కార్పోరేట్‌ వైద్యానికి ప్రజలను బలిపశువులుగా మారుస్తున్న ప్రభుత్వాలు

అందరికీ ఆరోగ్యం అన్న నినాదం విశ్వసార్వ జనీతకు అద్దంపడుతున్నప్పటికీ మన దేశంలో ప్రజారోగ్యం జాతీయ ఆరోగ్య విధానప్రకటనకు విరుద్దంగా ప్రవేటీకరణ దిశగాపయనించడం ఆందోళన కలిగిస్తున్నది. దేశ ప్రజల్లో మధ్య తరగతి, పేద ప్రజలు 85శాతం మందిదాకా వున్నారు. పేద ప్రజల ప్రధాన ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుండటం వల్ల ప్రభుత్వరంగంలో నిర్వహించబడుతున్న ఆసుపత్రులకు కార్పెరేట్‌ వైద్యం పెను సవాలుగా మారింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంతో పాటు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యతగా, ప్రాథమిక విధిగా పరిగణించవలసివుందని భారత రాజ్యంగంలోని నాలుగవ భాగం ఉద్ఘాటిస్తుంది. రాజ్యంగ నిబంధనలు - విధులను పరిగణలోకి తీసుకోవాల్సిన పాలకులు వైద్య ఆరోగ్యరంగాన్ని డబ్బు జబ్బుగా మార్చడం జరిగింది. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే ప్రపంచ వ్యాధుల భారంలో మనదేశం వాటా ఉండవలసిన దానికంటే ఎక్కువగా వుంది. గ్రామీణ, పట్టణప్రాంతాల మధ్య మాత్రమే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా ఆరోగ్య అసమానతలు చాలా విస్తృతంగా ఉన్నాయి. ఆరోగ్యం, ఆరోగ్యసేవల్లో వస్తున్న మార్పులు ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మెజార్టీ ప్రజలు ఆరోగ్య సేవల పట్ల అసంతృప్తితో ఉన్నారు. అందుకే ప్రజారోగ్యం, వైద్య రంగం పనితీరు సంబంధిత విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. తామరతంపరగా వెలుస్తున్న కార్పొరేట్‌ ఆసుపత్రులు, క్రమేపీ పుంజుకుంటున్న ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ప్రభుత్వ విధానాల పుణ్యమా అని వాటిలో ప్రవేశిస్తున్న విదేశీ కంపెనీలు, విదేశీ పెట్టుబడులు... ఇవన్నీ మన ఆరోగ్య రంగాన్ని అనారోగ్యంలోకి తీసుకుని వెళుతున్న పరిస్థితి దాపురించింది. కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని దోచుకుంటున్నాయి. ఇందులో కనీస మానవతా విలువలు, నైతిక ప్రమాణాలు కరువవుతున్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రులు కాసులు దండుకోవడమే లక్ష్యంగాపెట్టుకున్నాయన్న విమర్శలు తారాస్థాయిలో మిన్నంటుతున్నాయి. కొన్ని ఆసుపత్రుల వ్యవహారశైలి ఈ విమర్శలను మరింత బలపరిచేవిధంగా ఉంది. ఇటీవల కాలంలో ఆరోగ్య శ్రీ లాంటి ఆకర్షణీయమైన పథకాలతో, కార్పోరేట్‌ ఆసుపత్రులకు, ఇన్పూరెన్స్‌ కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సాహం, ప్రభుత్వ ప్రచార సాధనాల ద్వారా వీటికి ప్రజల నుంచి సానుభూతి మాత్రమేకాదు, ప్రోత్సాహం, వెర్రివ్యామోహం కలుగజేస్తున్నాయి. వాస్తవానికి ఆరోగ్యశ్రీపథకం ఆలోచన మంచిదైనప్పటికీ, ఆచరణలో కార్పొరేట్‌ సంస్థలే ఎక్కువ ప్రయోజనాలు పొందినట్లు స్పష్టమైంది. మరోవైపు హెల్త్‌ ఇన్సురెన్స్‌ పై విస్తృతంగా ప్రచారం పెరుగుతోంది. అనేక గ్రూపులు, సంస్థలు మాకు కూడా ఆ సౌకర్యం కావాలని రోజురోజూకు చేస్తున్న డిమాండ్లు .. ఇవన్నీ పరస్పర పూరకాలు. కార్పొరేట్‌ ఆసుపత్రులమీద, ఇన్సూరెన్స్‌ కంపెనీల మీద ప్రజలకు వ్యామోహం పెంచి ఆ మేరకు ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా ప్రజల నుంచి ప్రతిఘటన రాకుండా చూసుకోవడం అనేది ఒక వ్యూహంప్రకారం జరుగుతుంది. ఇంకో కోణం పరిశీలిస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రైవేటు సేవల్లో తరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఏదో కొద్ది పాటి సమయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడపటం తర్వాత ప్రవేట్‌ ఆసుపత్రుల పంచన చేరడం అక్కడ వైద్య సేవలు నిర్వహించి నాలుగు కాసులు వెనకేసుకోవడం వారి నిత్యకృత్యమైంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ వైద్యరంగాన్ని బలపరచి, విస్తరింపజేయడం పాలకుల ప్రధాన విధి. ప్రజారోగ్య పరిరక్షణ కోసం పాలకులతో పాటు వైద్యులు కూడా నైతిక విలువలు పెంపొందించుకోవాలి.

- డాక్టర్‌ ఆణంగి వెంకటరామకృష్ణ