తప్పు జరిగినప్పుడు ఒప్పుకుంటే ఆ ఒక్క తప్పుకే పరిమితం కావొచ్చు. అదే తప్పును కప్పిపుచ్చుకోవాలనుకొంటే మాత్రం తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రప్రభుత్వం ఆ రెండవ పనిలో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నది. గోదావరి పుష్కరాల తొలిరోజున జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులు-అన్నీ తానై పుష్కర ఏర్పాట్లు చూసిన సిఎం, ఆయన మంత్రివర్గ అనుచరులు కాదట! వి.వి.ఐ.పిలు, వి.ఐ.పిల సేవలో తరిస్తూ ప్రజా భద్రతను, బాధ్యతను గాలికి వదిలిన అధికారులూ కాదట! పుష్కర ఘాట్‌లో వ్యాపించిన ఒకానొక వదంతి కారణంగా ఆ ఘోరం జరిగిందట. అదే విధంగా ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న వారిని అడ్డుకోబోయిన ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడికి ఇరుపక్షాల వారూ బాధ్యులేనట. ఎక్కడైనా సరే! ఒక తప్పుకు అది చేసిన వారు కారకులౌతారు. అంతేగాని ఆ తప్పు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని, బాధను-వ్యథను అనుభవించిన వారిని బాధ్యులుగా భావించడం ప్రపంచంలోని వింతల్లోకెల్లా వింత. దానికి రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వేదిక కావడమే విషాదం.
పాలనాపరమైన విజయాల కీర్తిని తమ ఖాతాలో, వైఫల్యాల కీర్తిని ఇతరుల ఖాతాలో వెయ్యడం పాలకులకు తగని పని. ప్రధాని మోడీ యోగా డే సందర్భాన్ని ఉపయోగించుకుని ప్రపంచఖ్యాతి పొందడం చూసి స్ఫూర్తి పొందారో ఏమో! పన్నెండేళ్లకోమారు వచ్చే గోదావరి పుష్కరాలతో విశ్వఖ్యాతి పొందాలనుకున్నారు సిఎం సారు. అందుకోసం విఐపిలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్‌ను విడిచిపెట్టి రద్దీ ఎక్కువగా ఉండే సామాన్యుల ఘాట్‌కు అనూహ్యంగా కుటుంబ సమేతంగా తరలివచ్చి గంటల కొద్దీ స్నానాలు, పూజలు, పనిలో పనిగా షార్ట్ ఫిల్మ్ తీయించుకోవడంతో క్యూల్లో నిలబడ్డ జనం భరించలేనంత ఆలస్యమైందనేది ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం. ముఖ్యమంత్రి నిష్క్రమించిన అనంతరం గేట్లు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగి పూడ్చలేని ప్రాణనష్టం వాటిల్లిందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. బాధితుల ఆగ్రహాన్ని, శోకాన్ని కళ్లారా చూశాక తప్పనిసరి పరిస్థితుల్లో ఘటనపై విచారణకు ఆదేశిస్తామని హామీ ఇచ్చినా ముఖ్యమంత్రి మనసు అందుకు అంగీకరించినట్టు లేదు. కోట్ల రూపాయలు పోసి ఏర్పాట్లకు ఆదేశించి, స్వయంగా పర్యవేక్షించి మరీ ప్రచారం చేసిన పుష్కరాల్లో విషాద ఘట్టం చోటు చేసుకోవడాన్ని, అది తన ఖాతాలో పడడాన్ని ఆయన తట్టుకోలేక ఎలా కవర్ చేసుకోవాలో రాత్రింబవళ్లు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఘాట్‌లో కరెంటు తీగలు తెగి పడ్డాయన్న వదంతి వ్యాపించడంతో భయపడిన జనం ఒక్కసారిగా పరుగులు తీయడం వల్లే తొక్కిసలాట... ఫలితంగా మరణాలు సంభవించాయని రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశం భావించినట్టు 'లీకు'ల ద్వారా వెల్లడయింది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణను కూడా ఆ దిశగానే జరిపించాలని కూడా మంత్రివర్గం భావిస్తోందట. రాజమండ్రిలో జరిగిన అగ్నిప్రమాదాన్ని ఆసరా చేసుకొని మంత్రులు కుట్ర సిద్ధాంతాన్ని కూడా ముందుకు తెచ్చారు.
ఇక కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని, ఆయన వర్గీయుల దాడిని సైతం ప్రభుత్వం బాగానేకవర్ చేస్తున్నది. అందరూ తొందరపడటం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నదని మంత్రివర్గం భావించినట్లు తెలుస్తోంది. ఒక నిజాయితీ గల అధికారిణిగా తన బాధ్యత తాను నిర్వహించారామె. అక్రమంగా ఇసుకను తవ్వుకెళ్తూ ప్రభుత్వ ఖజానాకు, తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న సదరు ఎమ్మెల్యే మనుషులను శాయశక్తులా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది సహించలేని తెలుగు తమ్ముళ్లు ఆమెను దుర్భాషలాడి, ఆటవిక చర్యలకు పాల్పడ్డంతోనే చిక్కంతా వచ్చింది. మీడియా చురుకైన పాత్ర వహించడంతో బోనులో చిక్కుకున్న ఎలుకవాటంలా తయారైంది ఏలికల పరిస్థితి. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా ఇసుక దందాకు పాల్పడుతున్న వారిని కాకుండా నిజాయితీగా వ్యవహరించిన ఎమ్మార్వోను మందలించడమే విడ్డూరం. అన్యాయం ఎక్కడ జరుగుతున్నా పరిధులు పట్టించుకోకుండా పని చేయమని పదే పదే చెప్పే ప్రభుత్వమే ఇవాళ ఆమెను పరిధి దాటి ఎందుకెళ్లారని ప్రశ్నించడం, దూకుడు తగ్గించి ఉండాల్సిందని మందలించడమే విషాదం.
తప్పులు చేయడం, వాటిని కవర్ చేసుకోవడానికి మరెవరినో బాధ్యులను చేయడం నేతలకు కొత్తేమీ కాదు. కాకపోతే ఇక్కడ బాధితులనే బలిపశువులను చేయడమే జీర్ణంకాని విషయం. సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకం ఉండకూడదనే వి.ఐ.పి ఘాట్‌లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి... వాటిని కాదని అకస్మాత్తుగా సామాన్యుల ఘాట్‌కు ఎందుకు వెళ్లారో చెప్పడం లేదు. గత పుష్కరాల్లో కూడా సిఎం అదే ఘాట్‌లో స్నానం చేసారన్న వాదన పొసగడం లేదు. ఇప్పటి జనానికీ, అప్పటి జనానికీ ఇప్పటి ఏర్పాట్లకూ అప్పటి ఏర్పాట్లకూ పోలిక ఏమిటి? ఇప్పటికైనా ప్రభుత్వం తప్పు ఒప్పుకుంట ఆ ఒక్క తప్పుకే పరిమితం కావచ్చు. అలాకాక తప్పును కప్పిపుచ్చుకోవడానికి సవాలక్ష అబద్దాలు చెబితే ఏనాటికైనా ఆ అబద్దాల పుట్ట బద్దలు కాక తప్పదు.