకాల ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేస్తూ అసద్ సర్కారుకు వ్యతిరేకంగా నెత్తురు పారిస్తున్న పశ్చిమ దేశాలకు ఉగ్రవాదంపై మాట్లాడే హక్కుందని ఎవరైనా ఎలా అనుకుంటారు? మధ్య ప్రాఛ్యంలో వనరుల మీద ఆధిపత్యంలకోసం అక్కడి లౌకిక పరిపాలకులపై కత్తికట్టిన సామ్రాజ్యవాద దేశాల సృష్టే ఐసిస్ ఉగ్రవాదం. సామ్రాజ్యవాదులు పోసిన పాలుతాగి పెరిగిన ఆ విష సర్పం నేడు ఇరాక్, సిరియాలో కొన్ని ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకొని నలుదిశలా విస్తరిస్తానంటోంది. పాలస్తీనా, ఆఫ్ఘన్ ఆక్రమణ, ఇరాక్‌పై దాడి తదితర పరిణామాలతో అగ్ర దేశాల పట్ల యువతలో గూడు కట్టుకున్న వ్యతిరేకతను ఉపయోగించుకుని ఈ సంస్థ విస్తరిస్తున్న విషయాన్ని పశ్చిమ దేశాల నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. అందువల్ల లెబనాన్, సిరియాపై దాడులనూ, పారిస్ మారణహోమాన్నీ వేరు చేసి చూడలేమన్న సిరియా అధ్యక్షుడు అసద్ వ్యాఖ్యలో నిజముంది. సిరియాలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అసద్ ప్రభుత్వం పోరాడుతుంటే, మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు అని పేర్లు పెట్టి కొన్ని ఉగ్రవాద సంస్థలకు అమెరికా, ఫ్రాన్స్ ఇతర పశ్చిమ దేశాలు మద్దతిస్తున్నాయి. తన ప్రయోజనాల కోసం అనేక ఆఫ్రికా, ఆసియా దేశాల ఆర్థిక, సైనిక వ్యవస్థల్లో ఫ్రాన్స్ జోక్యం చేసుకుంటోంది. ఇతరులను పీడించేవారు శాంతితో మనలేరు. మధ్య ఆసియాలో జోక్యం ఫ్రాన్స్‌లో కూడా మత విద్వేషాలు పెంచింది. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఎవ్వరికీ భిన్నాభిప్రాయం ఉండబోదు. కానీ మూలాల్లోకి వెళ్లకుండా ఎన్ని ప్రతినలు బూనినా ఉపయోగం ఉండదు.