కొవ్వాడ అణుపార్కు... ఆంధ్రలో ఆటం బాంబే..

ప్రపంచ దేశాలన్నీ అణువిద్యుత్కేంద్రాలను మూసివేసి, ప్రత్యామ్నాయాల వైపు వెళ్తుంటే భారత్‌లో మాత్రం అణు విద్యుత్కేంద్రాలను ఎందుకు పెడుతున్నారు? భారతదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు, బడా పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయడానికి అమెరికా పెట్టిన షరతులను ప్రభుత్వం అంగీకరించింది.
                      శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో అణుపార్కు పనులు వేగవంతం చేయడానికి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి పూనుకుం టున్నాయి. అమెరికాతో యుపిఎ-2 చేసుకున్న అణు ఒప్పందాన్ని బిజెపి, టిడిపి శరవేగంగా అమలు చేస్తున్నాయి. విధానపరంగా కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలకు తేడా లేదు. భూ సేకరణకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. భూ సేకరణకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగారు. సామాజిక సర్వే చేయడానికి సర్వే బృందాలకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆరు నెలల్లో జరగాల్సిన సర్వేను ఒక్క రోజులో పూర్తి చేయాలని బృందాలను జిల్లా యంత్రాంగం ఆదేశించింది.
             శ్రీకాకుళం జిల్లా భూకంపాల జోన్‌లో ఉంది. ఇటీవల నేపాల్‌లో భూకంపం సంభవించినప్పుడు కొవ్వాడలో కూడా భూమి కంపించింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా గతంలో భూకంపం పలుమార్లు వచ్చింది. కొవ్వాడలో అణుపార్కు పెట్టడమంటే రాష్ట్రంలో అణుబాంబు పెట్టడమే. ప్రభుత్వం కొవ్వాడలో ఆరు రియాక్టర్లు పెట్టాలని నిర్ణయించింది. ఒక్కొక్క రియాక్టర్‌ ఒక్కో అణుబాంబుతో సమానం. ప్రకృతి వైపరీత్యాల వల్లగానీ, మానవ తప్పిదం వల్లగానీ ఏ చిన్న ప్రమాదం సంభవించినా అటు ఒడిషాలోని ఛత్రపూర్‌ నుంచి ఇటు కాకినాడ వరకూ సమస్త జీవకోటి బతుకులు ప్రశ్నార్థకంగా మారిపోతాయని అణు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రధానంగా వ్యవసాయ, మత్స్య ఆధారిత రాష్ట్రం. అణు ప్రమాదం సంభవిస్తే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. అణు విద్యుత్కేంద్రం నుంచి వెలువడే అణుధార్మికత వల్ల ఆహార ధాన్యాలు, భూమి, నీరు, గాలి, సముద్రంలోని చేపలు విషతుల్యమవుతాయి. పండిన పంటలు మానన వినియోగానికి పనికి రావు. అణుధార్మికత గాలి ఎంత దూరం వీస్తే అంతవరకూ విషతుల్యమవుతాయి. అణుధార్మికత వల్ల వింత శిశువులు జన్మిస్తారు. కేన్సర్‌ వంటి భయంకరమైన రోగాలు వస్తాయి. గర్భస్రావాలు జరుగుతాయి. కానీ మన పాలకులు అణుపార్కుతో అభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అణు విద్యుత్కేంద్రానికి, ఆటంబాంబుకు వినియోగించే పదార్థం ఒకటే. అందుకే అణు ప్రమాదం సంభవిస్తే, ఆటంబాంబు పేలినట్లవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తోంది.

           కొవ్వాడకు, జపాన్‌లోని ఫుకుషియాకు దగ్గర పోలికలు ఉన్నాయి. 2011లో భూకంపం వల్ల ఫుకుషిమాలో అణు ప్రమాదం సంభవించింది. అక్కడ అణుధార్మికత నేటికీ నియంత్రణ కాలేదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ఇప్పటికీ అణుధార్మికతను అదుపు చేయలేకపోయారు. కొవ్వాడలో అణుపార్కు పెట్టి ఆంధ్రను మరో ఫుకుషిమాగా మార్చొద్దు. 1986లో చెర్నోబిల్‌లో సంభవించిన అణు ప్రమాదంతో ఐదు లక్షల జనాభా గల చెర్నోబిల్‌ డెడ్‌ సిటీగా మారిపోయింది. నేటికీ అణుధార్మికత అదుపులోకి రాలేదు. అక్కడి అణుధార్మికత ఐరోపా మొత్తాన్ని వణికించింది. లక్షల టన్నుల ఆహార ధాన్యాలు సముద్రంలో పారబోశారు. 2011లో ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలూ అణు విద్యుత్కేంద్రాలను మూసివేసి, ప్రత్యామ్నాయ మార్గాల వైపు పయనిస్తున్నాయి. జర్మనీలో 17 అణు విద్యుత్కేంద్రాలుంటే, ఇప్పటికే ఏడు కేంద్రాలను మూసివేశారు. మిగిలిన వాటిని 2022 నాటికి మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. 1979లో అమెరికాలో త్రీమైల్‌ ఐలాండ్‌లో అణు ప్రమాదం సంభవించిన తర్వాత కొత్తగా ఒక్క అణువిద్యుత్కేంద్రాన్నీ నిర్మించలేదు. ఉన్న వాటిని మూసివేయడానికి సన్నాహాలు చేస్తోంది.

           ప్రపంచ దేశాలన్నీ అణువిద్యుత్కేంద్రాలను మూసివేసి, ప్రత్యామ్నాయాల వైపు వెళ్తుంటే భారత్‌లో మాత్రం అణు విద్యుత్కేంద్రాలను ఎందుకు పెడుతున్నారు? భారతదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు, బడా పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయడానికి అమెరికా పెట్టిన షరతులను ప్రభుత్వం అంగీకరించింది. వామపక్షాలు, లౌకిక పార్టీలు, ప్రజాతంత్రవాదులు వ్యతిరేకించినా, అప్పటి యుపిఎ ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందాన్ని చేసుకుంది. ఎన్నికలకు ముందు అణు ఒప్పందాన్ని బిజెపి, టిడిపి వ్యతిరేకించి, అధికారంలోకొచ్చాక అణుకూలంగా జీవోలు తెచ్చాయి. 2010లో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కొవ్వాడ వచ్చి 'థర్మల్‌, అణువిద్యుత్కేంద్రాలతో శ్రీకాకుళం జిల్లాను శ్మశానం చేస్తారా?' అని ప్రశ్నించారు. అధికారంలోకొచ్చాక టిడిపి ప్రభుత్వం అణుపార్కుకు అనుకూలంగా జీవో 53ను తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం రోజుకు రెండు లక్షల కోట్ల లీటర్ల నాగావళి నీటిని అణువిద్యుత్‌ పార్కుకు కేటాయిస్తారు. నాగావళి నది నీరు అణువిద్యుత్‌ కోసం తోటపల్లి కాలువ పనులను ఆగమేఘాలపై పూర్తి చేస్తున్నారు. ఈ నీటి కేటాయింపు వల్ల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటారనే ఆందోళనను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎన్నికలకు ముందు అణుపార్కును వ్యతిరేకించిన టిడిపి, అధికారంలోకి వచ్చిన తర్వాత అణుపార్కుకు అనుకూలంగా జీవోలు తేవడం ప్రజలను మోసగించడమే. కొవ్వాడలో అణుపార్కు ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్‌కే పెను ముప్పు.
అణువిద్యుత్‌ ఖరీదైంది. అణు వ్యర్థాల నుంచి వెలువడే అణుధార్మికతను నియంత్రించడానికి అణు వ్యర్థాలను ఇనుప కడ్డీల్లో పెట్టి, మానవ రహిత ప్రదేశాల్లో ఉంచడానికి ఏటా లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలి. ఇంత డబ్బు ఎక్కడ కేటాయించగలం? అణు ప్రమాదాలు సంభవించకుండా ఉండే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో లేదు. అందుకే ప్రపంచ దేశాలు అణువిద్యుత్కేంద్రాలను మూసివేసి, ప్రత్యామ్నాయాల వైపు వెళ్తున్నాయి. శీతల దేశాల్లో సూర్యరశ్మితో విద్యుత్‌ తయారు చేయడానికి పూనుకుంటున్నాయి. మన దేశంలో సూర్యరశ్మి, గాలి, నీరు పుష్కలంగా లభిస్తాయి. వీటితో అతిచౌకగా విద్యుత్‌ తయారు చేయొచ్చు. సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. పర్యాటక కేంద్రాలూ అభివృద్ధి చెందుతాయి. పర్యావరణానికి, మానవ మనుగడకు ప్రమాదం లేని, ప్రత్యామ్నాయ విద్యుత్‌ను మనం తయారు చేసుకోవచ్చు.
               కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అణు ప్రమాదాలు సంభవించవని అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. అణు ప్రమాదాలే సంభవించకపోతే అమెరికా కంపెనీలు నష్టపరిహారం చెల్లించనని అంటే మోడీ ప్రభుత్వం ప్రజల డబ్బు రూ.1,500 కోట్లతో అణు నష్ట పరిహార బీమా నిధిని ఎందుకు ఏర్పాటు చేసినట్లు? వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా ఎందుకు మభ్యపెడుతున్నారు? ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రజల నుంచి దౌర్జన్యంగా భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వినాశకర అణుపార్కును రద్దు చేయాలని గతంలో శ్రీకాకుళం జిల్లాపరిషత్తు, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండల పరిషత్తులు, రణస్థలం మండలంలోని అన్ని పంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలు చేసినా, ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి.
                అణుపార్కుకు వ్యతిరేకంగా సిపిఎం, వామపక్షాలు, పర్యావరణ సంస్థలు, ప్రజాసంఘాలు ఇప్పటికే ధర్నాలు, ప్రదర్శనలు, సదస్సులు, గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టాయి. మేధావులు, అణు నిపుణులు కొవ్వాడ పరిసర గ్రామాల్లో పర్యటించి వినాశకర అణుపార్కును ప్రతిఘటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాల ద్వారా సోంపేట ధర్మల్‌ ప్లాంట్‌ను వెనక్కి తిప్పిగొట్టగలిగాం. గుజరాత్‌లోని మిర్తివిర్ధిలో ప్రజాప్రతిఘటనతో అణుప్రాజెక్టును ప్రస్తుతం నిలుపుదల చేశారు. మహారాష్ట్రలోని జైతాపూర్‌లో అణుపార్కును ప్రజా ఉద్యమాల ద్వారా తాత్కాలికంగా వెనక్కి తిప్పికొట్టారు. వినాశకర కొవ్వాడ అణుపార్కును విశాల ప్రజా పోరాటాల ద్వారానే తిప్పికొట్టగలం.
- డి గోవిందరావు
(రచయిత సిఐటియు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి)