కోటవురట్ల మండలం గొట్టివాడ ఇసుక ర్యాంపుని వెంటనే ఆపాలని ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాచేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు.
విశాఖ జిల్లా కోటవురట్ల మండలం గొట్టివాడ గ్రామానికి ఆనుకొని వున్న వరహానదిలో ప్రభుత్వం వారు డిఆర్‌డిఎ ద్వారా 13,500 క్యూబిక్ మీటర్లు ఇసుక తీయడానికి ఇటీవలె స్థానిక (పాయకరావుపేట) ఎం.ఎల్.ఎ ఇసుక ర్యాంపుని ప్రారంభించడం జరిగింది. దీనిని గ్రామ ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అక్కడ 13,500 క్యూబిక్ మీటర్లు ఇసుకను భారీ యంత్రాలతో తీసివేయడం వలన భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. మేము వ్యవసాయంకు ఉపయోగిస్తున్న బోర్‌వెల్స్ నుండి నీరు రాకుండాపోతుంది. దీని కారణంగా వ్యవసాయాలు దెబ్బతింటాయి. వ్యవసాయం మీద ఆదారపడి జీవిస్తున్న మా గ్రామ ప్రజలందరం నష్టపోతాం. మా గ్రామానికి త్రాగునీటికి కూడా యిబ్బందులు ఏర్పడుతాయి. దీనితోపాటుగా కోటవరట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో వున్న గ్రామాలకి మంచినీరు అందించే ఫైలెట్ ప్రాజెక్టు కూడా దీనికి అందుబాటులోనే ఉంది. ఇక్కడ ఇసుక తీయడం వలన భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్‌లో త్రాగునీటికి తీవ్రంగా యిబ్బందులు వస్తాయి.
ఇటువంటి వర్షాభావ పరిస్థితుల్లో ఇసుక తీయడం వలన త్రాగునీటికి, సాగునీటికి తీవ్రంగా యిబ్బందులు ఎదురౌతాయి. కావున ఇసుక తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో సిపియం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు కోటవురట్ల మండల నాయకులు జి.డేవిడ్‌రాజు, గ్రామ ఉపసర్పంచ్ నాగేశ్వరావు, గ్రామస్తులు కర్రి రాజుబాబు, సరోజిని, పుష్ప, అచ్చియమ్మ, ప్రసాద్, నానాజీ, వి.నాగేశ్వరావు, పి.కొండయ్య, ఎ.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.