ప్రపంచంలో కొన్ని అగ్రదేశాలు అనుసరిస్తున్న విధానాలే ప్రస్తుతం అన్ని దేశాలను వణికిస్తున్న ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నాయని సిపిఎం అధికార పత్రిక పీపుల్స్ డెమొక్రసీ తన తాజాసంచిక సంపాదకీయంలో విమర్శించింది. ప్రస్తుతం ప్రపం చం అంతా ఉగ్రవాదం నుండి పెనుముప్పును ఎదు ర్కొంటున్నదని, ఈ పెనుభూతాన్ని తరిమికొట్టి నిర్మూలించాలన్న విషయంలో ఎటువంటి సందే హమూ అవసరం లేదని పత్రిక ప్రధాన సంపాద కుడు ప్రకాశ్ కరత్ అభిప్రాయపడ్డారు. అయితే ఉగ్ర వాద మూలాలను కనిపెట్టి వాటిని ఎదుర్కొనే విధా నాలు, పద్ధతులను అనుసరించటంలోనే అసలు సమస్య వస్తున్నదన్నారు. గత వారం పారిస్ నగ రంపై జరిగిన దాడులు, ఇతర దేశాలలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న మరికొన్ని దాడులను ఖండించే వారు అందుకు సంబంధించిన వాస్తవా లను, నిజాలను పశ్చిమదేశాలకు చూపాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. పారిస్‌పై దాడిని ఫ్రాన్స్‌పై యుద్ధంగా అభివర్ణించిన అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండే దీనిని ఎవరు ప్రేరేపించారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వుంటుందని కరత్ తన సంపాదకీయంలో పేర్కొ న్నారు. ఇరాక్, సిరియాలలో తిష్టవేసిన ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వుండగా వాస్తవంలో అది మాత్రం జర గటం లేదన్నారు. పారిస్ నగరంపై దాడికి మూలాలు సిరియా, ఇరాక్‌లలో చోటు చేసుకున్న మారణకాండ లో వున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లామిస్ట్ ఉగ్రవాదం పెరుగుదల, దాని ఉగ్రవాద చర్యలు ప్రపంచ వ్యాప్తంగా వేళ్లూనుకున్నాయంటే దానికి ప్రధాన కారణం సిరియా, ఇరాక్‌లలో అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న విధానాలు, సైనిక జోక్యాలేనని కరత్ స్పష్టం చేశారు. సద్దాం హుస్సేన్ అల్‌ఖైదాకు సహకరిస్తున్నాడంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్ ఇరాక్‌పై దాడి చేసి సద్దాం పతనానంతరం అక్కడ తిష్టవేశారని, వాస్తవానికి ఇరాక్‌లో లౌకిక రాజ్యాన్ని ధ్వంసం చేసి అమెరికా అక్కడ తిష్ట వేయటం వల్లే అల్‌ఖైదాకు జవసత్వాలు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. ఇప్పుడు అల్‌ఖైదా ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)గా రూపాంతరం చెందిందన్నారు. సిరియాలో బషర్ అల్ అసద్ నేతృత్వంలోని లౌకిక ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అమెరికా నేతృత్వంలోని నాటో సేనల్లో ఫ్రాన్స్ అగ్రస్థానంలో నిలిచిందని, గతంలో తన వలస దేశాల్లో అనుసరించినట్లే సిరియాలో కూడా 2011-12 నుండి తిరుగుబాటు దారులకు ఫ్రాన్స్ అండగా నిలిచిందని కరత్ వివరించారు. సౌదీ అరేబియా, దాని గల్ఫ్ మిత్ర దేశాలు సమర్ధిస్తున్న ఇస్లామిస్ట్ ఉగ్రవాద శక్తులకు నిధులు, ఆయుధాలు అందించిందని గుర్తు చేశారు. అసద్ సర్కారుకు వ్యతిరేకంగా జిహాద్‌ను కొనసాగించేందుకు సిరియా కు తరలి వస్తున్న వేలాది మంది ఉగ్రవాదులకు టర్కీతో పాటు ఫ్రాన్స్ కూడా సదుపాయాలు కల్పించిందన్నారు. ఫ్రాన్స్ నుండి సిరియాకు వెళ్లిన ఫ్రెంచ్ ముస్లింలు అక్కడ అసద్ ప్రభుత్వానికి వ్యతి రేకంగా పోరాడినపుడు ఫ్రాన్స్ ప్రభుత్వం నోరెత్తలేదని కరత్ వివరించారు. అమెరికా నేతృత్వంలోని కూటమి భాగస్వామ్య దేశంగా ఫ్రాన్స్‌కు కూడా అసద్‌ను గద్దెదింపటమే ప్రాధాన్యతాంశంగా నిలిచిందని, అందుకోసం ఛాందసవాద, ఉగ్రవాద శక్తులకు కూడా ఊతమిచ్చిందని ఆయన విమర్శించారు. సిరియాలో తలెత్తిన అంతర్యుద్ధం, అక్కడి సిరియా ప్రభుత్వం బలహీన పడటం వంటి పరిస్థితులు ఇస్లామిక్ స్టేట్ బలోపేతానికి సహకరించాయని, అమెరికా-ఫ్రెంచ్- నాటో కూటమి సృష్టించిన ఈ భూతం ఇప్పుడు ప్రపంచానికి పెనుముప్పుగా మారిందని ఆయన పేర్కొన్నారు. తాము సృష్టించిన ఈ ఉగ్రవాద శక్తులను నిర్మూలిస్తామంటూ ఈ దేశాలు ఇప్పుడు సిరియాపై వైమానిక దాడులకు దిగుతున్నాయ న్నారు. సిరియాను మరింత అధ్ణపాతాళానికి దిగజా రకుండా కాపాడుతున్న అసద్ ప్రభుత్వ మనుగడను కానీ, ఇస్లామిస్ట్ ఉగ్రవాద శక్తులపై సిరియా సైన్యం కొనసాగిస్తున్న పోరును కానీ పశ్చిమ దేశాలు అంగీకరించటం లేదని ఆయన తెలిపారు. తాజాపరి ణామాల నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో మార్పు ప్రారంభమైందన్నారు. గత కొంత కాలంగా సిరియా, ఇరాక్‌ల నుండి ఐరోపా దేశాలకు వెల్లువెత్తుతున్న వలసలు ఇందులో మొదటి సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఉగ్రవాద శక్తుల మధ్య నలిగిపోతూ ప్రాణాలరచేత పట్టుకుని ఐరోపా దేశాలకు పరుగులు తీస్తున్న స్త్రీ, పురుష, బాలురు అనేక ప్రమాదకర పరిస్థితుల్లో శరణార్ధులుగా ఆయా దేశాలకు చేరు కుంటున్నారని, ఐరోపా కూటమి అతి కష్టమ్మీద ఈ వాస్తవాన్ని అంగీకరించిందని, ఇందుకు అసద్ సర్కారును గద్దె దింపాలన్న తమ మొదటి లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టిందని కరత్ తెలిపారు. ఇక సిరియా ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా ఉగ్రవాద శక్తులపై దాడులు ప్రారం భించిన రష్యా సైనిక జోక్యం, ఇందుకు సంబంధించి పుతిన్ తీసుకున్న నిర్ణ యం ఇందులో రెండో కీలక పరిణామమని ఆయన పేర్కొన్నారు. దీనితో సిరియాలో ప్రభుత్వ మార్పిడి తన ప్రాధాన్యత కాదనే పరిస్థితిని పుతిన్ పశ్చిమ దేశాలకు కల్పించారన్నారు. సిరియాకు మద్దతుగా వియన్నాలో కొనసాగుతున్న చర్చల్లో ఇప్పటి వరకూ పశ్చిమదేశాలకు బద్ధ శత్రువుగా, అసద్ మద్దతు దారుగా వున్న ఇరాన్ తొలిసారిగా పాల్గొంటున్నదని ఆయన వివరించారు.
సిరియాలో అంతర్యుద్ధానికి తెరదించి రాజకీయ పరిష్కార సాధన కోసం ఇప్పుడు తాజాగా చర్చలు ప్రారంభమయ్యాయన్నారు. ఇక ఇందులో మూడో కీలకాంశం ఈజిప్ట్‌లో రష్యా విమానం కూల్చివేత, పారిస్ దాడులు అని ఇవి సిరియా సంక్షోభానికి తక్షణ రాజకీయ పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకతను తెరపైకి తెచ్చాయని కరత్ తెలిపారు. సిరియాలో ఐఎస్ స్థావరాలపై రష్యా, ఫ్రెంచ్, అమెరికా దళాలు వైమానిక దాడులను ఉధృతం చేసినప్పటికీ ప్రయోజనం ఏ మాత్రం వుండదని ఆయన అభిప్రా యపడ్డారు. దశాబ్దాలుగా అమెరికా, దాని నాటో మిత్రదేశాలు ఉగ్రవాదానికి నిధులు అందించిన సౌదీ అరేబియా వంటి ప్రతీఘాత దేశాలను సమర్ధించా యని, ఇప్పుడు ఈ ప్రాంతంలోని చమురు నిక్షేపాలపై ఆధిపత్యం కోసం అరబ్ దేశాలలోని లౌకిక రాజ్యాలపై దాడులు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ దేశాల సైనిక జోక్యంతోనే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్, ఇరాక్, సిరియాలలో అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద వ్యవస్థలు ఊపిరిపోసుకున్నాయన్నారు. ముందుగా ఈ దేశాలు అసద్ సర్కారును లక్ష్యంగా అధికార మార్పిడి కోసం చేస్తున్న ప్రయత్నాలను విర మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విష యంలో ఫ్రాన్స్ తన వైఖరిని మార్చుకుంటున్న సూచ నలు కన్పిస్తున్నాయని, హాలెండే ఫ్రాన్స్ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగమే ఇందుకు ఉదాహరణ అని ఆయన తెలిపారు.
ఐఎస్‌ఐఎస్‌ను ఏకాకిని చేసి ఓడించేందుకు ఐక్యవ్యూహంతో ముందుకు కదలాలని, ఇందుకు అమెరికా, నాటో తదితర దేశాలు సౌదీ, కతార్, టర్కీ వంటి దేశాలు సిరియాలో జరుపుతున్న దాడులకు తెరదించేలా చూడాలని ఆయన సూచించారు. ఉగ్రవాదులను పక్కన పెట్టి ఐరాస సారధ్యంలో రాజకీయ పరిష్కారం కోసం కృషి చేయాలని, సిరియా ప్రజలు తమ రాజకీయ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే పరిస్థితికల్పించాలని కరత్ తన సంపాదకీయంలో సూచించారు.