పశ్చిమ కృష్ణా ప్రాంతంలో కిడ్నీ వ్యాధిని నియంత్రించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్ వద్ద బాధితులు ధర్నా చేశారు. వ్యాధి వల్ల తాము ఎక్కువ సేపు కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు చేయూత లేకపోవడంతో ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా చేస్తానన్న సిఎం చంద్రబాబునాయుడు మరింత రోగాంధ్రగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ కృష్ణాలో కిడ్నీ వ్యాధి సమస్య ఉందని ప్రభుత్వం దృష్టికి వచ్చినా నియంత్రణకు చర్యలు తీసుకోలేదన్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో 111 మంది మృతి చెందారని, కేవలం మూడు నెలల వ్యవధిలోనే 32 మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నూజివీడులో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసినా అక్కడ రక్తం, మందులు, సిబ్బంది, వసతులు ఏవీ అందుబాటులో లేవన్నారు. దీంతో డయాలసిస్ రోగులు విజయవాడ వరకు ప్రయాణించాల్సి వస్తోందన్నారు. కనీసం వీరికి అంబులెన్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంచలేదని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ వ్యాధి వ్యాపించిన ప్రాంతాల్లో అందరికీ నెల రోజుల్లోగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని, ఈ సమస్య నివారణకు శాశ్వత ప్రాతిపదికన కృష్ణా జలాలను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.