నయవంచన..

పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్ల పేరిట పేదల భూములను బెదిరింపు ఎత్తుగడలతో బలవంతంగా గుంజుకొంటున్న చంద్ర బాబు సర్కార్‌..ఇప్పుడు గిరిజన బతుకులను బూడిదపాల్జేసేందుకు నయవం చనకు పాల్పడింది. పర్యావరణవేత్తల ఆందోళనలను, గిరిజనుల ఆవేదనలను ఏమాత్రం పట్టించుకోకుండా, గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులివ్వడం దుర్మార్గం. విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని చింతపల్లి, జెర్రెలలో 1212 హెక్టార్ల అటవీభూమిని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థకు బదలాయించింది. ఆన్‌రాక్‌ అల్యుమినా వంటి కార్పొరేట్‌ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 242లో ఆదివాసీలకు దఖలుపర్చిన హక్కులను కాలరాస్తూ జివో 97 జారీ చేసింది. ప్రతి ఏటా 3.85 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ తవ్వకాలకు పచ్చజెండా ఊపింది.
2014లో ఎన్నికల వేళ విపక్ష నేత హోదాలో మన్యసీమలో పర్యటించిన చంద్రబాబు.. బాక్సైట్‌ తవ్వకాలను ఎట్టి పరిస్థతుల్లోనూ, ఏ రూపంలోనూ అంగీకరించమని గిరిజనులకు హామీ ఇచ్చారు. అవసరమైతే ఉద్యమాలు చేసి అండగా నిలుస్తామని కోతలు కోశారు. ఇప్పుడు హామీలపై నీళ్లు కుమ్మరించి గిరిజనులను నిలువునా వంచించారు. పచ్చి మోసానికి పాల్పడ్డారు. అటవీభూములకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ గతంలో ఏర్పాటు చేసిన జెసి కళ కమిటీ మూడు ముఖ్యమైన ప్రతిపాదనలు చేసింది. మొదటిది పెసా-1996 చట్టం కింద ఏర్పాటైన గ్రామసభల్లో మెజార్టీ అభిప్రాయాన్ని తీసుకోవాలి. రెండోది బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ గతంలో నాటి గిరిజన శాఖ మంత్రి పి బాలరాజు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సలహా కమిటీ చేసిన తీర్మానం. మూడోది అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీభూములపై సర్వ హక్కులూ స్థానిక గిరిజనులకే ఉంటాయి. ఈ మూడు ప్రధానమైన విషయాలనూ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్ర అభ్యంతరకరమైన విషయం.
విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాల కోసం గత కాంగ్రెస్‌ ప్రభుత్వంతో 2006లో జిందాల్‌ సౌత్‌వెస్ట్‌ కంపెనీ, 2007లో ఆన్‌రాక్‌ అల్యుమినా కంపెనీ ఒప్పందాలు చేసుకున్నాయి. షెడ్యూల్డ్‌ ఏరియాలో ఖనిజ తవ్వకాలు చేపట్టేందుకు గిరిజనేతర ప్రయివేటు పార్టీలపై నిషేదం ఉండటంతో కార్పొరేట్‌ కంపెనీల తరపున తవ్వకాల బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపిఎండిసి) తీసుకుంది. బాక్సైట్‌ తవ్వితీసి సరఫరా చేసేలా జిందాల్‌, ఆన్‌రాక్‌ కంపెనీలతో నాడు ఒప్పందాలు చేసుకుంది. వామపక్షాలు, గిరిజన సంఘాల ఆధ్వార్యాన మన్యసీమ ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమించడంతో సర్కార్‌ వెనక్కి తగ్గింది. బాక్సైట్‌ ఒప్పందాలను రద్దు చేసుకుంది. విజయనగరంలోని బొడ్డవరలో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన జిందాల్‌ కంపెనీ కూడా ఆ ప్రతిపాదనలను విరమించుకోవాల్సివచ్చింది. కార్పొరేట్‌ కంపెనీల బాక్సైట్‌ వేట అంతటితో ఆగిపోలేదు. 2009లో మళ్లీ ఆన్‌రాక్‌ అల్యుమినా కంపెనీ చింతపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు యత్నించింది. గిరిజనులు వీరోచితంగా ఆ ప్రయత్నాలను తిప్పికొట్టారు. 
వాస్తవానికి మన్యసీమ ప్రాంతంలో ఖనిజ తవ్వకాలు జరపాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కంటే ముందుగా.. చంద్రబాబు ఏలుబడిలోనే నిర్ణయం జరిగింది. పోరాటాల ఉధృతితో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నాటి తెలుగుదేశం ప్రభుత్వం లెంపలేసుకుంది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నేతృత్వంలోని అదే టిడిపి సర్కార్‌ బాక్సైట్‌ తవ్వకాలకు ఉత్తర్వులివ్వడం గమనార్హం. దశాబ్దకాలం పాటు పాలనకు దూరమైన చంద్రబాబు అధికారంలోకి వచ్చీరాగానే బాక్సైట్‌ రాగాలు తీయడం మొదలెట్టారు. గిరిజనులు గిరులు దిగితేనే అభివృద్ధి చెందుతారంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. గతేడాది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన బాక్సైట్‌ తవ్వకాలకు బాహటంగానే సానుకూల సంకేతాలిచ్చారు. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ముగ్గురు టిడిపి స్థానిక నేతలను మావోయిస్టులు గత నెలలో అపహరించినప్పుడు వారిని విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు సర్కార్‌ జ్యాప్యం ప్రదర్శించింది. బాక్సైట్‌ తవ్వకాలు తప్పనిసరిగా చేపడుతామని ఈ క్రమంలో సొంత కేడర్‌ను కూడా లెక్క చేయమని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. 
సుసంపన్నమైన వనసంపదను, భౌగోళిక వైవిధ్యాన్ని బూడిదపాల్జేసి మన్యసీమను కాలుష్యకోరల్లోకి నెట్టే బాక్సైట్‌ ఉత్తర్వులపై గిరిజనం భగ్గుమంటోంది. నిరసన ప్రదర్శనలతో ప్రతిఘటిస్తోంది. సిపిఎం తదితర విపక్షాలు, గిరిజన సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం వంటి ప్రజా సంఘాలు బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతంగా చేస్తున్నాయి. శనివారం నాడు ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ పోరాటాల్లో స్థానిక టిడిపి శ్రేణులు కూడా పాల్గొంటుండటం బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజాభీష్టానికి నిలువెత్తు నిదర్శనం. హామీలను విస్మరించి మోసానికి పాల్పడిన చంద్రబాబు సర్కార్‌ను ఈ ప్రజా ప్రతిఘటనతో వెనక్కు నెట్టాలి.