'నిజం' పేరుతో అబద్ధాలా?

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఇక్కడ విడుదల జేసిన పుస్తకం 'నిజం తెలుసుకోండి' (నో ది ట్రూత్‌)లో కొత్తదనమేమీ లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి చెప్పారు. లెఫ్ట్‌పై బిజెపి గతంలో చేసిన ఆరోపణలను ఇందులో మరోసారి ప్రస్తావించారని ఏచూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో మేధావుల ఆలోచనలను లెఫ్ట్‌ తప్పుదోవ పట్టిస్తోందని అందులో విమర్శించారని, వామపక్ష మేధావుల ఆలోచనా ధోరణి పరిశీలనాత్మకంగానే వుం టుందని, ఇకపై కూడా అదే విధంగా కొనసాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. వారి మేధోసంపత్తి, హేతు వాదం, చరిత్ర అధ్యయనం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని ఆయన వివరించారు. ఈ ఉన్నత ప్రమాణా లను అందుకోలేక ఆపసోపాలు పడుతున్న ఆరెస్సెస్‌ మరోసారి తప్పుడు సమాచారంతో 'సైద్ధాంతిక దురుద్దే శాల'ను లెఫ్ట్‌కు ఆపాదిస్తోందని విమర్శించారు. భారత్‌లో మేధావి వర్గం అంతా సిపిఎంతోనే వుందం టూ వ్యాఖ్యానించిన వెంకయ్య నాయుడుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పురస్కారాలను వాపస్‌ చేసే నిరసన ప్రక్రియ కొత్తదేమీ కాదని, గతంలో ఇది అనేక సార్లు జరిగిందని చెప్పారు. గురుదేవ్‌ రవీంద్రనాధ్‌ టాగూర్‌ తనకు లభించిన నైట్‌హుడ్‌ బ్రిటి ష్‌ ప్రభుత్వ వేధింపులకు నిరసనగా తిరిగి ఇచ్చేసిన విషయాన్ని ఏచూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభిప్రాయాల సంఘర్షణ నుంచి ఆరెస్సెస్‌ బిజెపి వైఖరికి ప్రత్యామ్నాయంగా దీనిని చూడక్కర్లేదని అన్నారు. బిజెపి ఆరెస్సెస్‌ల ఆలోచనా విధానాన్ని విద్యా, మేధావి వర్గం ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వుంటుందని ఆయన అన్నారు ప్రస్తుతం దేశంలో చెలరేగుతున్న అసహనం అంతా ఆరెస్సెస్‌, దాని అనుబంధ సంఘాలు ప్రచారం చేస్తున్న అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్న వారికి ఎదురవుతున్న బెదిరింపుల రూపంలో సాగుతోందని ఏచూరి స్పష్టం చేశారు. హింసాత్మక అసహనం అన్నది ప్రస్తుతం దేశ ప్రజల ముందు ప్రధానాంశంగా నిలిచిందన్నారు. మేధావులు, చరిత్రకారులు, చలనచిత్ర ప్రముఖులు, శాస్త్రవేత్తలు, మాజీ సైనికాధికారుల వంటి వారి నిరసన ప్రస్తుత వాతావరణంపై అసమ్మతిని తెలియజేస్తోం దన్నారు. మహాత్ముడితో సహా అనేక మందిని బలితీసుకున్న సంఫ్‌ు హింసాత్మక ధోరణికి వ్యతిరేకంగా ఆరెస్సెస్‌పై నిషేధం విధించిన సర్దార్‌ పటేల్‌ను అసందర్భంగా ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న హింసాత్మక దాడులు ప్రస్తుత అసహనానికి పరాకాష్టగా నిలుస్తున్నాయన్నారు. ఈ అంశాలను ఇప్పటివరకూ ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదనటం పచ్చి అబద్ధమని, మోడీ ప్రధానిగా అధికారపగ్గాలు చేపట్టిన తరువాత పార్లమెంట్‌ తొలి సమావేశంలోనే హింసకు పాల్పడుతున్న వారు, బాధ్యతారహిత వ్యాఖ్యల ద్వారా హింసను ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేదా కనీసం చర్య తీసుకుంటామన్న హామీ అయినా ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రధాని ఇప్పటివరకూ వారిపై ఎటువంటి చర్యా తీసుకోకపోగా కనీసం హామీ కూడా ఇవ్వలేకపోయారన్నారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక దాడుల్లో కాంగ్రెస్‌ పాత్ర, మతోన్మాదంతో రాజీ పడటం వంటివాటిపై సిపిఎం, ఇతర వామపక్షాలు ఎప్పటి నుండో విమర్శలు చేస్తూనే వున్నాయని వీటిపై తమ రికార్డులు పరిశీలనకు అందు బాటులోనే వుంటాయని ఏచూరి తెలిపారు. ఈ అంశా లపై గతంలో ఎందుకు నిరసన తెలపలేదు, ఇప్పుడే ఎందుకు నిరసనలు వస్తున్నాయన్న ప్రశ్నకు ఆరెస్సెస్సే జవాబు చెప్పాల్సి వుంటుందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందుకు పాల్గొనలేదన్న విషయాన్ని ఆరెస్సెస్‌కు చెందిన సీనియర్‌ నేత నానాజీ దేశ్‌ముఖ్‌ తన పుస్తకంలో ఆ సంస్థను ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2002లో గుజరాత్‌లో జరిగిన మత మారణకాండపై ఆరెస్సెస్‌ కానీ బిజెపి కానీ ఇప్పటివరకూ సమాధానం చెప్పకపోవటానికి కారణ మేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో పెరిగిపోతున్న హింసాత్మక దాడులు, మతోన్మాద కల్లోలాలు, అనేకమంది అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్న అసహనంపై ప్రధాని కొనసాగిస్తున్న మౌనం వాస్తవ పరిస్థితులను నిర్ధారిస్తున్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వ అజెండా అంతా లౌకిక ప్రజాతంత్ర భారత రిపబ్లిక్‌ను పూర్తి అసహనంతో నిండిన ఫాసిస్టు హిందూరాజ్యంగా మార్చాలన్న ఆరెస్సెస్‌ అజెండాను ముందుకు తీసుకెళ్లటమేనని, దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం ఈ ప్రభుత్వ అజెండాలో నామమాత్రంగా కూడా కన్పించవని ఏచూరి విమర్శించారు.