ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై 'పార్టీ రాజకీయాలు' ముదురుతున్నాయి. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి హోదా సాధనకు నిరవధిక దీక్షకు దిగడం, దానిని టిడిపి ప్రభుత్వం భగం చేయడంతో రాష్ట్రంలో 'ప్రత్యేక' రాజకీయం వేడెక్కింది. ఈ పోరులో మరో ఇద్దరు బలయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదేమోనని ఇప్పటికే కొందరు ప్రాణత్యాగం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతుండడంతో పరిస్థితులు దిగజారుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కొన్ని పార్టీలు ఇలా రెచ్చగొట్టే వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. పౌరజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ ప్రమాదం ప్రత్యేక హోదా ఉద్యమంలో తలెత్తకూడదు. రాష్ట్రంలో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా పార్టీలు సంయమనంతో పోరాడవలసిన సమయమిది. కచ్చితంగా ప్రజల కోసం కలసి పనిచేయవలసిన సమయమిది.
తెలంగాణ ఉద్యమం రెండు తెలంగాణలకు జన్మనిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మిగిలిన ఆంధ్ర ప్రాంతాన్ని వెనుకబాటుకు గురిచేసి మరో తెలంగాణను సృష్టించింది. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయమే జరిగింది. విభజన అనంతరం ఎపి అన్ని రకాల మానవాభివృద్ధి సూచికల్లోనూ అట్టడుగుకు చేరింది. ఆర్థిక లోటుతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఎపికి ప్రత్యేక హోదా దక్కాల్సిందే. లేకపోతే అక్కడి ప్రజల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇంతటి కీలకమైన అంశంపై రాజకీయ పార్టీలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. అయితే, అవి ఎప్పట్లాగే పార్టీ రాజకీయాలకు పరిమితమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన తర్వాతే రాష్ట్రాన్ని విభజించారు. ఆనాడు బిజెపితో సహా అన్ని రాజకీయ పార్టీలూ దీనికి మద్దతు పలికాయి. ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాదు, పదేళ్ళు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి అధికారంలోకొచ్చిన బిజెపి ఇప్పుడు మాట మార్చింది. ప్రత్యేక హోదా కోరుతూ నిరసన తెలిపినందుకు విద్యార్థి జెఎసి నాయకులను బిజెపి నాయకులు, కార్యకర్తలు వెంటబడి కొట్టడం గర్హనీయం. హోదా పదేళ్ళు కావాల్సిందేనన్న తెలుగుదేశం ఇప్పుడది సంజీవని కాదంటోంది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడగలేకపోతున్న చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రత్యేక హోదాయే పరమౌషధమంటున్న ప్రతిపక్షం చిత్తశుద్ధిలేని పోరాటాలు చేస్తోంది. ప్రత్యేక హోదాపై ఎపి శాసనసభ తీర్మానం చేసినా అధికార, ప్రతిపక్షాల అసలు స్వరూపం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. ఈ అంశంపై చర్చ సందర్భంగా ఇరు పార్టీల సభ్యులూ నెట్టుకునే వరకూ పరిస్థితి వెళ్లింది. చంద్రబాబు, జగన్‌లు తమ తమ వ్యక్తిత్వాలపై పరస్పరం విమర్శలు చేసుకున్నారు. అవినీతి వ్యవహారాలను, గత చరిత్రలనూ తవ్వుకున్నారు. హోదాపై ప్రతిపక్షాలకు పోరాడే అర్హతే లేదన్నట్లు అధికారపక్షం వాటిని అణచివేయాలని చూస్తోంది. అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి హోదా పనికివచ్చే అంశంగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మొత్తానికి ప్రజల కోసం, రాష్ట్ర బాగు కోసం హోదా సాధించాలనే ఆలోచన వాటికి లేదు.
కష్ట కాలంలో ఉన్న ఎపిని గట్టెక్కించడానికి పార్టీలన్నీ కలసి ఒక్కతాటిపైకి వచ్చి కదలాల్సిన సమయమిది. పార్టీల మధ్య అనైక్యత ఇలాగే కొనసాగితే హోదా నుంచి దూరంగా జరుగుతున్న కేంద్రానికి అవకాశమిచ్చినట్లవుతుంది. 'ప్రత్యేక హోదా విషయమై పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. కేంద్ర స్థాయిలోనూ ఇలాంటి వాతావరణమే కన్పిస్తే లక్ష్యం సిద్ధిస్తుంది' అని కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు అన్న మాటలు కొట్టిపారేయలేనివి. ఏకాబి óప్రాయం ఉన్నా నేతలు సమన్వయంతో పనిచేయడం లేదు. కొన్నాళ్ళుగా హోదా కోసం సాగుతున్న ఆందోళన తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోంది. ఆ ఉద్యమంలో పార్టీలు ప్రదర్శించిన వైఖరినే ప్రత్యేక హోదాలోనూ కనబరుస్తున్నాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని పార్టీలపరంగా తలకెత్తుకుని అవి ఏం సాధించాయి? పార్టీలకతీతంగా నడిచిన ప్రజా ఉద్యమం నుండే తెలంగాణ పుట్టింది. ఏ ఒక్క పార్టీ ఉద్యమ ఫలితంగానో తెలంగాణ రాలేదు. అది కేవలం రాజకీయ పార్టీల ఉద్యమమని చెప్పలేం. ఈ విషయాన్ని పార్టీలు గ్రహించి 'హోదా' విషయంలో పార్టీ రహిత వైఖరితో ముందుకు పోవాల్సిన అవసరముంది. అయితే తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలు ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదు.
నేర్చుకుంటాయని ఆశించలేం. పార్టీతత్వాన్ని అవి ఎప్పటికీ వదులుకోవు. ప్రజాశక్తి ఒక్కటే వాటిని ఒక్కటిగాచేసి లక్ష్యంవైపు నడిపించగలదు. తెలంగాణ ఉద్యమంలోనూ అదే జరిగింది. ఎవరికి వారుగా తెలంగాణ ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని కుటిల ప్రయత్నాలు చేయడం, ఉద్యమ నేతల్లో ఐక్యత లేకపోవడం తెలంగాణ ఉద్యమాన్ని బలహీన పరుస్తోందని, ఇది తెలంగాణ సాధనకు ఆటంకమవుతుందని, పార్టీలకతీతంగా ఉద్యమ నేతలందరూ ఏకంకావాలని కొందరు చిత్తశుద్ధి గల ఉద్యమనేతలు భావించారు. ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో విడివిడిగా పోరాడడంకన్నా అందరూ ఒకే వేదిక నుంచి పనిచేస్తే ఫలితముంటుందని ఆ దిశగా కొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. అనంతర కాలంలో ఉపాధ్యాయులు సంఘాలకతీతంగా ఏకంకావడం ఉద్యమానికి కొత్త శక్తినిచ్చింది. ఈ సందర్భంలో అదే స్ఫూర్తిని పార్టీలూ కనబరచాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునివ్వడం గమనార్హం. అయితే తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌గా ఆయన చిత్తశుద్ధిని ఆనాడు కొందరు శంకించారు. ఆ రాజకీయ ఐకాస తెరాసలో ఒక భాగంగానే పనిచేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశాల ఐక్య వేదికగా ఉద్యమించాల్సిన తరుణంలో ఒక పార్టీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని, పార్టీలను ఏకతాటి పైకి తీసుకొచ్చి విశాల ఐక్య సంఘటనగా ఏర్పడేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని తెలంగాణ విద్యార్థి ఐకాస ఓ సమావేశంలో ఆయనను నిలదీసింది.
తెలంగాణ రాజకీయ ఐకాస అన్ని వర్గాలను పార్టీలకతీతంగా కలుపుకునిపోలేకపోతున్న దృష్ట్యా ఆ కొరత తీర్చేందుకు స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వాన రాజకీయేతర వేదిక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమన్వయ కమిటీ ఏర్పడింది. మొత్తానికి తెలంగాణ సాధన కోసం పార్టీలకతీతంగా వివిధ పార్టీల నేతలు ప్రజా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా రూపుతీసుకోవడంతో ప్రజల ఒత్తిడి మేరకు పార్టీలు అనివార్యంగా పార్టీలకతీతంగా కలవక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
పార్టీలకతీతంగా ఉద్యమించడం వల్లనే తెలంగాణ సాకారమైంది. పార్టీలకతీతంగా ఉద్యమిస్తే నేడు ఎపికి ప్రత్యేక హోదా కూడా దక్కుతుంది. అధికారపక్షానికి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని అఖిలపక్షం ఏర్పాటుచేసి ఢిల్లీ తీసుకెళ్లాలి. కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అలాగే హోదాపై చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలు ఒక్కటై రాజీలేని పోరాటాలు చేయాలి. పార్టీ దృష్టిని పక్కనపెట్టి ప్రజా దృష్టితో వ్యవహరించాలి. అలా కాకుండా పార్టీలపరంగా ఉద్యమిస్తే, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తమ సొంతం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తే తప్పక ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నట్లవుతుంది.
ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. మరింత మంది అమాయకుల ప్రాణాలను హరిస్తుంది. ప్రత్యేక హోదా సాధన కోసం నాయకులు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనాలని సిపిఎం, సిపిఐ, తదితర వామపక్షాలు, కొన్ని ప్రజా సంఘాలు ముందుకొస్తున్నాయి. ఈ స్ఫూర్తి అన్ని రాజకీయ పార్టీలూ, అన్ని ప్రజా సంఘాలూ ప్రదర్శించాలి. అఖిలపక్షమై కదలాలి.
- విఎం ఈశ్వర్
(వ్యాసకర్త సెంటర్ ఫర్ డెమోక్రటిక్ సొసైటీ కన్వీనర్)ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై 'పార్టీ రాజకీయాలు' ముదురుతున్నాయి. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి హోదా సాధనకు నిరవధిక దీక్షకు దిగడం, దానిని టిడిపి ప్రభుత్వం భగం చేయడంతో రాష్ట్రంలో 'ప్రత్యేక' రాజకీయం వేడెక్కింది. ఈ పోరులో మరో ఇద్దరు బలయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదేమోనని ఇప్పటికే కొందరు ప్రాణత్యాగం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతుండడంతో పరిస్థితులు దిగజారుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కొన్ని పార్టీలు ఇలా రెచ్చగొట్టే వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. పౌరజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ ప్రమాదం ప్రత్యేక హోదా ఉద్యమంలో తలెత్తకూడదు. రాష్ట్రంలో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా పార్టీలు సంయమనంతో పోరాడవలసిన సమయమిది. కచ్చితంగా ప్రజల కోసం కలసి పనిచేయవలసిన సమయమిది.
తెలంగాణ ఉద్యమం రెండు తెలంగాణలకు జన్మనిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మిగిలిన ఆంధ్ర ప్రాంతాన్ని వెనుకబాటుకు గురిచేసి మరో తెలంగాణను సృష్టించింది. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయమే జరిగింది. విభజన అనంతరం ఎపి అన్ని రకాల మానవాభివృద్ధి సూచికల్లోనూ అట్టడుగుకు చేరింది. ఆర్థిక లోటుతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఎపికి ప్రత్యేక హోదా దక్కాల్సిందే. లేకపోతే అక్కడి ప్రజల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇంతటి కీలకమైన అంశంపై రాజకీయ పార్టీలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. అయితే, అవి ఎప్పట్లాగే పార్టీ రాజకీయాలకు పరిమితమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన తర్వాతే రాష్ట్రాన్ని విభజించారు. ఆనాడు బిజెపితో సహా అన్ని రాజకీయ పార్టీలూ దీనికి మద్దతు పలికాయి. ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాదు, పదేళ్ళు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి అధికారంలోకొచ్చిన బిజెపి ఇప్పుడు మాట మార్చింది. ప్రత్యేక హోదా కోరుతూ నిరసన తెలిపినందుకు విద్యార్థి జెఎసి నాయకులను బిజెపి నాయకులు, కార్యకర్తలు వెంటబడి కొట్టడం గర్హనీయం. హోదా పదేళ్ళు కావాల్సిందేనన్న తెలుగుదేశం ఇప్పుడది సంజీవని కాదంటోంది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడగలేకపోతున్న చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రత్యేక హోదాయే పరమౌషధమంటున్న ప్రతిపక్షం చిత్తశుద్ధిలేని పోరాటాలు చేస్తోంది. ప్రత్యేక హోదాపై ఎపి శాసనసభ తీర్మానం చేసినా అధికార, ప్రతిపక్షాల అసలు స్వరూపం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. ఈ అంశంపై చర్చ సందర్భంగా ఇరు పార్టీల సభ్యులూ నెట్టుకునే వరకూ పరిస్థితి వెళ్లింది. చంద్రబాబు, జగన్‌లు తమ తమ వ్యక్తిత్వాలపై పరస్పరం విమర్శలు చేసుకున్నారు. అవినీతి వ్యవహారాలను, గత చరిత్రలనూ తవ్వుకున్నారు. హోదాపై ప్రతిపక్షాలకు పోరాడే అర్హతే లేదన్నట్లు అధికారపక్షం వాటిని అణచివేయాలని చూస్తోంది. అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి హోదా పనికివచ్చే అంశంగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మొత్తానికి ప్రజల కోసం, రాష్ట్ర బాగు కోసం హోదా సాధించాలనే ఆలోచన వాటికి లేదు.
కష్ట కాలంలో ఉన్న ఎపిని గట్టెక్కించడానికి పార్టీలన్నీ కలసి ఒక్కతాటిపైకి వచ్చి కదలాల్సిన సమయమిది. పార్టీల మధ్య అనైక్యత ఇలాగే కొనసాగితే హోదా నుంచి దూరంగా జరుగుతున్న కేంద్రానికి అవకాశమిచ్చినట్లవుతుంది. 'ప్రత్యేక హోదా విషయమై పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. కేంద్ర స్థాయిలోనూ ఇలాంటి వాతావరణమే కన్పిస్తే లక్ష్యం సిద్ధిస్తుంది' అని కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు అన్న మాటలు కొట్టిపారేయలేనివి. ఏకాబి óప్రాయం ఉన్నా నేతలు సమన్వయంతో పనిచేయడం లేదు. కొన్నాళ్ళుగా హోదా కోసం సాగుతున్న ఆందోళన తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోంది. ఆ ఉద్యమంలో పార్టీలు ప్రదర్శించిన వైఖరినే ప్రత్యేక హోదాలోనూ కనబరుస్తున్నాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని పార్టీలపరంగా తలకెత్తుకుని అవి ఏం సాధించాయి? పార్టీలకతీతంగా నడిచిన ప్రజా ఉద్యమం నుండే తెలంగాణ పుట్టింది. ఏ ఒక్క పార్టీ ఉద్యమ ఫలితంగానో తెలంగాణ రాలేదు. అది కేవలం రాజకీయ పార్టీల ఉద్యమమని చెప్పలేం. ఈ విషయాన్ని పార్టీలు గ్రహించి 'హోదా' విషయంలో పార్టీ రహిత వైఖరితో ముందుకు పోవాల్సిన అవసరముంది. అయితే తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలు ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదు.
నేర్చుకుంటాయని ఆశించలేం. పార్టీతత్వాన్ని అవి ఎప్పటికీ వదులుకోవు. ప్రజాశక్తి ఒక్కటే వాటిని ఒక్కటిగాచేసి లక్ష్యంవైపు నడిపించగలదు. తెలంగాణ ఉద్యమంలోనూ అదే జరిగింది. ఎవరికి వారుగా తెలంగాణ ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని కుటిల ప్రయత్నాలు చేయడం, ఉద్యమ నేతల్లో ఐక్యత లేకపోవడం తెలంగాణ ఉద్యమాన్ని బలహీన పరుస్తోందని, ఇది తెలంగాణ సాధనకు ఆటంకమవుతుందని, పార్టీలకతీతంగా ఉద్యమ నేతలందరూ ఏకంకావాలని కొందరు చిత్తశుద్ధి గల ఉద్యమనేతలు భావించారు. ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో విడివిడిగా పోరాడడంకన్నా అందరూ ఒకే వేదిక నుంచి పనిచేస్తే ఫలితముంటుందని ఆ దిశగా కొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. అనంతర కాలంలో ఉపాధ్యాయులు సంఘాలకతీతంగా ఏకంకావడం ఉద్యమానికి కొత్త శక్తినిచ్చింది. ఈ సందర్భంలో అదే స్ఫూర్తిని పార్టీలూ కనబరచాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునివ్వడం గమనార్హం. అయితే తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌గా ఆయన చిత్తశుద్ధిని ఆనాడు కొందరు శంకించారు. ఆ రాజకీయ ఐకాస తెరాసలో ఒక భాగంగానే పనిచేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశాల ఐక్య వేదికగా ఉద్యమించాల్సిన తరుణంలో ఒక పార్టీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని, పార్టీలను ఏకతాటి పైకి తీసుకొచ్చి విశాల ఐక్య సంఘటనగా ఏర్పడేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని తెలంగాణ విద్యార్థి ఐకాస ఓ సమావేశంలో ఆయనను నిలదీసింది.
తెలంగాణ రాజకీయ ఐకాస అన్ని వర్గాలను పార్టీలకతీతంగా కలుపుకునిపోలేకపోతున్న దృష్ట్యా ఆ కొరత తీర్చేందుకు స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వాన రాజకీయేతర వేదిక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమన్వయ కమిటీ ఏర్పడింది. మొత్తానికి తెలంగాణ సాధన కోసం పార్టీలకతీతంగా వివిధ పార్టీల నేతలు ప్రజా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా రూపుతీసుకోవడంతో ప్రజల ఒత్తిడి మేరకు పార్టీలు అనివార్యంగా పార్టీలకతీతంగా కలవక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
పార్టీలకతీతంగా ఉద్యమించడం వల్లనే తెలంగాణ సాకారమైంది. పార్టీలకతీతంగా ఉద్యమిస్తే నేడు ఎపికి ప్రత్యేక హోదా కూడా దక్కుతుంది. అధికారపక్షానికి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని అఖిలపక్షం ఏర్పాటుచేసి ఢిల్లీ తీసుకెళ్లాలి. కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అలాగే హోదాపై చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలు ఒక్కటై రాజీలేని పోరాటాలు చేయాలి. పార్టీ దృష్టిని పక్కనపెట్టి ప్రజా దృష్టితో వ్యవహరించాలి. అలా కాకుండా పార్టీలపరంగా ఉద్యమిస్తే, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తమ సొంతం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తే తప్పక ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నట్లవుతుంది.
ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. మరింత మంది అమాయకుల ప్రాణాలను హరిస్తుంది. ప్రత్యేక హోదా సాధన కోసం నాయకులు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనాలని సిపిఎం, సిపిఐ, తదితర వామపక్షాలు, కొన్ని ప్రజా సంఘాలు ముందుకొస్తున్నాయి. ఈ స్ఫూర్తి అన్ని రాజకీయ పార్టీలూ, అన్ని ప్రజా సంఘాలూ ప్రదర్శించాలి. అఖిలపక్షమై కదలాలి.
- విఎం ఈశ్వర్
(వ్యాసకర్త సెంటర్ ఫర్ డెమోక్రటిక్ సొసైటీ కన్వీనర్)