పెట్టుబడిదారులు, వారి కిరాయి రచయితలు పండుగజేసుకుని పట్టు మని పాతికేళ్ళు కాలేదు. ఫుకయామా ''చరిత్ర అంతమైందని'' ప్రకటించి నేటికి 23 ఏళ్లు. మార్క్స్ చెప్పిన ''వేతన బానిసలు'' (కార్మికవర్గమే) లేరని ఆండ్రీ గోర్జ్ అంతకు ముందే ప్రకటించాడు. సోవియట్‌లో సోషలిజం కూలిపోయినప్పుడు, అప్పటికే తూర్పు ఐరోపా దేశాలు పెట్టుబడి కబంద హస్తాల్లో చిక్కినప్పుడు ''సామ్రాజ్యం'' పులకించి పోయింది. ఆ మైకంలో ఫ్రాన్సిస్ ఫుక యామా పలవరింపే పైన చెప్పిన ''చరిత్ర అంతం''! మన దేశంలోని వారి తాబేదార్లు, జీతగాళ్ళు, ''అన్ని యిజాలు విఫలమ య్యాయి. ఇక భవిష్యత్ అంతా టూరిజ ందే!'' అని ప్రవచించారు.
1998లో ''ఆసియా పులుల'' సంక్షోభంతో ఆత్మరక్షణ లో పడ్డ ''సంస్కరణల ప్రతిపాదకులు'' 2008 అమెరికా ఆర్థిక సంక్షోభంతో పూర్తి స్థాయిలో నోళ్ళు వెళ్ళబెట్టారు. 1945-70 మధ్య పెట్టుబడిదారీ విధానానికి 'స్వర్ణయుగం'. వాస్తవానికి రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత సోషలిస్టు కూటమి ఏర్పాటు, వలస వ్యవస్థ కూలిపోవడం వంటివి సామ్రాజ్యవాదానికి చరమగీతం పాడుండాలి. కానీ ఆ విధం గా జరగలేదు.
ప్రపంచ దోపిడీకి కొత్త మార్గాలు వెతుక్కుంది. ఇతర అనేక కారణాలున్నా అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అమలైన ''డిమాండు మేనేజిమెంట్'' పద్ధతులు, అంటే, జాన్ మేనార్డ్ కీన్స్ చెప్పిన పద్ధతులు అన్నీ పెట్టుబడిదారీ దేశాల్లో అమల్లోకొచ్చాయి. ''జపాన్, దక్షిణ కొరియా మొదలైన దేశాల్లో అమలైన భూ సంస్కరణలు ఆ దేశాల్లో పెద్ద మార్కె ట్‌ను సృష్టించాయి. సర్వవ్యాపితమైన విద్యా వ్యవస్థ, అమె రికా రాజకీయ, భౌగోళిక వ్యూహంలో భాగంగా అనుమతిం చబడ్డ ''మార్కెట్ అవకాశాలు'' ఈ దేశాల్లో పెట్టుబడిదారీ విధాన పురోగమనానికి దారితీశాయి''. (''శాతాబ్దాంతంలో ఆసియాలో పెట్టుబడిదారీ విధానం'' మంత్లీ రివ్యూ పత్రికలో ప్రభాత్ పట్నాయక్ వ్యాసం 1999).
''గ్లోబలైజేషన్ ఆఫ్ ఫైనాన్స్'' గ్రంథంలో కవల్జిత్ సింగ్ చెప్పినట్లు 1973 చమురు సంక్షోభం వల్ల లక్షల కోట్ల డాలర్ల సంపద పశ్చిమ దేశాల బ్యాంకుల వద్ద పోగుపడింది. ఈ ఫైనాన్స్ పెట్టుబడే లాభాల కోసం భూమండలమంతా ప్రవహించడం 1980 దశకం నుంచి మనం చూస్తాం. దీనికి అన్ని దేశాలూ (కొన్ని దేశాలే మినహాయింపు) దాసోహమం టున్నాయి. ఆయా దేశాలు పెట్టుకున్న పద్ధతులన్నింటినీ బలవంతంగా మార్పు చేయగల సత్తా ఈ ఫైనాన్స్ పెట్టు బడికి ఉంది. 1991 తర్వాత భారతదేశమే దీనికి పెద్ద ఉదా హరణ. అమెరికాలో కొలువు తీరిన అప్పు ఆధారిత ఆర్థిక వ్యవస్థ (క్రెడిట్ బేస్డ్ ఎకానమీ) 2008 'హౌసింగ్ బుడగ' పేలడంతో ప్రపంచానికి అర్థమైంది. అమెరికా సమాజాన్ని ప్రస్తుత సంక్షోభం నుంచి 'బయట వెయ్యడానికి' అన్న పేర ఆ మధ్య గార్డియన్ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. దాని శీర్షిక ''అమెరికాలో రానున్న అప్పు-ఆర్థిక సునామీ''. దాన్లో రాసిన కొన్ని విషయాలు నేడు ఆ దేశంలోని ఆలోచనలకు అద్దం పడ తాయి. 'లెవీ ఎకనామిక్స్ ఇన్‌స్టిట్యూట్' అంచనాలో నేటి అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ 2008 ఆర్థిక సంక్షోభ కాలం ముందున్న స్థితిలోకి, అంటే అప్పు ఆధారిత స్థితిలోకి వెళ్తోం ది. ప్రజల నిజ ఆదాయాలు పడిపోతున్నా వారు ఖర్చు చేస్తు న్న తీరు పెరుగుతోందట! దేవుడి గురించి 17వ శతాబ్ది కవి వోల్టెయిర్ మాటల్ని కోట్ చేస్తూ ''బుడగలు, అప్పులు ఉనికిలో లేకపోతే, మనం వాటిని సృష్టించడం తప్పనిసరి. నేడు సరి గ్గా దాన్నే చేస్తున్నాం'' అన్న వాక్యంతో ఆ వ్యాసం ముగిసింది. ఇదీ పెట్టుబడిదారీ దేశాలు నెట్టుకొస్తున్న పరిస్థితి.
ఆ దేశాల్లో దోపిడీ తీవ్రతను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాల్‌స్ట్రీట్ ముట్టడి వంటి ఉద్యమాలు పెల్లుబుకుతున్నాయి. 99 శాతం జనం కడుపుకొట్టి ఒక్క శాతానికి పాలకులు సేవచేస్తున్న తీరు బహిర్గతమౌతోంది. మనలాంటి దేశాల్లో కమ్యూనిస్టు కార్యకర్తలే పెట్టుబడిదారీ విధానం నశించాలన్న నినాదాలిస్తుంటే పశ్చిమ దేశాల్లో సాధారణ కార్మికులు కూడా ''డౌన్ డౌన్ క్యాపిటలిజం'' అని నినదిస్తున్నారు. ఆ వ్యవస్థ బాగాలేదని అర్థమైనా దిశానిర్దేశం చేయగల బలమైన కమ్యూనిస్టు పార్టీ లేకపోవడం వల్ల పెల్లుబికే ఉద్యమాలు ఆక్యుపై వాల్‌స్ట్రీట్‌లా చల్లారిపోతు న్నాయి. ఏమైనా నేటి పెట్టుబడిదారీ సమాజంలో దోపిడీ ఎక్కువైంది. ఇది రెండు రకాలుగా సాగుతోంది. ఒకటి, పని గంటలు 12, 14కు పెరిగింది. రెండు, యాంత్రీకరణ, ఆధునీకరణలు వేగంగా సాగుతూనే శాశ్వత ఉపాధి 1980, 90 దశకాల్తో పోలిస్తే 60 శాతం తగ్గిపోయింది. గైస్టాండింగ్ రాసిన ''ప్రికేరియట్'' పుస్తకంలో పశ్చిమ దేశాల్లో ఇటువంటి కార్మికుల గురించి అద్భుతంగా వివరించారు. మన దేశంలో వివిధ పేర్లతో పిలవబడే ఈ తాత్కాలిక కార్మికులకు ప్రభుత్వాలు నిర్ణయించే అరకొర కనీస వేతనాలు దొరకవు. పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలుండవు. ఇవికాక కొత్తగా కార్మిక చట్టాల సరళీకరణ మొదలైంది. ఎక్కడ చౌకగా కార్మికశక్తి అందుబాటులో ఉంటుందో ఆ దేశాలకు బహుళజాతి కంపెనీలు తమ పరిశ్రమలను బదిలీ చేసుకుంటున్నాయి. పరిశ్రమ తమ దేశం నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే కార్మిక చట్టాల సవరణకు అంగీకరించాలి. జీతాల పెరుగుదల లేకుండా లేదా ప్రస్తుత వేతనాలను తగ్గించుకోవడానికి అంగీకరించాలి. అనేక దేశాల్లో ఇది ఒక నిజం. మన రాష్ట్రంలో ఇంకా ఆ దశ రాలేదు. కానీ, అది ఎంతో దూరంలో లేదన్నది మాత్రం వాస్తవం. దక్షిణ కొరియాలో కెటియు నాయకత్వంలో మూడు, నాలుగు రోజులు పార్లమెంటు ముట్టడి చేసినా, ఫ్రాన్స్‌లో సిజిటి ఆధ్వర్యంలో పోరాడినా దేనికి దానికే నిర్దిష్ట సమస్యలపై కాక మొత్తం సరళీకరణ విధానాలపై పోరాడకుండా సమస్యలు పరిష్కారం కావన్నది మన జీవిత సత్యం.
సరళీకృత ఆర్థిక విధానానికి ప్రత్యామ్నాయం లేదనేది అన్ని దేశాల్లోని పాలకుల వాదన. పివి నుంచి మోడీ వరకు, చంద్రబాబులు, వైఎస్‌లు, కెసిఆర్‌ల వరకు ఏ రూపంలో చెప్పినా వారి వాదన సారాంశం అదే! స్వర్ణాంధ్రప్రదేశ్‌కు, బంగారు తెలంగాణకు తేడా ఏమీ లేదని నేడు ఇరు రాష్ట్రాల్లోని కష్టజీవులకు అర్థమౌతోంది. ఒకాయన గ్రాంథిక భాషలో చెప్తే ఇంకొకరు వ్యావహారికంలో చెప్పారు. దీనికి ప్రతిగా వరల్డ్ సోషల్ ఫోరం నుంచి ''సోషలిజమే ప్రత్యామ్నా యం'' (సిటా) నినాదం ప్రతిధ్వనించింది. ఇది కేవలం నినాదాలకే పరిమితం కాకుండా కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో ఉదారవాద విధానాలను వ్యతిరేకించే శక్తులు అధికారం చేపట్టాయి. వెనిజులాలో మొదలైన చమురు, భారీ పరిశ్రమల జాతీయకరణ బొలీవియాలో ప్రతిధ్వనించింది. ఈక్వెడార్‌లో ఆ ప్రతిధ్వనులు కొనసాగాయి. ఆ దేశాలన్నింటినీ సోషలిస్టు దేశాలని చెప్పలేము. కానీ ఆ దేశాల్లో అమలయ్యేది మాత్రం ఉదారవాద విధానాలను వెనక్కు మళ్ళించడమే.
ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. సోవియట్ లోనూ, తూర్పు ఐరోపాలోనూ సోషలిజం దెబ్బతిన్న తర్వాత కొంత గందరగోళం, ఆందోళనకు గురైన పురోగామి శక్తులు తేరుకున్నాయి. పెట్టుబడిదారీ విధానం మానవాళి ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేదన్న వాస్తవం ఈ పాతికేళ్ళలో కనబడుతున్నది. పైగా ఈ కాలంలో దోపిడీ తీవ్రమైందని ముందే చెప్పుకున్నాం. 1917లో సోవియట్‌లో కార్మికవర్గ రాజ్యం ఏర్పడి 8 గంటల పని దినానికి చట్టం చేసిన తర్వాత 1918లో ఐఎల్‌ఒ ఏర్పాటు, తదనంతరం 8 గంటల పని దినానికి పెట్టుబడిదారీ దేశాల్లో శ్రీకారం చుట్టారు. సోవియట్‌లో మొత్తంగా ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ప్రకటించిన తర్వాత అనేక దేశాల్లో మన ఇఎస్‌ఐ వంటి స్కీములొచ్చాయి. ఆ అక్టోబర్ విప్లవాన్ని చిదిమేసిన తర్వాత మన దేశంతో సహా అనేక దేశాల్లో పిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలు, 8 గంటల పని దినానికి మంగళం పాడుతున్నారు.
1980వ దశకంలో సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదివే భారతదేశ కార్మిక సంఘాల ''కాన్ఫెడరేషన్'' అని పిలుపిచ్చిన రోజు అది సిఐటియు గోలగానే ఉంది. 2012 వచ్చేసరికి అది నిజమైంది. ఎవరికెన్ని రాజకీయ అభిప్రాయాలున్నా, ఎవరు ఏ కేంద్ర కార్మిక సంస్థకు అనుబంధించబడ్డా అంగీకృత డిమాండ్లపై కలిసి పోరాడటమే బిటిఆర్ కన్న కల. నేటి పన్నెండు డిమాండ్లు అమలు చేయించుకోగలిగితే ఉదారవాద విధానాల పీడ మన దేశంలో విరగడైనట్లే! కార్మికవర్గ ఐక్యతకు చిచ్చుపెట్టగలనని బిజెపి నమ్మకం. తన ప్రయోగశాల గుజరాత్‌లో ఆ ప్రయోగం విజయవంతమైందని దాని ధీమా! కులాలను కదిలించి మత యుద్ధానికి అది తెర తీసింది. విభిన్న కులాలు, మతాలున్న దేశంలో 'భిన్నత్వంలో ఏకత్వం'తోనే భారత్ పటిష్టంగా కొనసాగుతుంది. కొన్ని అస్తిత్వ వాద శక్తులు దళితులు, గిరిజనులు, వెనుకబడ్డ కులాలు, మైనారిటీలు, మహిళలను ప్రధాన స్రవంతి పోరాటాల నుంచి తప్పిస్తున్నాయి. ఉదారవాద విధానాలు ఊపందుకోవడమంటే పైన చెప్పిన ప్రజలందరికీ ఇబ్బందులు కల్గిస్తాయి. కష్టజీవుల ఐక్యత కోసం తగిన నినాదాలను, విధానాలను రూపొందించుకొని సాగడమే మతోన్మాదులకు 'చెక్' పెట్టే సాధనం! అనేక దేశాల కార్మికోద్యమానికి స్ఫూర్తి ప్రదాత అక్టోబర్ విప్లవం. ఆ విప్లవాశయాలకు పునరంకితమౌదాం.
- ఆర్ సుధాభాస్కర్