భారత ప్రభుత్వం 'సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఇసిసి) -2011'ను జులై 3వ తేదీన విడుదలచేసింది. గ్రామీణ భారత దేశంలోని ప్రజల ఆర్థిక స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఈ సర్వేలోని వివరాలు తేటతెల్లం చేశాయి. ఈ సర్వేలోని సమాచారంపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనటంలో సందేహం లేదు. ఈ గణన వెల్లడించిన అనేక వాస్తవాలలో ఒకే ఒక దాని విశ్లేషణకు నేను పరిమిత మౌతాను. అదేమంటే గ్రామీణ భారతదేశంలోని మొత్తం కుటుంబాలలో రోజు కూలీ(కాజువల్ లేబర్)పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎంత నిష్పత్తిలో ఉన్నాయనేది.
యావత్తు గ్రామీణ భారతదేశంలో సర్వే చేసిన 17.91 కోట్ల కుటుంబాలలో 9.16 కోట్ల కుటుంబాలు లేక 51.14 శాతం కుటుంబాలు రోజు కూలీలుగా శారీరక శ్రమ చేసి బతుకుతున్నాయి. అంటే వీరి ఆదాయంలో ప్రధాన భాగం ఇలా శ్రమ చేయటం ద్వారా వస్తున్నది. వీరందరూ భూమిలేని వారు కాదు. నిజానికి సామాజిక ఆర్థిక కుల గణన(ఎస్‌ఇసిసి) సమాచారాన్ని బట్టి 38.27 శాతం 'భూమిలేని' కుటుంబాలు. వీరి ఆదాయంలో ప్రధాన భాగం రోజు కూలీలుగా చేస్తున్న శారీరక శ్రమ ద్వారా వస్తున్నది. అంటే దాదాపు 13 శాతం గ్రామీణ కుటుంబాలు(51 నుంచి 38 తీసివేయగా వచ్చింది) ఎంతో కొంత భూమిని కలిగివున్నాయి. అయినప్పటికీ వీరి ఆదాయంలో ప్రధాన భాగం దిన కూలీలుగా చేస్తున్న శారీరక శ్రమ ద్వారా వస్తున్నది.
పెరుగుతున్న దినకూలీలుగా మార్చడం
మొత్తం గ్రామీణ కుటుంబాలలో సగానికి పైగా కఠోరమైన శారీరక శ్రమపై ఆధారపడి బ్రతుకుతున్నాయి. వీరికి ఎటువంటి హక్కులూ లేవు. ఉద్యోగ భద్రత లేదు. ఆదాయ భద్రత లేదు. వలస పాలన నుంచి విముక్తమైన తరువాత 67 సంవత్సరాలు గడిచాక కూడా 'ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం' అని గొప్పలు చెప్పుకుంటున్న దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండటం నమ్మలేని నిజం. ఇంతకంటే ఘోరమైన విషయం ఏమంటే ఇలా శారీరక శ్రమపై ఆధారపడి బ్రతికే వారి నిష్పత్తి స్వాతంత్య్రం వచ్చినప్పటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. దీనికంతటికీ సంబంధించిన విషయాలను నిర్వచించటంలో అనేక సమస్యలు ఉన్నాయ నటంలో సందేహం లేదు. ఉదాహరణకు 'గ్రామీణ శ్రామిక కుటుంబాలు' అంటే ఏమిటి అనేదానికి ఇచ్చిన నిర్వచనం. ఐహిక విషయాలను పోల్చినప్పుడు నిర్వచనానికి సంబంధించిన ఈ సమస్యలు మరింత తీవ్రతరమౌతాయి. ఎందుకంటే నిర్వచనాలు కాలంతోపాటు మారుతుంటాయి. అయినప్పటికీ ఐహిక విషయాలను పోల్చిచూసే ప్రయత్నం చేద్దాం. 1950-51లో చేసిన వ్యవసాయ కార్మిక విచారణననుసరించి కమ్యూనిటీ ప్రాజెక్ట్ ప్రాంతాలలోని మొత్తం గ్రామీణ కుటుంబాలలో వ్యవసాయ కార్మిక కుటుంబాలు 30.7 శాతంగా ఉన్నాయి. కమ్యూనిటీ ప్రాజెక్ట్ ప్రాంతాలలోని గ్రామీణ కుటుంబాల నిష్పత్తిలో వ్యవసాయ కార్మిక కుటుంబాల నిష్పత్తి ఎంత ఉన్నదో దేశంలోని మొత్తం గ్రామీణ కుటుంబాలలో దేశం మొత్తంలోగల వ్యవసాయ కార్మిక కుటుంబాల నిష్పత్తి అంతే ఉన్నదని అంచనా వేశారు.(ఆర్‌కె సోమ్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, 1961, ఫిబ్రవరి 25).
ఈ 30.7 శాతం సంఖ్య దేశం మొత్తానికీ ప్రాతినిధ్యంవహిస్తుందని అనుకోవచ్చు. వేరే మాటల్లో చెప్పాలంటే 1950-51లో మొత్తం గ్రామీణ కుటుంబాలలో వ్యవసాయ కార్మిక కుటుంబాల నిష్పత్తి రమారమి 30 శాతం ఉంటుందని భావించవచ్చు. అయితే ఇది కేవలం వ్యవసాయ కార్మిక కుటుంబాలకు వర్తిస్తుందే తప్ప గ్రామీణ శ్రామిక కుటుంబాలకు కాదు. ఆర్థిక వ్యవస్థ ఇప్పటంత బహుముఖంగా విస్తరించనందున 1950-51లో మొత్తం గ్రామీణ శ్రామిక కుటుంబాలలో వ్యవసాయ కార్మిక కుటుంబాల నిష్పత్తి ఇప్పటి కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనం నేటి నిష్పత్తిని ఉపయోగించినా(అందుకోసం మొత్తం గ్రామీణ కుటుంబాలలో వ్యవసాయ కుటుంబాల నిష్పత్తిని ప్రతినిధిగా తీసుకుందాం) మొత్తం గ్రామీణ కుటుంబాలలో గ్రామీణ శ్రామిక కుటుంబాల నిష్పత్తి 40 శాతంగా వస్తుంది. దీనికిగల కారణాలను ఇప్పటికే వివరించటం జరిగింది. ఆర్థిక వ్యవస్థ తక్కువ స్థాయిలో విస్తృతీకరింపబడినందువల్ల 1950-51కి ఇది అతి అంచనా అవుతుంది. అయితే ఈ 40 శాతంలో ఉపాధిలేని కుటుంబాలు, దిన కూలీ కుటుంబాలు రెండూ ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం దిన కూలీలుగా మార్చడం బాగా పెరిగిందని మనకు తెలుసు. కాబట్టి గ్రామీణ శ్రామిక కుటుంబాల పరిమాణానికి సూచికగా 1950-51కి చెందిన 'కూలీ దొరకని, దిన కూలీ కుటుంబాల'ను ప్రస్తుతం 'శారీరక శ్రమచేసే దిన కూలీ కుటుంబాల'తో పోల్చటం అనుచితం కాదు. మొత్తం గ్రామీణ కుటుంబాలలో అలాంటి కుటుంబాల నిష్పత్తి 1950-51కి, నేటికీ మధ్య గణనీయంగా పెరిగిందనే విషయం దానితో బయటపడుతుంది. నిర్వచనానికి, అంచనాకు సంబంధించిన సమస్యలు ఈ నిర్థారణ సప్రమాణతను ప్రశ్నించజాలవని భావిస్తాను.
పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధితో ముడిబడి ఉండే 'కార్మికీకరణ' ప్రక్రియకు ఈ పెరుగుదల సూచికగా ఉందని, మనకు ఇష్టమున్నా లేకపోయినా కేవలం పెట్టుబడిదారీ అభివృద్ధిని ప్రతిబింబించే అలాంటి పెరుగుదలలో ప్రత్యేకత ఏమీలేదని, కాబట్టి ఇది చరిత్ర పురోగతిలో భాగమని కొందరు వాదించవచ్చు. అయితే ఇది పూర్తిగా తప్పుడు అవగాహన. మొత్తం గ్రామీణ కుటుంబాలలో గ్రామీణ శ్రామిక కుటుంబాల నిష్పత్తి లేక సమాంతరార్థంలో మొత్తం గ్రామీణ శ్రామికులలో వ్యవసాయ కార్మికుల నిష్పత్తి 'మిగులు నిర్గమనం(డ్రైన్ ఆఫ్ సర్‌ప్లస్)', 'పారిశ్రామిక వినాశనం(డిఇండిస్టియలైజేషన్)' అనే ద్వంద ప్రక్రియల పర్యవసానంగా వలస పాలన కాలమంతా పెరిగింది. దీనితో రైతాంగంలోని కొందరిని శ్రామికులుగా దిగజార్చింది. చాలీచాలని జీతాలతోను, ప్రతి మనిషికీ లభించే పనిదినాలు తగ్గటం వల్లను ఈ శ్రామికుల దారిద్య్రం పెరుగుతున్నది. ఇందువల్లనే కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ తన ఆరవ కాంగ్రెస్‌లో అత్యంత ప్రాధాన్యతగల ఒక సైద్ధాంతిక ప్రతిపాదన చేసింది. అదేమంటే వలస, అర్థ వలస దేశాలలో జరుగుతున్న ప్రక్రియలో రైతాంగం 'కార్మికీకరణ(ప్రొలిటేరియనైజేషన్)'కు గురికాదని, అది రైతాంగం 'దారిద్య్రీకరణ'కు గురికావటమేనని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ పేర్కొంది. అంటే ఇది గ్రామీణ ప్రాంతంలో జరిగే పెట్టుబడిదారీ అభివృద్ధి ప్రక్రియ వల్ల గ్రామీణ కార్మికులు పెరిగే ప్రక్రియ కాదని, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వలస పాలన దురాక్రమణతో వారిని దారిద్య్రంలోకి నెట్టడమని దీని అర్థం. మొత్తం గ్రామీణ శ్రామికులలో వ్యవసాయ కార్మికుల నిష్పత్తి పెరగటమనే వాస్తవాన్ని సురేంద్ర పటేల్ వంటి పరిశోధకులు వలస పాలన దోపిడీ స్వభావాన్ని ఎత్తి చూపటానికి, స్థానికంగా పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి కావటం వల్ల కార్మికీకరణ జరగకుండా, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థ చేసిన దురాక్రమణ వల్ల దారిద్రీకరణ జరిగిందని విశ్లేషించటానికి ఉపయోగించారు.
గ్రామీణ శ్రామికులు కార్మికులుగా కాకుండా దారిద్య్రంలో మగ్గుతున్న అశేష ప్రజానీకంలో భాగంగా ఉన్నారనే వాస్తవాన్ని పరిశీలించినప్పుడు మొత్తం గ్రామీణ కుటుంబాలలో గ్రామీణ శ్రామిక కుటుంబాల నిష్పత్తి తగ్గినప్పుడు వారికి అభివృద్ధిలో భాగం ఎంత దక్కిందో, ఆ నిష్పత్తి పెరిగినప్పుడు వారు దారిద్య్రీకరణకు గురయి, అభివృద్ధిలో వారికి దక్కనిదానికి సూచికగా ఉంటుంది. ప్రధాన విషయం ఏమంటే స్వాతంత్య్రానంతరం అనేక దశాబ్దాలపాటు ఈ నిష్పత్తి పెరగకుండా ఆగింది. అయితే ఆ తరువాత ఇది పెరగటం ప్రారంభించింది. నయా ఉదారవాద విధానంలో పెరుగుతున్న వ్యవసాయిక దురవస్థను ఇది ప్రతిబింబిస్తున్నది. నయా ఉదారవాద విధానం సన్నకారు రైతుల వ్యవసాయంతో సహా లఘు ఉత్పత్తిని నాశనం చేస్తుందనే వాస్తవం, గతంలో అనేక రూపాలలో వ్యవసాయానికి అందించిన ప్రభుత్వ మద్దతును నయా ఉదారవాదం ఉపసంహరించు కుంటున్నదన్న వాస్తవం ఈ వ్యవసాయిక దురవస్థను తీవ్రతరం చేస్తున్నాయి. ధరలలో వచ్చే హెచ్చు తగ్గుల నుంచి రక్షణ, పరపతితో సహా ఇన్‌పుట్స్‌ను చౌకగా అందించటం, బహుళ జాతి అగ్రి బిజినెస్ కుతంత్రాల నుంచి కాపాడటం, నీటి పారుదలపైన, పరిశోధన-అభివృద్ధిపైన భారీగా పెట్టుబడులు పెట్టటం, ప్రభుత్వ సేవల నెట్‌వర్క్ సృష్టిలాంటివన్నీ ప్రభుత్వ మద్దతులో భాగంగా ఉన్నాయి. నయా ఉదారవాద విధానంలో ఇవన్నీ ఒకటొకటిగా ఉపసంహరింపబడటంతో వ్యవసాయిక దుస్థితి, దారిద్య్రీకరణ తీవ్రతరమౌతున్నాయి.
పెరుగుతున్న దారిద్య్రీకరణ
దారిద్య్రం ఇలా పెరిగే ధోరణి 2011 జనాభా గణనలోనే బయటపడింది. 2001-2011 మధ్యకాలంలో రైతుల సంఖ్య 86 లక్షలు తగ్గిందని, పురుష వ్యవసాయ కార్మికులు 44 శాతం, మహిళా వ్యవసాయ కార్మికులు 24.5 శాతం పెరిగి ఒక దశాబ్దంలో 3.7 కోట్ల వ్యవసాయ కార్మికులు అదనంగా తోడయ్యారని ఆ జనాభా గణన ద్వారా తెలుస్తున్నది. 2011లో వ్యవసాయ రంగంలో పనిచేసే వారిలో సగానికిపైగా వ్యవసాయ కార్మికులని, వారి మొత్తం సంఖ్య 26.3 కోట్లని ఆ గణన ఇప్పటికే తెలియజేసింది. పెరిగిన వ్యవసాయ కార్మికుల శాతం వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదల శాతం కంటే చాలా ఎక్కువగా ఉందది దీన్నిబట్టి తెలుస్తున్నది. కాబట్టి శ్రమను ఆదా చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేనప్పటికీ వ్యవసాయంలో శ్రమకు డిమాండ్ సరిపడినంతగా లేదు. వేరే మాటల్లో చెప్పాలంటే దారిద్య్రీకరణ తీవ్ర స్థాయిలో పెరిగింది. ఈ దారిద్య్రీకరణ తీవ్రత నుంచి గ్రామీణ ఉద్యోగ భద్రతా చట్టం ఎంతో కొంత ఉపశమనం కలుగజేసింది. ఇలా దారిద్య్రీకరణ పెరగటం వ్యవస్థ లక్షణం. సంక్షేమ రాజ్య భావన కొనసాగిన కాలంలో ఇది కొంతవరకు నియంత్రించబడింది. జనాభా కారణంగానే గ్రామీణ శ్రామిక కుటుంబాల నిష్పత్తి పెరిగిం దనే వాదనను కాసేపు వాదన కోసం ఒప్పుకుంటే ఈ జనాభా కారకాన్ని నిర్ణయాత్మక పాత్రను పోషించగలిగేలా అనుమతించటం అనే వాస్తవం ఆర్థిక కారణాలరీత్యానే జరిగి ఉంటుంది.
జనాభాలోవచ్చే సహజ వృద్ధి కారణంగాను, నయా ఉదారవాద విధానంలో వ్యవసాయం, ఇతర చిన్న ఉత్పత్తులు లాభసాటిగాలేని కారణంగాను, వృద్ధి రేట్లు గణనీయంగా ఉన్నప్పటికీ పెట్టుబడిదారీ ఉత్పత్తి సృష్టించే ఉద్యోగాల సంఖ్య పని కోసం ఎదురుచూచే వారి సంఖ్య కంటే చాలా తక్కువగా ఉండటం అనే వాస్తవంలో ఈ ప్రక్రియ సారం దాగివున్నది. ఆ విధంగా గ్రామీణ శ్రామిక కుటుంబాల శాతం పెరుగుదలను వివరించే 'ప్రోలిటేరియనైజేషన్'ను సమర్థించటానికి అవకాశమున్న ఆరోగ్యకరమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు ఇది ప్రతిబింబం కాదు. రైతుల ముఖ్యంగా సన్నకారు రైతుల దారిద్య్రీకరణను ఉత్పాదనచేసే నిర్మాణపరమైన దుర్బలతకు ఇది నిదర్శనం. వృద్ధి జరుగుతున్న తీరు కార్పొరేట్ ఫైనాన్షియల్ వర్గానికి దోచిపెట్టే విధంగా ఉండటాన్ని తీవ్రంగా అభిశంసించే ఎస్‌ఇసిసి సర్వే నిర్ధారణల గురించి తెలిసిన నయా ఉదారవాద ప్రతినిధులు ఈ ఫలితాలు వృద్ధి వల్ల కాక వృద్ధిలేకపోవటంతో వచ్చాయని పేర్కొంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ గతంలో ఎప్పుడూ లేనంతగా సాలీనా 7 శాతం కంటే ఎక్కువగా వృద్ధిచెందుతున్న స్థితిలో కూడా సాపేక్షంగా పెరుగుతున్న దారిద్య్రీకరణ, ప్రాధాన్యత లేకుండా చేయడం, లేమిడి ఈ గొప్పల డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి.
- ప్రభాత్ పట్నాయక్