నల్లధనమా! నువ్వెక్కడీ

 నల్ల కుబేరులు, స్విస్‌ బ్యాంకు, హవాలా, విదేశీ బ్యాంకు ఖాతాలు వగైరా మాటలు రోజూ పేపర్లు, టీవీ ఛానెళ్లలో చూసీ చూసీ, వినీ వినీ నవ్వాలో, ఏడవాలో తెలియని స్థిలో ఉన్నాం మనం. నేను ఒక పల్లెటూరి రైతును నల్ల ధనం అంటే ఏమిటని అడిగితే దొంగ నోట్లు అని ఠక్కున సమాధానమిచ్చాడు. ఆయన్ని చూసి నవ్వుకునే పరిస్థితిలో మనమేమీ లేము. ఎందుకంటే మనమూ అంతే అమాయకత్వంతో, తెలివితక్కువతనంతో ఆలోచిస్తు న్నాం. నేను ఇంటర్‌ విద్యార్థిగా ఉన్న రోజుల్లో (1996) మధ్యతరగతి అభిమాన నాయకులు వాజ్‌పేయి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారి పేర్లు బయటపెడతామంటే నమ్మి తెరిచిన నోరు ఇప్పటికీ మూతబడలేదు. నాటి నుంచి నేటి దాకా నోరు తెరుచుకుని మనం చూస్తూనే ఉన్నాం. ఈ కాలంలో బిజెపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మార్చి, మార్చి మనల్ని పాలిస్తూనే ఉన్నా, ఏమార్చి మనల్ని వెధవల్ని చేస్తూనే ఉన్నా ఏదో జరుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తూనే ఉన్నాం. ఈ నల్ల ధనం మన ప్రజల మీద మన పాలకులు చేసిన, చేస్తున్న క్రూర పరిహాసమని మనం ఎప్పటికి అర్థం చేసుకుంటాం?
ఆంధ్రా బ్యాంకు, స్టేట్‌ బ్యాంకు లాగా ' స్విస్‌ బ్యాంకు' అనే పేరుతో ఒక బ్యాంకుందనీ, అందులో మన భారతీయుల సొమ్ము ఇబ్బడిముబ్బడిగా ఉందనీ, ఇవ్వాళ కాక పోతే రేపైనా అదంతా మన ప్రజలకే అంకితమౌతుందని, ఆ సొమ్మేó భారతదేశానికి వస్తే మనం ప్రపంచంలో నెంబర్‌ ఒన్‌ (మనకి ఆ నంబర్‌ బాగా ఇష్టం) అవుతామని ఈస్టమన్‌ కలర్‌ రోజుల నుంచి ఫ్లోకామ్‌ డిజిటల్‌ దాకా మనకు సినిమా చూపిస్తూనే ఉన్నారు మన పాలకులు. చూడ్డానికి, వినడానికి ఈ సినిమా బాగానే ఉన్నట్టున్నా దాని మూలాలు జన సామాన్యం మూలు గలు పిండి వసూలు చేసినవని తెలుసుకుంటే గానీ ఈ విషయానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం కాదు. ముందుగా నల్లధనమంటే ఏంటో చూద్దాం. అది రెండు రకాలు. చట్ట వ్యతిరేకంగా సంపాదించిన సొమ్ము, చట్ట బద్ధంగానే సంపాదిం చినా లెక్కలు చూపించని సొమ్ము. చట్ట వ్యతిరేకంగా అంటే లంచగొండితనం, మాఫియా, దొంగనోట్ల చలామణి, రౌడీయి జం, డ్రగ్స్‌, మద్యం, దొంగ మైనింగ్‌, దొంగ ఇసుక క్వారీలు, భూ కబ్జాలు, అటవీ సంపద చోరీ, స్మగ్లింగ్‌, అక్రమ ఫిషింగ్‌, సెటిల్‌మెంట్లు వగైరా...వగైరా... అన్నమాట. మన సోకాల్డ్‌ నల్ల ధనాధిపతుల్లో చిన్న చేపల నుంచి తిమింగలాల వరకు ఉంటారు. ఎందుకంటే వారి ఆదాయానికి లెక్కలు లేవు, చూప లేరు. కారణం, అది చట్ట వ్యతిరేకంగా సంపాదించిన సొమ్ము కాబట్టి. ఇక రెండో రకం, తెల్ల కాలర్లు పోగేసుకునే నల్ల ధనం. అంటే చట్టపరమైన వ్యాపార లావాదేవీలు సాగిస్తూనే పన్ను ఎగవేత కోసం లెక్కలు తారుమారు చేసి పోగేసుకునేది. ఇదేదో మన పరిధికి మించింది అనుకునేరు. అదేం కాదు, మన ఇంటి పక్క జనరల్‌ స్టోర్‌ నుంచి రైస్‌ మిల్లు, ఫ్యామిలీ డాక్టర్‌, మొబైల్‌ షాపు, వీధిలో కాన్వెంటు, బంగారపు కొట్టు, పెద్దపెద్ద రిటైల్‌ షాపులు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, మహా కార్పొరేట్‌లు, విద్యా వ్యాపార దిగ్గజాలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, అతి పెద్ద సామ్రాజ్యాధినేతలు వీరంతా చేసేది. నంబర్‌ ఒన్‌, అకౌంటు, నంబర్‌ టు అకౌంటు. ఇదేదో విన్నట్టుంది కదూ! ఆ నంబర్‌ టూ అకౌంటే నల్లధనం రాసుకునే, దాచుకునే సాధనం. స్విస్‌ బ్యాంకులో నల్ల కుబేరులు (బ్యాడ్‌ గైస్‌) దాచుకున్న డబ్బులు దేశానికి తీసుకురావలసిందేనని ఢంకా బజాయించి చెబు తుండే మన మధ్యతరగతి హిపోక్రసీకి నవ్వు రాక ఏమౌ తుంది? ఇదంతా చెప్పటంలో అర్థం మనందరం ఏదో నేరస్తుల మని రుజువు చెయ్యడానికి కాదు. ఇదిలా ఉంచితే మన దేశంలో పోగుపడ్డ నల్ల ధనం ఏమౌతుంది? మళ్లీ ఇక్కడ రెండు మార్గా లు. అయితే మనదేశంలో బంగారం రూపంలోనో, స్థలాలు, రియల్‌ ఎస్టేట్‌ పొలాల రూపంలోనో లేదా పరుపులు, పూల కుండీల కిందో దాచుకోవడం లేదా దీపావళి టపాకాయల్లోనో, పిల్లల పెళ్లిళ్లలోనో తగలేయడం. సారీ... ఖర్చుచేయడం లేదా వెంకన్న, దుర్గమ్మల్లాంటి హుండీల్లోకి దూకి తెల్ల బడుతుంది. మరి ఇంకా పెద్ద మొత్తాలైతే విదేశాలకు తరలుతుంది. మరి మన దేశంలో సంపాదించిన నల్ల ధనం రూపాయల్లో కదా! విదేశాలకు ఈ రూపాయలు కంటైనర్లలో పంపితే సరిపో తుందా? కుదరదు. ఎందుకంటే ఈ దేశం దాటాక మన రూపాయలు చిత్తు కాగితాలతో సమానం. అయితే ఎలా? అంటే హవాలా ఉందిగా అలాగన్నమాట.
హవాలా అంటే? ఇది అరబిక్‌ పదం. దానర్థం, నేను నీకు అప్పుంటే, నువ్వు ఇంకొకరికి అప్పుంటే, నీకు బదులు ఆ ఇంకొకరికి డబ్బు ఇవ్వడం. ఇందులో చట్ట వ్యతిరేకం ఏముంది? హవాలాలో చట్ట వ్యతిరేకం అనే అర్థం ఏమీ లేదు. ఉపయోగంలోనే అంతా ఉంది. అక్కడికి డబ్బులు ఎలా తరలు తున్నాయో మనం ఆలోచించామా? అవన్నీ హవాలా రూపం లో ముఖ్యంగా దుబాయి నుంచి తరలుతున్నాయి. అదొక్క టేనా మార్గం అంటే ఇది ఒకానొక రాజ మార్గం. ఇది కాక పోతే ఈ ప్రపంచీకరణ రోజుల్లో ఎఫ్‌డిఐ దారుల్లో మారిషస్‌, బ్రిటిష్‌ ఒర్జిన్‌ ఐలాండ్‌, ఐస్లే మాన్‌, లక్సంబర్గ్‌, మాస్కో, జెర్సీ, బహ్రైన్‌, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, సైప్రస్‌, ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ లీచ్‌టెన్‌స్టీన్‌ ఉన్నాయి. ఇవేవీ కాక పోతే లండన్‌ ఉండనే ఉంది. ఇన్ని మార్గాలు ఉండగా టెన్షన్‌ ఎందుకు దండుగ, అంటే ఇంతకీ మన ధనం స్విస్‌ బ్యాంకుల్లో లేదా?
స్విస్‌ బ్యాంకు అంటే ఏంటి? ఇదేమైనా ఒక్క బ్యాంకా? బందరు లడ్డూ లాగా, హైదరాబాద్‌ బిర్యానీ లాగా స్విట్జర్లాండ్‌ లోని బ్యాంకుల్ని స్విస్‌ బ్యాంకులు అంటారు. ఇది ఒక బ్యాంకు కాదు. ఎబిఎస్‌, క్రెడిట్‌ స్యుస్సేలాంటి దిగ్గజాలతో పాటు కొన్ని పదుల సంఖ్యలో అక్కడ బ్యాంకులు ఉంటాయి. అవన్నీ స్విస్‌ బ్యాంకులే. అయితే అక్కడ మన నల్ల కుబేరుల డబ్బు ఏమాత్రం ఉంది? స్విస్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ 2012 నాటి అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. మొత్తం స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న సొమ్ములో ఇది కేవలం 0.13 మాత్రమే. భారతీయుల రంగుల కల నల్ల ధనం తెలుపులోకి మారే నిజం ఇదే.
ఇంతే కాదు, ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ సొమ్ములో 37 శాతం విదేశాల్లోనే దాచుకుంటున్నారు. ఇది మన దేశానికే పరిమితమైన రోగం కానేకాదు. విశ్వరుగ్మత. ఇవే టాక్స్‌ హెవెన్స్‌ అంటే పన్నుస్వర్గాలు. వీటిలో డబ్బు పొదుపు, మదుపు చేసిన వారు చిన్న వారేమీకాదు. ప్రపంచం లోనే అత్యంత ప్రతిభాశాలురు. ప్రపంచ గమనాన్ని శాసిస్తున్న అపర కుబేరులు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తమ గుప్పెట్టో పెట్టుకున్న వారు. అత్యంత పన్ను ఎగవేతదారే అత్యంత ఎక్కువ పన్ను కట్టే వాడనే లాజిక్‌ మిస్సైతే ఎలా? ఒకరో, ఇద్దరో అయితే వారి పేర్లు బయట పెట్టి బద్నాం చెయ్యొచ్చు. అందరూ దొంగలే. అయితే ఇప్పుడెలా? ఎవరో బ్యాంకు ఉద్యోగి వ్యక్తిగత కక్షకొద్దీ తస్కరించిన సమాచారాన్ని ప్రాన్స్‌ చేతిలో పెడితే, ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ లీచ్‌టెన్‌స్టీన్‌ అనే బెజవాడంత చిన్న దేశం వద్ద సమాచారం జర్మనీకి దొరికితే ఆ ఎంగిలి సమాచారం మన దేశానికి మహా ప్రసాదంలా కనిపించింది. అదే గొప్ప విజయంగా సీల్డ్‌ కవర్‌లో అత్యున్నత నాయస్థానానికి సమర్పించి చంకలెగరెయ్యడం ఈ సంవత్సరపు అతిపెద్ద జోక్‌. చారువాలా తన ఎన్నికల ప్రచారంలో పలికిన డంబాచారాలు తుస్సుమని తేలిపోతుంటే ఇంత కాలం అదే ఆట ఆడిన విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు స్వరం పెంచి దమ్ముంటే నల్ల ధనాధిపతుల వివరాలు బయట పెట్టండి అని దబాయించడం దేనికి చిహ్నం. దొందూ దొందే అని అనుకోవాలా, అదే వీరి ధైర్యం అయ్యుంటుంది.
సరే! స్విస్‌ బ్యాంకుల్లోనే నల్లధనం పోగుపడిలేదని తెలిసినా అలవాటు ప్రకారం వాటిని స్విస్‌ బ్యాంకులనే ముద్దుగా పిలుచుకుందాం. ఒక వేళ నల్ల ధనాధిపతులు డబ్బు బ్యాంకుల్లో దాచారనే అనుకున్నా ఎలా దాచి ఉంటారు. ఒకటి మామూలు ఎకౌంటులో దాచి ఉంచాలి లేదా తమ స్వంత లాకర్లో పెట్టుకోవాలి. ఒకవేళ లాకర్లోనే వజ్రాలు, బంగారం లాంటి విలువైన వస్తువుల రూపంలో దాచుకుంటే అది అత్యంత గోప్యం కాబట్టి వాటి విలువ మానవ మాత్రులకు తెలిసే అవకాశం లేదు. ఇక అలాంటప్పుడు ఆ సమాచారాన్ని మనకిచ్చే అవకాశమే లేదు. రెండు, అలా కాకుండా తమ ఖాతాల్లో డబ్బు రూపంలో దాచారనుకుందాం. అయినా ఆ డబ్బును బ్యాంకు తన దగ్గర పెట్టు కోదు. అందులో సింహ భాగం అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్‌ ద్వారా, ప్రయివేటు ఈక్విటీ ద్వారా, రియల్‌ ఎస్టేట్ల ద్వారా, ట్రస్టుల ద్వారా మదుపు చేస్తుంది. మరి ఎవరి పేరుతో ఆ మదుపులు చెయ్యాలి. అందుకే మనకు మారిషస్‌, సింగపూర్‌ లాంటి ఎన్నో దేశాలు న్నాయి. వంద డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభించి ఆ కంపెనీ పేరుతో ఎక్కడైనా మదుపు చేయగల చట్టాలున్నాయి. అలా... అలా... ఆ నల్ల డబ్బు ప్రవహించి చివరకు ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఐఐల రూంపంలో రంగు మార్చుకుని మనదేశానికే చేరుతుంది. నిజానికి నల్ల ధనం ఎక్కడో లేదు. ఇక్కడే, మన చుట్టుపక్కలే విచ్చలవిడిగా వికృతంగా, కర్కశంగా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క విషయం ఆలోచించండి నల్ల ధనమే లేకపోతే మన ఎన్నికల ప్రజాస్వామ్యం ఏమైపోవాలి.
627 పేర్లు, కోర్టు వ్యవహారాలు పక్కన పెడితే చిత్తశుద్ధి ఉన్న మధ్యతరగతి కలల బేహారీ! నమో స్వామీ! దయచేసి ఈ కింది సూచనలు, నావి కావు సుమా! ప్రభుత్వం నియమించిన శతకోటి అనామక కమిటీల్లో ఒక కమిటీ సూచనలు అమలు చెయ్యగలరా? బంగారం, వజ్రాల కొనుగోళ్లు, అమ్మకాల పూర్తి వివరాలు బహిర్గతం చెయ్యాలి. దేశంలోని భూముల మొత్తాన్నీ సర్వే చేసి దాని చట్టబద్ధమైన హక్కుదారులెవరో (వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం) గుర్తించాలి. అమ్మకాలు, కొనుగోళ్లపై పూర్తి నిఘా ఉండాలి. నిర్ణీత గడువు ఇచ్చి ఐదు వందలు,వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయాలి. 
ట్రస్టులు, ఎన్‌జిఒలు, సొసైటీల పేర్లతో నడుస్తున్న వ్యాపార లావాదేవీలను పారదర్శ కత ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ప్రభుత్వ ఉన్నతాధి కారిపై ప్రభుత్వమే స్వయంగా రొటేషన్‌ పద్ధతిలో ఆదాయా లను పరిశీలించేం దుకు దాడులు చేయాలి. ఆడిటింగ్‌లో లెక్కలు తారుమారు చేసే ఆడిటర్లను కఠినంగా శిక్షించాలి. పటిష్టమైన లోక్‌పాల్‌, లోకాయుక్త వ్యవస్థలు రూపొందించాలి. ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఐఐ పేరుతో దేశంలోకి ప్రవహిస్తున్న ధనం మూలాలను గుర్తిం చాలి. బినామీ పేరుతో సహజ సంపదలు కొల్లగొడు తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. 120 కోట్ల ప్రజల వివరాలు ఆధార్‌ పేరుతో సేకరించగలిగిన, ఒక్క రోజులో రెండు కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించగల సత్తా ఉన్న, ఐదేళ్లలో దేశాన్ని స్వచ్ఛంగా చెయ్యాలని కంకణం కట్టు కున్న, దేశాన్ని ప్రపంచానికే ఫ్యాక్టరీగా తయారు చెయ్యాలను కుంటున్న మన ప్రభుత్వానికి, పేదవాడి ఆకలి తెలిసిన నమో నాయకుడి అడుగు జాడల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వానికి ఇవి అమలు చేయడం కష్టమేమీ కాదు. కానీ ఇవేవీ జరగవు. రోడ్ల పై చెత్త తీసినంత తేలిక కాదు నల్ల ధనాన్ని వెలికి తీయడం. అందులో అందరూ అసమ్మదీయులైనప్పుడు మరీ కష్టం. అందుకే ఈ నాటకానికి విరామం కార్డు వేసి మనం ఆకులు, అలములు ఊడ్చుకుంటూ స్వచ్ఛ భారత్‌ను నిర్మిద్దాం.
(రచయిత వాణిజ్య శాస్త్రవేత్త, ఛార్టర్డ్‌ ఎకౌంటెన్సీ ఉపాధ్యాయుడు)
రాంపల్లి శశికుమార్‌