యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా అమరావతి కేంద్రంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ సంస్థ రూపొందించిన సీడ్ కాపిటల్ నమూనాను 70 ఎంఎం టెలిస్కోప్‌లో చూపించి యావదాంధ్ర ప్రజలకు కనువిందు కలిగించారు. చంద్రబాబు నాయుడు చూపించిన రాజధాని ప్రణాళికలో కలల రాజధానిపై కలలుగనేవారికీ, కలలతో వ్యాపారం చేసుకునేవారికీ కావాల్సిన హంగూ ఆర్భాటాలన్నీ పుష్కలంగా వున్నాయి. 7, 325 చ. కమి. మీ . విస్తీర్ణంలో నిర్మించే మూడంచెల రాజధానిలో 16.9 చ.కి.మీ వైశాల్యంలో మొదట ఈ సీడ్ కేపిటల్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. సోమవారం రాజమండ్రిలో సింగపూర్ మంత్రి ముఖ్యమంత్రికి అందజేసిన సిటీ నమూనా ఆంధ్రుల రాజధాని అమరావతి నగరి రూపురేఖలను కళ్లకు కట్టింది. నదికి అటు ఇటు ఆకాశాన్నంటే రెండు బహుళ అంతస్తుల భవనాలు, వాటిని అనుసంధానిస్తూ అత్యంత అధునాతనమైన ప్రధాన రహదారి, వాటిని అనుకుని నీటి కొలనులు, వినోద పార్కులు, రిక్రియేషన్ సెంటర్లు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, మంత్రులు, ఉన్నతాధికారుల నివాస భవంతులు, పచ్చిక బయళ్లు, వాణిజ్య కూడళ్లు, 12 కి.మీ పొడవున్న మెట్రో రైలు మార్గం, 15 కి.మీ విస్తీర్ణంలో బస్ ట్రాన్సిట్ జోన్, ఇతర సామాజిక మౌలిక సదుపాయాలతో నూతన రాజధానిని దేశంలో నెంబర్ వన్ స్మార్ట్ సిటీగా రూపొందించాలనేది ఆ నమూనా ఉద్దేశం. ఇది వాస్తవ రూపందాల్చితే అమరావాలి కచ్చితంగా దేశంలోనే నెంబర్‌వన్ రాజధాని అవుతుంది. మాస్టర్ ప్లాన్‌లో చూపిన హంగులన్నీ నూతన రాజధానికి వుండాలన్నదానిపై ఎవరికీ పేచీ లేదు. వచ్చే వందేళ్ల వరకు భావి తరాల అవసరాలకు తగినట్లుగా ముందు చూపుతో రాజధానిని నిర్మిస్తున్నానని ముఖ్యమంత్రి పదే పదే చెబుతూ వచ్చినట్లుగానే రాజధాని నమూనా ఉంది. ప్రజల నివాస యోగ్యమైన రాజధానిగా ఉండాలనీ, దాని కోసం గోల్ఫ్ కోర్సులు, షాపింగ్ మాల్స్, ఇతర హంగులు సమకూర్చుతున్నామని చెబుతున్నారు. కొత్త రాజధాని ప్రజల రాజధాని కావాలని ఆయన ఆకాంక్ష. కానీ ఏ ప్రజలకోసం ఈ రాజధాని అనేది ప్రశ్న.
రాజధాని నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారన్నదానిపై ముఖ్యమంత్రి కానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ సూటిగా సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారు. నూతన రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రానికి వచ్చే అయిదేళ్లలో లక్ష కోట్లు గ్రాంటుగా ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పద్నాల్గవ ఆర్థిక సంఘం పట్టించుకోలేదు. తెలుగుదేశం భాగస్వామిగా వున్న ఎన్డీయే ప్రభుత్వం కూడా దీనిని అంత సీరియస్‌గా తీసుకోలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో నూతన రాజధాని నిర్మాణం కోసం కేటాయించిన రూ.3,168 కోట్లు ఏమూలకు సరిపోవు. అలాంటప్పుడు రాజధాని నిర్మాణానికి అవసరమైన లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? కార్పొరేట్ రంగం భాగస్వామ్యంతో రాజధానిని నిర్మిస్తామంటారా? కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే వాటికి లాభాలుంటే తప్ప పెట్టవు. వాటికి లాభాలు ఎక్కడి నుంచి చూపిస్తారు? భూ సమీకరణ ద్వారా రైతులు, కౌల్దార్ల నుంచి బలవంతంగా తీసుకున్న విలువైన భూములను కార్పొరేట్లకు నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఈ లాభాలు సమకూర్చుతారా? కార్పొరేట్ల భాగస్వామ్యంతో కూడిన రాజధానిలో సామాన్యులకు అసలు చోటు వుంటుందా? పెద్ద పెద్ద టౌన్‌షిప్‌లు, గేట్‌వేలు, విహార కేంద్రాలు, మాల్స్, బిజినెస్ సెంటర్లు, విశాలమైన రహదారులు మెర్సిడెస్ బెంజ్ కార్లలో తిరిగే సంపన్నులకే ఉపయోగపడతాయి తప్ప సామాన్యులకు వీటివల్ల ఒరిగేదేమీ వుండదు. ఈ కొత్త రాజధానిలో సామాన్యుల నివాసకాలనీలకు ఎక్కడా చోటు కేటాయించిన దాఖలాలు లేవు. సంపన్నులకు అవసరమైన సమస్త సౌకర్యాలు కల్పించినప్పుడే పెట్టుబడులు ఆకర్షించగలమని చంద్రబాబు సర్కారు చెబుతోంది. పెట్టుబడులొస్తేనే పరిశ్రమలు, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి అంతోంది. పేదలను, దళితులను, ఇతర అణగారిన వర్గాలను పట్టణాలకు దూరంగా తరిమేసే ప్రతి చోటా ప్రభుత్వాలు ఇటువంటి వాదననే ముందుకు తెస్తుంటాయి. వాస్తవానికి రాజధానిని అందంగా అద్దంలా మెరిసేలా వుంచేదీ, సంపన్నుల ఇళ్లలో ఇంటి పనులు చేసేది ఈ పేదలే. ఆ విషయం మరచిపోయి పేదలను రాజధానికి దూరంగా తరిమేసే ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదం తెలపడం దుర్మార్గం. తరతరాలుగా పేద రైతులను, కౌలుదార్లు, వ్యవసాయ కార్మికులు ఇతర గ్రామీణ పేదలు నివసిస్తున్న భూమిపై నుండి వారిని తరిమేసి ఆ భూములపై కార్పొరేట్ సామ్రాజ్యాన్ని నిర్మించడం కొత్త రాజధాని నేటి వాస్తవం. ఆ సామ్రాజ్యంలో సామాన్యులకు చోటు లేకుండా చేయడం రేపటి నిజం.
రెండు ప్రపంచాల మధ్య విభజన తీసుకొచ్చే కార్పొరేట్ రాజధాని కాదు ఇప్పుడు నవ్యాంధ్ర ప్రజలు కోరుకుంటున్నది. సామాన్యులకు కూడా చోటుండే రాజ ధానిని వారు కోరుకుంటున్నారు. రాజధాని నిర్మా ణంలో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసర ముంది. అదే సందర్భంలో నూతన రాజధానికి కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను రాబట్టాలి.