జులై5న నిర్వహించిన రిఫరెండమ్‌లో గ్రీకు ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ప్రపంచ అభ్యుదయగాముక ప్రజల్లోనూ, శ్రామిక వర్గంలోనూ ఈ తీర్పు ఎంతటి ఉద్వేగం కలిగించిందో ఏథెన్స్‌తో సహా లండన్, మాడ్రిడ్ వంటి నగరాల్లో వ్యక్తమైన హర్షాతిరేకాలే తెలియజేస్తున్నాయి. తమ జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీసే ఇయు రుణదాతల షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని గ్రీకు ప్రజలు ఈ రిఫరెండం ద్వారా మరోసారి తిరుగులేని తీర్పునిచ్చారు. గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో పొదుపు చర్యలకు వ్యతిరేకంగా పలు హామీలు ఇచ్చిన సిప్రాస్ నేతృత్వంలోని సిరిజా పార్టీకి వారు విజయం చేకూర్చి పెట్టారు. బెయిలవుట్ ఒప్పందం పేరుతో ఇయు విధించిన హానికర షరతులకు 61.3 శాతం ఓటర్లు 'నో' చెప్పడం గ్రీస్ చరిత్రలోనే అపూర్వం. దీంతో ఇయు రుణదాతల నోళ్లు మూతబడ్డాయి. గ్రీస్‌లో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనుకున్న జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఇయు అగ్రరాజ్యాలకు ఇదొక గట్టి షాక్. బెయిలవుట్‌కు వ్యతిరేకంగా గ్రీకులు ఓటు చేస్తే గ్రీస్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందని, ప్రజల జీవితాలు అత్యంత దుర్భరమవుతాయని రిఫరెండమ్‌కు ముందు ఇయు దేశాలు పెద్దయెత్తున గోబెల్స్ ప్రచారం సాగించాయి. ఇలాంటి తప్పుడు ప్రచారంతోనే గత అయిదేళ్లుగా గ్రీస్ ప్రజల నవనాడుల్ని ఇయు ఫైనాన్షియల్ త్రయం పీల్చిపిప్పి చేసింది. బెయిలవుట్ కింద అవి ఇచ్చిన రుణ సాయం తక్కువే. కానీ, ఆ పేరుతో అధిక పన్నులు, పెద్దయెత్తున నిరుద్యోగం, ప్రజా సేవల కుదింపు, సంక్షేమ పథకాలపై కోత, పింఛన్ల కుదింపు వంటి చర్యల ద్వారా కేవలం 10 శాతంగా ఉన్న సంపన్నులకు భారీగా లబ్ధి చేకూర్చాయి. మిగతా 90 శాత మంది జీవితాలను దుర్భరంగావించాయి. ఇవే విధానాలు అమలు చేసిన ఐర్లండ్, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. అయినా ఇయు ఫైనాన్షియల్ సంస్థలు అవే విధానాలను గ్రీస్‌పై పదే పదే రుద్దుతూ ఆ దేశాన్ని అథోగతి పాల్జేశాయి. అందుకే గ్రీకు ప్రజలు సంస్కరణలంటేనే మండిపడుతున్నారు. కోటి మంది ఓటర్లకు గాను 61 లక్షల మంది ఈ రిఫరెండమ్‌లో పాల్గొని ఇయు దుష్ట త్రయానికి దిమ్మతిరిగే హెచ్చరిక చేశారు. 'ఆత్మగౌరవంతో హుందాగా జీవించాలి', 'గ్రీస్ ఆర్థికవ్యవస్థ ఎలా ఉండాలో గ్రీకులే నిర్ణయించుకుంటారు' అన్న సందేశాన్ని విస్పష్టంగా వినిపించారు. ఈ విషయంలో సిప్రాస్ ప్రభుత్వం ఇంకెంతమాత్రం తటపటాయించకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. చింత చచ్చినా పులుపు చావనట్లు పందొమ్మిది దేశాలతో కూడిన యూరోజోన్ అగ్రనేతలంతా మంగళవారం సమావేశమై పొదుపు సంస్కరణలను గ్రీస్ పాటించకుంటే అత్యయిక నిధులిచ్చేది లేదని, అయిదు రోజుల్లోగా దీనిపై సిప్రాస్ ఒక ఒప్పందానికి రావాలంటూ అల్టిమేటమ్ జారీ చేశారు. సిప్రాస్ ప్రభుత్వం ఇటువంటి బెదిరింపులకు తలొగ్గకుండా పొదుపు సంస్కరణలకు చెల్లుచీటీ ఇవ్వాలి.