చంద్రబాబుకు 'తుని' ఒక హెచ్చరిక

సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఎదురు దాడికి మించిన ఆత్మరక్షణ లేదన్న సూత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో బాగా ఉపయోగిం చుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఏ సమస్యనైనా తీసుకోండి, అది రాజధాని సమస్యా, పోలవరం సమస్యా లేక రాయలసీమ అభివృద్ధి సమస్యా... ఏదైనా మంచి అంతా తన ఖాతాలో వేసుకోవడం చెడు జరిగితే అధికారుల మీద తోసేయడం, విమర్శలొస్తే ఎదురుదాడికి దిగడం ముఖ్యమంత్రి అనుసరి స్తున్న వ్యూహం. తాజాగా కాపుసామాజిక వర్గం ఆందోళన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అదే వ్యూహం అనుసరిస్తున్నారు.
రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలోని కాపులను కూడ దీయడానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన రాజకీయ పండితులను కూడా ఆశ్చర్యపరిచిందని మీడియాలో వస్తున్న వ్యాఖ్యానాలే తెలుపుతున్నాయి. తుని సభ సందర్భంగా ఉద్రిక్తత నెలకొన డం, రైలు బోగీలకు నిప్పు పెట్టడం, పోలీసు వాహనాలు, స్టేషన్‌ ధ్వరసం కావడం ఒక అంశం. ఈ పని ఎవరు చేశారన్న దానిపై రాజకీయ పార్టీలు చేసుకుంటున్న విమర్శలూ, ప్రతివిమర్శలూ మీడియాను హోరెత్తిస్తున్నాయి. విచిత్రమే మంటే అటు ప్రభుత్వ పక్షమూ, ప్రతిపక్షమూ రెండూ.. ఈ పని చేసింది ఆందోళన కారులు కారనీ, ఎవరో కావాలని కుట్రపురితంగా విధ్వంసానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఆ పని చేసిందెవరో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసు యంత్రాం గంపై పడింది. 
కానీ రాజకీయంగా చూసినప్పుడు తుని సభ చంద్ర బాబుకు ఒక హెచ్చరిక. రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉంటూ వచ్చిన ముద్రగడ ఇచ్చిన పిలుపు నందుకుని ఆయన సభకు వచ్చిన వారంతా తెలుగుదేశం పార్టీకి శత్రువులూ కారు లేక వైసిపి ఇతర ప్రతిపక్షాలకు మిత్రులూ కారు. నిజానికి వారిలో చాలా మంది ముఖ్యంగా యువత గత ఎన్నికల్లో తెలుగుదేశం-బిజెపీ కూటమికి ఓట్లు వేసి ఉంటారు. అందువల్లనే గోదావరి జిల్లాల్లో అత్యధిక స్ధానాలను తెలుగు దేశం పార్టీ గెలుచుకుంది. కానీ ఇంతలోనే వారంతా తెలుగు దేశం ప్రభుత్వంపై పిడికిలి బిగించడానికి కారణమేమిటి అన్న విషయం లోతుల్లోకి పోకుండా చంద్రబాబు ప్రతిపక్షాలు వారిని రెచ్చగొడుతున్నాయని ఎదురుదాడి చేయడం చివరికి ఆయనకే నష్టం చేస్తుంది. ఆదివారం నాడు ఒకవైపు తునిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగానే మరోవైపు చంద్రబాబు విజయవాడలో పత్రికా గోష్టి పెట్టి ప్రతిపక్షాలపై ఎదురుదాడి ప్రారంభించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేక కాపులను ప్రతి పక్షాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రం కల్లోలంగా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే బిసిలు ఊరుకోవడం లేదనీ, ఇద్దరికీ ఆమోదయోగ్యంగా సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం కనుక ఓపిక పట్టమని కోరుతున్నారు. అలాగే ఏడాదికి వెయ్యికోట్లు కాపు కార్పొరేషన్‌కు ఇస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు ఇప్పుడు నిధులు లేవు కనుక వంద కోట్లతో సరిపెట్టుకోమని కోరుతున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మే వాదనలేనా? 
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబుకు విడి పోయిన రాష్ట్రం పరిస్థితేమిటో తెలుసు. రిజర్వేషన్ల సమస్యలో ఉన్న చిక్కుముడులేమిటో తెలుసు. లోటు రాష్ట్రంలో తను చేసిన వాగ్దానాల అమలు సాధ్యాసాధ్యాలు తెలుసు. అయినా అన్నీ తెలిసి చేశారంటే ప్రజలను మోసగించడానికే. మోసపోయాం అని భావించిన ప్రజలు ఎదురు తిరిగితే దానికి బాధ్యత ఎవరిది? మోసగించిన వారిదే. అందువల్ల తుని ఘటనలకు అవకాశం ఇచ్చింది చంద్రబాబూ, ఆయన విధానాలే. ఆయన ఇదే విధంగా ప్రజల్లో చాలా సెక్షన్లను మోసగించారు. రైతులకు రూ. 80,000 కోట్ల రుణమాఫీ చేస్తానని ఇప్పటివరకు పదో శాతం కూడా మాఫీ చేయలేదు. నిరుద్యోగులకు నెలకు రెండు వేల భృతి మాటే ఎత్తడం లేదు. డ్వాక్రా రుణ మాఫీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీలు.. ఏ వాగ్దానమూ అమలు కాలేదు. రేపు వీటి పర్యవసానాలకు చంద్రబాబు, తెలుగు దేశం ప్రభుత్వం బాధ్యత వహించొద్దా?!
రాష్ట్రంలో డిగ్రీ ఆ పైన చదువుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారని చంద్రబాబు అధికారంలోకి రాకముందు గణాంకాలు. ఆయన అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క పెద్ద పరిశ్రమ పెట్టలేదు సరికదా వేల సంఖ్యలో పరిశ్రమలు మూతపడ్డాయి. దేశ విదేశీ పర్యటనలు, విదేశీ ప్రతినిధులు, కన్సల్టెంట్లతో చర్చలు మినహా ఉపాధి కల్పనకు ఆయన చేసింది శూన్యం. ప్రభుత్వంలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు కొండలా పెరిగిపోతున్నాయి. కొత్త నియామకాలు లేవు. ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేయడం, ఉద్యోగాలను కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌లకు ఇవ్వడం వల్ల నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. 
అందువల్ల ఉపాధి కల్పించే అభివృద్ధి కోసం ప్రజల్లో ఆకాంక్ష పెరుగుతోంది. తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఇన్నాళ్లయినా ఈ సమస్య పరిష్కారం కాకపోయే సరికి వారిలో అసహనం పెరుగుతోంది. ఈ రోజు తమ ప్రాంత అభివృద్ధికి ప్రాజెక్టులు, నిధుల కోసం రాయలసీమ ప్రజలు ఆందోళన చేస్తుంటే అది కూడా ప్రతిపక్షాల కుట్ర అని చంద్ర బాబు ఎదురుదాడి చేస్తున్నారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రత్యేక ప్యాకేజీల కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు డిమాండ్‌ చేయడం నేరమా? రాజధాని ప్రాంతంలో రైతులకు పూలింగుకు ముందు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. దీనిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వాధికారులను నిలదీస్తుంటే అది కూడా చంద్రబాబుకు ప్రతిపక్షాల రెచ్చగొట్టుడుగానే కనిపిస్తోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో రైతులనుండి భూములను బలవంతంగా లాక్కుని కార్పొరేట్లకు కట్టబెట్టేం దుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించడం కూడా ఆయనకు ప్రతిపక్షాల కుట్రగానే కనిపిస్తోంది.
కోస్తాలో ఒక బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులు ఆందోళనకు దిగితే చంద్రబాబు బెంబేలెత్తిపోయి ఆ సామాజిక వర్గ నేతలతో బేరసారాలు సాగిస్తున్నారు. అదే వేలాది మంది అంగన్‌ వాడీలు ఆందోళన చేస్తే పోలీసులతో కొట్టించారు. కేసులు బనాయించారు. ఆశాల ఆందోళనపై ఉక్కు పాదం మోపారు. బలవంతపు భూ సేకరణకు వ్యతి రేకంగా ఉద్యమిస్తున్న రైతులపై బలప్రయోగం చేస్తున్నారు. కానీ వీరంతా ఏకమై లక్షల సంఖ్యలో ప్రతిఘటనకు దిగితే ఏం చేస్తారు?
రాష్ట్రంలో ఒకరకమైన పోలీసు రాజ్యాన్ని నిర్మించడం ద్వారా పరిపాలన సాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అంగన్‌ వాడీ, ఆశా మహిళలపై ఆయన ప్రభుత్వం సాగించిన దౌష్ట్యాలు చూశాం. అధికార పక్షం తప్పుడు ప్రచారాలు చేయడానికి పోలీసులు, అధికారులు అన్ని విధాలా తోడ్పడతారు. కాని ప్రజల పక్షాన ఎక్కడైనా నిరసన గళం వినిపించాలంటే దానికి అనుమతులు ఉండవు. ప్రజలు ఆందోళనలకు దిగకుండా ముందస్తు అరెస్టులు చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే చాలు ఆ ప్రాంతంలో వామపక్షాల ముఖ్యంగా సిపిఎం నాయకులను ముందుగానే నిర్భందించేస్తారు. 
అధికారులపై బహిరంగంగా దాడులకు తెగబడిన అధికార పక్ష నేతలపై కేసులుండవు, పైగా ముఖ్యమంత్రే స్వయంగా వారిని వెనకేసుకు వచ్చి అధికారు లను మందలిస్తారు. కానీ ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై ఎడతెరిపిలేని కేసులు బనాయిస్తారు. ఒకవైపు ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తూ మరోవైపు వాటినుండి వచ్చే అసంతృప్తిని అణచివేసే యంత్రాంగానికి చంద్రబాబు పదును పెడుతున్నారు. కార్పొరేట్‌ బాబులు చెబుతున్నట్లు ఈ బాబు నడుచుకుంటున్నారు. అయితే ఆయన విధానాలు ఇలాగే కొనసాగితే, ప్రజలను మోసగిం చడం మానుకోకపోతే అనతి కాలంలోనే ఆయన ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడడం ఖాయం. 
- ఎస్‌. వెంకట్రావు