నిబద్ధతే సాహూ మహరాజ్‌ సామాజిక తత్వం

మహారాష్ట్ర సంస్థానాలన్నింటా బలవంతంగా ఆమోదింపక తప్పని ఉచ్ఛస్థితిలో అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఉన్న రోజులవి. ఛత్రపతి శివాజీ వంశీయులు, ఘాట్గే వంశీయులైన జయంతిసింగ్‌ అబాసాహెబ్‌, రాధా బాయిలు సాహూ మహరాజ్‌ తల్లిదండ్రులు. వీరు క్షత్రియులా? కాదా? అన్న శీలపరీక్షకు గురిచేసింది ఆనాటి బ్రాహ్మణ వర్గం. సాహూ మహరాజ్‌ 1874 జూన్‌ 26న జన్మించారు. 1894లో తన ఇరవయ్యవ ఏట పాలనా బాధ్యతలు చేపట్టి ఎన్నో సామాజిక ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. బ్రాహ్మణ మనువాద తాత్వికతను క్షుణ్ణంగా పరిశీలించారు. అవరోధంగా ఉన్న వాటిని వదిలి ప్రజల సానుకూల అంశాలను పాలనా వ్యవస్థలో ఇమిడ్చారు. రాజ వంశాల వ్యక్తులు తమ హోదాకు చిహ్నంగా భావించే విలాసాలను, మద్యపానాన్ని ఆయన దరిజేరనివ్వలేదు. పాలనా వ్యవహారాల మర్మం తెలుసుకునేందుకు ఆంగ్లం, పురాణ ఇతిహాసాల్లోని తత్వ అవగాహనకై సంస్కృతం నేర్చుకున్నారు. సామాజిక స్థితిగతుల నేర్పరిగా, ప్రపంచ దృక్పథం, సాహిత్య అధ్యయనశీలిగా ఎదిగారు. వినయం, నిరాడంబరత, స్నేహశీలత, తార్కిక తత్వంతో ప్రతి విషయాన్నీ సూక్ష్మంగా వల్లెవేయగల దిట్టగా ఒదిగి ప్రజా హృదయాలను గెలిచారు. ఒక బ్రాహ్మణేతర వ్యక్తిలో ఇన్ని సుగుణాలా? ప్రజాభివృద్ధిలో బ్రాహ్మణవాద జోక్యాన్ని ప్రశ్నిస్తూ పలు రూపాల్లో సంధించిన ప్రశ్నల తాకిడి అగ్రకుల బ్రాహ్మణ సమాజాన్ని కలవరపరిచింది.
అస్పృశ్యుల జీవితాల్లో వెలుగులు
ఆత్మనూన్యతను వదిలి జనజీవన స్రవంతిలో మమేకమయ్యే విధంగా అస్పృశ్య కులాల పిల్లలకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు, హాస్టళ్ళు, నివాసానికి ప్రత్యేక కాలనీలు నిర్మించి చదువుల్లో రాణించే విధంగా ప్రోత్సహించారు. పాలనా వ్యవహారాల నిర్వహణకు అవసరమైన విద్యార్హతలకు శిక్షణ ఇప్పించారు. అస్పృశ్యుల్లో ఆత్మవిశ్వాసం పాదుగొలిపారు. కొల్లాపూర్‌ సంస్థానం మొత్తం అంటరానితనాన్ని పాటించటం శిక్షార్హమైన నేరంగా ప్రభుత్వపరంగా ప్రకటించారు. అర్హతను బట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగం, ఆడపిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు, వెనుకబడిన కులాలకు యాభై శాతం రిజర్వేషన్లు, వ్యవసాయ వృత్తులు చేసుకునే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు, ప్రావిడెంట్‌ ఫండ్‌ సౌకర్యం కల్పించిన మొట్టమొదటి వాడు సాహూ. అస్పృశ్యులైన మహర్‌లు, మాంగోలను ఆస్థాన దివాను, రాజకీయ నిర్వహణాధికారి, రాజకుటుంబానికి చెందిన విధుల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, వ్యక్తిగత అవసరాలకు నియమించడం చట్ట విరుద్ధమని సాహూ చట్టం చేశారు. మహర్‌, మాంగో, రమోషీ, బెరాద్‌ మొదలైన కులాల వారిని నేరస్తులుగా పరిగణిస్తూ ఆ తెగల ప్రజలు ప్రతిరోజూ స్థానిక పోలీస్‌ స్టేషన్లలో హాజరు పలికి సంతకాలు చేసిరావడాన్ని నిషేధించారు. ఈ విధంగా అస్పృశ్యుల జీవితాల్లో వెలుగు ప్రసాదించారు.
వ్యవసాయంలో అస్పృశ్యులకు ప్రోత్సాహం
సంస్థానంలో నూటికి 80 శాతం నిరుపేదలు, నిరక్షరాస్యులు, వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు వ్యవసాయ వృత్తులపై ఆధారపడి జీవించేవారు. తీవ్రమైన కరువువాత పడిన ప్రజలకు వ్యవసాయ అభివృద్ధికి తీసుకున్న రుణాలు, ప్రభుత్వ పన్నులు మాఫీ చేయించారు. పేద రైతులకు వ్యవసాయ పనులకు తక్కువ వడ్డీతో వ్యవసాయ రుణాలు అందించడానికి సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. సహకార సంఘాల ద్వారా చేతివృత్తుల్లో తయారైన వస్తువులకు గిట్టుబాటు ధరకు కొనే ఏర్పాట్లు చేశారు. చిన్నతరహా పరిశ్రమలను నిర్వహించడమనే విధానాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేశారు. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నగరాలకు ప్రజల వలసలను నివారించారు. గతంలో బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి అగ్రవర్ణాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్న రాష్ట్ర ఆర్థికవ్యవస్థలో వెనుబడిన కులాలకు కూడా భాగస్వామ్యం ఏర్పడింది. అస్పృశ్యులు, వెనుబడిన కులాల ప్రజలు ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న శిశువుగా స్వతంత్రంగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, వాళ్ళంతా తమ కాళ్ళ మీద తాము స్థిరంగా నిలబడలేని పిల్లల వంటి వారేనని, వారికి ఆసరాగా నిలబడాలన్నదే సాహూ దృఢ సంకల్పం.
జాతీయోద్యమంలో సాహూ సామాజిక తత్వం
దేశ స్వాతంత్రాన్ని రాజకీయ, ఆర్థిక సమస్యగా భావించి విప్లవవాదులు బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటంలో సాహసోపేతమైన ఉద్యమాలు నడిపారు. గాంధీజీ, తిలక్‌ల విధానాలను సాహూ తీవ్రంగా తిరస్కరించారు. కొల్లాపూర్‌ పాలకుల రాజ్య వ్యవహారాలన్నీ దక్కన్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ తరపున బ్రాహ్మణ మేధావులే నిర్వహించేవారు. సాహూను జాతీయయోద్యమంలోని బ్రాహ్మణీయ సంస్కృతి ఆకర్షించి ఉండాల్సింది. కానీ, అందుకు భిన్నంగా మహాత్మా ఫూలే నిర్వహించిన సత్యశోధక్‌ ఉద్యమ వారసత్వాన్ని ఎన్నుకున్నారు. భారత దేశంలో సామాజిక అసమానతలు లేని సమాజం ఏర్పడితే నిజమైన స్వరాజ్యం వచ్చినట్లన్నారు. అటువంటి సమాజం ఏర్పడాలంటే సామాన్య ప్రజలకు ఈ దేశపు పాలనాధికారాల్లో సమానమైన భాగస్వామ్యం ఉండాలని కార్యాచరణకు దిగారు. జాతీయోద్యమ నాయకత్వంలోని అగ్రకుల బ్రాహ్మణవాద అధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
అస్తిత్వం నడుమ సాహూ వ్యక్తిత్వం
వెనుకబడిన తరగతులు, అస్పృశ్యులకు రాజ్యాంగంలో సమాన భాగస్వామ్యం ఉండాలన్న ఉన్నతమైన లక్ష్యం సాహూది. ఒక సంస్థానాధిపతి అయిన సాహూ మహరాజ్‌ ఇంత నిబద్ధతతో సామాజిక ఉద్యమాలు నిర్వహించడం అరుదైన విషయమే అని విదేశీ చరిత్రకారులు కొనియాడారు. చరిత్ర గమనంలో సాహూ జీవితంలో ఎన్ని మార్పులు తొంగిచూసినా సామాజిక వ్యవస్థలో నిమ్నకులాల అభ్యున్నతికి తన పాలనలో సనాతన ఆచార విధానాలన్నింటినీ పునాదులతో పెకిలించేశారు. సాహూ విమర్శలతో పాటు పలు రకాల హత్యా యత్నాలను ఎదుర్కొని సామాజిక న్యాయం కోసం నిలబడ్డారు. ఆయన సామాజిక దృక్పథం, లక్ష్యం దృఢమైనవి. సాహూ మహరాజ్‌కు 1922 మే 6న మరణించే నాటికి నలభై ఎనిమిదేళ్ళు. ఈ కాలంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అనే ఆదర్శాలు కలిగిన సామాజిక సంస్కర్తగా సాహూ తన రాజ్యంలో వెనుకబడిన కులాలు, అస్పృశ్యతను నిర్మూలించడానికి పాలకుడిగా తనకున్న అధికారాలను పూర్తి స్థాయిలో వినియోగించారు. సామాజిక ఉద్యమ కరదీపికగా చరిత్రలో ఈ నాటికీ నిలిచివున్నారు. నేడు సామాజిక ఉద్యమాల్లో దళితేతర మేధావులు, అధికారులు పాల్గొంటున్నారంటే సాహూ మహరాజ్‌ వీళ్ళందరికీ సామాజిక ఉద్యమాల సింబల్‌గా మిగిలారు.
- జి నటరాజ్‌
(వ్యాసకర్త కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు)