కలం గళమై గర్జించిన 'గరిమెళ్ల'

అభ్యుదయ భావజాలంతో దేశభక్తిని చాటుతూ బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర నుంచి ఎగసి పడ్డ కవి కెరటం గరిమెళ్ల.. 1892 జులై 15న నాటి కళింగాంధ్ర (నేడు ఉత్తరాంధ్ర) ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం ప్రియాగ్రహారంలో సూరమ్మ, వెంకట నరసయ్యకు జన్మించారు. ప్రజాకవి, జాతీయ కవి సార్వభౌమ బిరుదాకింతుడైన గరిమెళ్ల కలం గళమై బ్రిటిష్‌ సామ్రాజ్యపు గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. పాత్రికేయ వృత్తిని దేశ హితం కోసం, పరపీడన నుంచి జాతి విముక్తి కోసం అనేక రచనలు సాగించారు. ఉపాధ్యాయుడిగా, గేయరచయితగా, స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని 'మా కొద్దీ తెల్లదొరతనం' గేయంతో ఖ్యాతి గడించారు. 39 చరణాలతో అప్పట్లో ఈ గేయం జనం హృదయాలను తాకి, పాలకుల గుండెలను కంపింపజేసింది. గీతం, పాంచాలం, హార్ట్‌ ఆఫ్‌ ఇండియా వంటి అనేక రచనలు ఆయనలోని కవిని మేల్కొలిపాయి. గళాన్ని, కలాన్ని ఆయుధంగా మలచి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ. పాటలను పదునైన ఈటెలుగా చేసి తెల్లదొరలపై అస్త్రం సంధించిన దేశం గర్వించదగ్గ ప్రజాకవిగా గుర్తింపు పొందారు. నిజాయితీకి, నిర్భీతికి మారుపేరుగా నిలిచి సాంఘిక అసమానతలపై గర్జించిన గొప్ప పాత్రికేయుడిగా 'మా కొద్దీ తెల్లదొరతనం' అనే గేయంతో జాతీయ గేయ కవితా సార్వభౌముడిగా ప్రఖ్యాతి చెందారు గరిమెళ్ల. తన విద్యాభ్యాసం, యౌవ్వనమంతా అదే జిల్లాలోని పోలాకి మండలం ప్రియాగ్రహారరలోనే జరిగింది. పై చదువుల కోసం విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రిలో గడిపారు. గంజాం జిల్లా (అప్పటి ఉమ్మడి మద్రాస్‌లో భాగమై నేడు ఒడిషాలో జిల్లాగా ఉంది) కలెక్టర్‌ కార్యాలయంలో ప్రధాన గుమస్తాగా, విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పటికీ గేయ రచయితగా, పాత్రికేయునిగా, స్వాతంత్య్ర సమరయోధునిగానే గరిమెళ్ల అందరికీ సుపరిచితులు. ఆయన రచనలు యావత్తూ సమాజ మార్పునకు, గ్రామీణ జీవనాన్ని సమూలంగా మార్చే యత్నాలకు దగ్గరగా సాగేవి. 'రాసేవాడు పాడలేడని, పాడేవాడు రాయలేడన్న' నానుడికి భిన్నంగా కలం, గళం రెండూ తన ఆస్తులుగా చేసుకున్న ఘనకీర్తి గరిమెళ్లకే సొంతం. 1919 ఏప్రిల్‌ 13 నాటి జలియన్‌ వాలాబాగ్‌ ఘటనకు తీవ్ర ప్రభావితుడై స్వాతంత్య్ర కాంక్షను తనలో పెంచుకుని తన కలానికి మరింత పదునుపెట్టారు. ఈ దారుణ మారణ హోమాన్ని 'పాంచాలము' అనే గీతం ద్వారా ఖండిస్తూ దేశ ప్రజలకు సందేశమిచ్చారు. అటు తర్వాత.. ''మా కొద్దీ తెల్లదొరతనము/మా కొద్దీ తెల్లదొరతనము../మా ప్రాణాలపై పొంచి/మానాలు హరియించే కోర్టులంటూ పెట్టి/పార్టీలు పుట్టించి/మా కొద్దీ తెల్లదొరతనము'' అనే గేయం రచించి గొప్ప రచయితగా కొలవబడ్డాడు. ఈ సందర్భంగా విజయనగర పూసపాటి వంశీయులు ఆయనను ప్రత్యేకంగా 'దర్బార్‌'కు రప్పించి గౌరవాభిషేకం చేశారు. ఈ గేయం పల్లెపల్లెన వల్లెవేయని గొంతు ఆనాడు లేదంటే ఆశ్చర్యం, అతిశయోక్తి కాజాలదు. 1920లో ఉపాధ్యాయ శిక్షణకు రాజమహేంద్రవరం వెళ్లిన గరిమెళ్ల స్వయంగా తన గేయాన్ని ఆలపించగా నాటి కలెక్టర్‌ జిటిహెచ్‌ బ్రేకెన్‌కు ముచ్చెమటలు పుట్టించాయి. ఏమి చేయాలో పాలుపోక 'భాష తెలియని నాకే గగుర్పాటుకు, ఒంటిపై రోమాలు పైకి లేస్తుంటే ఇక భారతీయులకు ఎంత ఉత్తేజాన్నిస్తుందో అని రాజద్రోహ చట్టం కింద గరిమెళ్లను చెరసాలకు పంపించి ఏడాది కఠిన కారాగారాన్ని విధించారు. ఆ సమయంలోనే గాంధీజీ పిలుపు మేరకు చదువు గురించి సైతం ఆలోచించకుండా సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా గరిమెళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా గరిమెళ్ల కలం నుంచి మరిన్ని దేశభక్తి గేయ ఆణిముత్యాలు వెలువడ్డాయి. 'స్వరాజ్య గీతాల ఖండకావ్యాల'ను బ్రిటిష్‌ పాలకులు నిషేధించి రాజద్రోహం కింద మరో రెండేళ్ల పాటు శిక్షను విధించారు. శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే తండ్రిని, తాతను కోల్పోయి విడుదలై వచ్చేసరికి తన సతీమణిని సైతం కోల్పోయారు గరిమెళ్ల. బతుకు తెరువు కోసం 1933లో మద్రాసులో అడుగుపెట్టి తన కలాన్ని నమ్ముకుని పూర్తిస్థాయి పాత్రికేయునిగా మారారు. కెఎస్‌ కేసరి 'గృహలక్ష్మి'లో సంపాదకునిగానూ, ఆ తర్వాత ఆచార్య ఎన్‌జి రంగా 'వాహిని'కి ఉపసంపాదకునిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ తెలుగు దినపత్రిక 'ఆంధ్రప్రభ'లో ఉపసంపాదకునిగానూ, ఆ తర్వాత ఆనందవాణి పత్రికకు సంపాదకునిగా బాధ్యతలు నిర్వహించారు. వావిళ్ల రామస్వామి సన్స్‌ కంపెనీలో ప్రూఫ్‌రీడర్‌గా పనిచేశారు. బ్రిటిష్‌ పాలకులను హడలెత్తించిన మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాపాటల త్యాగయ్యగా ప్రజల కోసం తప్పితే యాజమాన్యాల కోసం పనిచేయని గరిమెళ్ల ఏ పత్రికలోనూ సుదీర్ఘకాలం స్థిరంగా పనిచేయలేదు. అయినప్పటికీ దుందుభి, వికారి, తదితర నామాలతో ఢంకా, కృష్ణాపత్రిక, త్రిలింగ, ఆంధ్రసహకార దీపిక, విలేజ్‌ పంచాయతీ జర్నల్‌, గ్రామస్వరాజ్యం వంటి పత్రికల్లో, ఆకాశవాణి (మద్రాసు) కేంద్రానికి పలు వ్యాసాలు రాసి ప్రజల్లో చైతన్యం కలిగిస్తూనే ఉండేవారు. అయితే సంపాదన అంతంత మాత్రంగానే ఉండడంతో తమ్ముడు రామలింగమూర్తితో కలసి మద్రాస్‌ మైలాపూర్‌లో హోటల్‌ నడిపారు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రి వంటి సహృదయులు ఆర్థిక సాయం లభించినప్పటికినీ గరిమెళ్ల వారి మద్రాసు జీవితం దారిద్య్రానికి మారుపేరుగా నిలిచింది.
సాహితీకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, పాత్రికేయునిగా సేవలందించిన గరిమెళ్లకు గుర్తింపు నివ్వడంలో నేటి మన పాలకులు వెనుకబడ్డారనే విమర్శలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి. సొంత ఊరు ప్రియాగ్రహారంలో జూనియర్‌ కాలేజీకి గరిమెళ్ల పేరును, శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌ భవనానికి గరిమెళ్ల స్మారక కేంద్రంగా నామకరణం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని గ్రంథాలయానికి ఆయన పేరు పెట్టారు. గరిమెళ్ల పేర తపాలా బిళ్ల నేటికీ విడుదల కాలేదు. రాష్ట్రాన్ని పాలించిన అన్ని పార్టీలూ హామీలైతే ఇచ్చాయి కానీ ఆచరణలో వెనుకబడ్డాయి. నేటి యువతకు స్ఫూర్తిప్రదాతగా నిలిచే గరిమెళ్ల గురించి విడమరచి సభలు పెట్టాలన్న కాంక్ష వామపక్షాలు, అభ్యుదయ వాదుల నుంచి వినిపిస్తోంది. కానీ పాలక పార్టీలు, అధినేతలు ఈ అంశాన్ని బుద్ధిపూర్వకంగానే పెడచెవిన పెట్టడం విచారకరం.
(వ్యాసకర్త ప్రజాశక్తి విశాఖపట్నం ప్రతినిధి)
- ఎన్‌ మధుసూదనరావు