కరువు కోతలు..

అమరావతి, పుష్కరాలు, సింగపూర్‌, జపాన్‌ ప్రచారార్భాటంలో పడి చంద్రబాబు ప్రభుత్వం కరువును విస్మరించడం ఘోర అపరాధం కాగా ఆలస్యంగా ప్రకటించిన కరువు మండలాల్లోనూ పిసినారి తనానికి పాల్పడటం మరీ దుర్మార్గం. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దుర్భిక్షం అలముకోగా ఆర్చుకొని తీర్చుకొని సీజను ముగిసిన నెల రోజులకు వెల్లడించిన కరువు మండలాల విషయం కూడా ఎంతో లోపభూయిష్టంగా, ఆశాస్త్రీయంగా ఉంది. పదమూడు జిల్లాల్లో 670 మండలాలుండగా మీనమేషాలు లెక్కించి గుర్తించినవి ఏడు జిల్లాల్లో 196 మండలాలు. కరువు కోరల్లో చిక్కుకొని రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే కరువు గుర్తింపులో కూడా వడపోతలకు ఒడిగట్టడమే కాకుండా కఠిన షరతులు విధించడం దారుణం. జూన్‌- సెప్టెంబర్‌ సాధారణంగా ఖరీఫ్‌ కాలం. వ్యవసాయశాఖ మంత్రి ఆగస్టు మూడో వారంలో ప్రెస్‌మీట్‌ పెట్టి 325 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉందని పేర్కొని, త్వరలో ఆ మండలాల్లో కరువు ప్రకటిస్తామన్నారు. రెండు మాసాల కసరత్తు అనంతరం కరువును 196 మండలాలకు సర్కారు ఎందుకు కుదించిందో అర్థం కాదు. ఈ వ్యవధిలో రాష్ట్రంలో వరదలు పోటెత్తింది లేదు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి జలాశయాల్లోకి నీరు పరవళ్లు తొక్కిందీ లేదు. రాయలసీమ, ప్రకాశం, ఇతర మెట్ట ప్రాంతాల్లో కరువు ప్రకటించాలని కలెక్టర్లు పంపిన నివేదికలను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడం ఘోరం. క్షేత్ర స్థాయి రిపోర్టులను కాకుండా హైదరాబాద్‌లో కూర్చొని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసులను తూచ శిరసావహించడం కరువు ప్రజలపై సర్కారు చిన్నచూపే. ప్రభుత్వ ఆదేశాలతోనే కరువును కమిటీ తగ్గించినట్లు కనబడుతోంది. శాశ్వత నీటి పారుదల హామీ ఉన్న ప్రాంతాల మినహాయింపు, అర్బన్‌ మండలాల తొలగింపు షరతులు ప్రభుత్వానివే.
ఈ సంవత్సరం ఎల్‌నినో ముప్పు పొంచి ఉందని, సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ పరిశోధనా సంస్థలు మేలోనే చెవినిల్లుకట్టుకున్నాయి. దేశంలో ఉత్తరాది కంటే దక్షిణాదిలో తక్కువ వర్షాలు పడతాయని హెచ్చరించాయి. కాగా ఈ భూప్రపంచం మీద సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకోవడంలో తనకు సాటి రాగలవారు మరెవ్వరూ లేరని గొప్పలకు పోయే చంద్రబాబు, వాతావరణ విభాగం ప్రసార మాధ్యమాల్లో బహిరంగంగా కరువుపై సూచనలు చేసినా ఎందుకు చెవికెక్కించుకోలేదు? ముందస్తు కరువు నివారణా చర్యలు చేపట్టకుండా, ప్రత్యామ్నాయ ప్రణాళికలు రచించకుండా వర్షం కోసం మబ్బుల వంక నిరీక్షించారు. యజ్జయాగాలు చేయించారు. హుదూద్‌ ప్రచండ తుపానప్పుడూ విశాఖ వద్ద తీరం దాటుతుందని రెండు మూడు రోజుల ముందే మెటరాలజీ శాఖ పేర్కొంది. ముందు అప్రమత్తం కాకుండా తీరా తుపాను వెలిశాక విశాఖలో సిఎం స్వయంగా తిష్ట వేసి అక్కడా ప్రచార కోణాన్నే ఆశ్రయించారు. ముందే మేల్కొంటే యభై మరణాలు సంభవించేవి కాదుగా? పట్టిసీమతో నదుల అనుసంధానం అంటూ రూ. వందల కోట్లు తగలేసి రాయలసీమకు చుక్క నీరివ్వలేదు. పైగా ఎన్నడూ లేని విధంగా కృష్ణా డెల్టానూ ఎండబెట్టి ధాన్యాగారంలో పంట సెలవులకు పాదుకొల్పారు. ఖరీఫ్‌లో 42 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఆరున్నర లక్షల హెక్టార్లు బీడు పడ్డాయి. మొత్తం 670 మండలాల్లో 302 మినహా తతిమ్మా చోట్ల సేద్యం అంతే సంగతులని, వరి, నూనెగింజలు, పత్తి, అన్ని పంటల దిగుబడులూ తీసికట్టేనని ప్రభుత్వ విభాగాలే వక్కాణిస్తుండగా సర్కారు వాస్తవాలను దాచి పెట్టడం నేరం. 
విపత్తు బాధితులకు తక్షణ సాయం అందించి కోలుకొనేందుకు తోడ్పడటం ప్రభుత్వ బాధ్యత. క్షతగాత్రులకు వెన్నుపోటు పొడవడంలో బిజెపి, టిడిపి, కాంగ్రెస్‌లకు ఏం తేడా లేదు. నిరుడు అక్టోబర్‌లో హుదూద్‌ తుపానొస్తే నేటికీ పరిహారం అందించని దుస్థితి. గతేడాది కరువొస్తే ప్రతిపక్షాల ఆందోళనల తర్వాత ఇప్పుడు నిధులివ్వడం బాధితులను పరిహసించడమే. తుపానుతో ఇళ్లూ వాకిళ్లుకొట్టుకుపోతే, అనావృష్టితో చేయి ఆడని దుర్భరం నెలకొంటే వారికి ఇచ్చే కొద్దిపాటి సాయానికీ ఆధార్‌ తప్పనిసరి చేయడం అమానవీయం. రైతులు పంటలేసుకోవాలంటే కొత్త అప్పులివ్వాలి. రుణ మాఫీ పేరుతో రీషెడ్యూల్‌కు ఎగనామం పెట్టడం ఆందోళనకరం. నిరుడు హుదూద్‌, కరువు రైతులకు రీషెడ్యూల్‌ చేయకుండా దగా చేసింది. ఈ ఏడాది కూడా అంతేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జులైలో 54 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అప్పుడే కంటింజెన్సీ ప్లాన్లు అమల్లో పెడితే పొలాలు బీడు పడేవి కావు. విపత్తులను ఆపడం మానవ సాధ్యం కాకపోయినా అప్రమత్తతతో నష్ట నివారణ చేయడం ప్రస్తుత సాంకేతిక యుగంలో కష్టమేం కాదు. సర్కారు నిధులు మిగుల్చుకోవాలనే రంధిని విడనాడి కరువు రైతులను ఉదారంగా ఆదుకోవాలి. రబీ పంటలేసుకొనేందుకు రుణాలు, విత్తనాలు, ఎరువులు, తదితర ఉత్పాదకాలు అందించాలి. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. ఆత్మహత్యలకు పాల్పడకుండా భరోసా కల్పించాలి. ఉపాధి కల్పనతో కూలీల వలసలు నివారించాలి. తాగునీరు, పశుగ్రాసం అందించాలి. మాఫీ కిస్తీలపై తేల్చాలి. అన్నీ తన చేతి మీదే జరగాలనే నియంతృత్వ ధోరణిని పక్కనబెట్టి అఖిలపక్ష భాగస్వామ్యంతో బాధితులను ఆదుకోవాలి.