శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వాసితులతో మాట్లాడే ప్రయత్నం చేసిన సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి మధు అక్రమ నిర్బంధం ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంలో పెరుగుతున్న అసహనానికి పరాకాష్ట. పోలాకికి పాతిక కిలోమీటర్ల ముందే ఆముదాలవలన రైల్వే స్టేషన్‌లోనే మధును పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్య. పైగా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చేసేందుకు ఆయన సెల్ ఫోన్ గుంజుకోవడం, మారు మూల ప్రాంతానికి తరలించడం ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నాయి. బుధవారం ఉదయం ఆరు గంటలకు మధును అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం ఏడు గంటల వరకు ఆయనను స్టేషన్‌లో నిర్బంధించారు. తన అరెస్టుకు కారణం అడిగితే పై అధికారుల ఆదేశాలని స్థానిక పోలీస్ అధికారులు తలాతోకా లేని కారణాలు చెప్పడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది. మధు ఉగ్రవాది, తీవ్రవాది కాదు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడానికి పోలాకి వెళ్లడం లేదు. శాంతిభద్రతల విఘాతానికి అసలే కాదు. ప్రభుత్వం బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కుంటుంటే, బాధితుల గోడు వినేందుకు, వాస్తవాలను ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించారంతే. ఒక జాతీయ రాజకీయ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుణ్ణి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీస్‌స్టేషన్‌లో గంటల కొలదీ నిర్బంధించడం ప్రజాస్వామ్య పాలన అనిపించుకుంటుందా? చట్టం తన పని తాను చేసుకుపోవడం అంటే ఇదా? విద్రోహ చర్యలకు పాల్పడ్డ వారిని అరెస్టు చేయాలన్నా ఎందుకు అరెస్టు చేస్తున్నారో పోలీసులు తెలపాలని చట్టం చెబుతోంది. ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శి విషయంలో రహస్యం పాటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మధు అక్రమ అరెస్టును నిరసించిన వందలాది మంది సిపిఐ(ఎం), ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తల మూకుమ్మడి అరెస్టులు నియంతృత్వ, రాచరిక, సైనిక పాలనను గుర్తుకు తెస్తున్నాయి.
ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పారదర్శకత పాటించడం దాని కనీస బాధ్యత. చేపట్టిన ఏ కార్యక్రమం గురించైనా ప్రజలకు సవివరంగా తెలియజెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకతను రెండు తాటిచెట్ల లోతులో పాతిపెట్టింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ మొదలుకొని పోలాకి వరకు అంతా రహస్యం. పోలాకిలో భారీ థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి జపాన్ కంపెనీ సుమిటోమితో సర్కారు గోప్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ని వేల ఎకరాల భూమి సేకరిస్తుందో, ఎన్ని గ్రామాలపై దాని ప్రభావం పడుతుందో, ఎంత మంది నిరాశ్రయులవుతారో నిగూఢం. ప్రాజెక్టుపై ఎలాంటి స్పష్టత కల్పించకుండా బలవంతంగా రైతుల నుంచి భూములను గుంజుకోజూస్తోంది. అందుకే పోలాకి ప్రాంత గ్రామాల జనాల్లో భయాందోళనలు అలముకున్నాయి. గత కాంగ్రెస్, ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వాలు శ్రీకాకుళం జిల్లా ప్రజల గుండెలపై కుంపట్లు రగిలిస్తున్నాయి. గతంలో కాకరాపల్లి, సోంపేటల్లో రైతులు, ప్రజల ఆందోళనలు, పోలీస్ కాల్పులు తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే సోంపేట ఉత్తర్వులను రద్దు చేస్తామన్న చంద్రబాబు మిన్నకుండిపోయారు. రైతుల వ్యతిరేకతను తోసిరాజని పోలాకిలో అదే తరహా థర్మల్ కేంద్రం స్థాపనకు నడుం బిగించి ద్వంద్వ నీతికి ఒడిగట్టారు. కాకరాపల్లిలో విద్యుత్ కేంద్ర నిర్మాణం మొదలయ్యాక కూడా నిర్వాసితుల ఉపాధి, సహాయ పునరావాసాలపై పట్టించుకునే నాథుడు లేడు. పోలాకిలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందని స్థానికులు భయపడటంలో అర్థం ఉంది.
ఏ అభివృద్ధి ప్రాజెక్టులోనైనా ఆ ప్రాంత ప్రజలకు అభివృద్ధిలో భాగం ఉండాలి. జనాన్ని అనాథలను చేసి కార్పొరేట్లకు లాభాలు పంచిపెట్టడం ప్రజా ప్రభుత్వం చేయదగని పని. భూములు తీసుకోవాల్సి వస్తే సాధ్యమైనంత వరకు నిర్వాసితులు లేని ప్రాంతాలను ఎంచుకోవాలి. ప్రత్యామ్నాయం లేకపోతే, తప్పదనుకుంటే భూములు కోల్పోయే వారిని, ప్రభావితులను ఒప్పించాలి. ఉపాధి, సహాయ, పునరావాస ప్యాకేజీలు అమలు చేయాలి. అవేమీ లేకుండా భూములు లాక్కోవడం దుర్మార్గం. థర్మల్ విద్యుత్ కేంద్రాల విషయంలో కాలుష్యం అధికం. నష్ట నివారణకు పకడ్బందీ చర్యలు అత్యవసరం. కానీ ప్రభుత్వం ఆ విషయాలు విస్మరిస్తోంది. ప్రజల ఆందోళనలను అణచివేసైనా తాను అనుకున్నది చేసేందుకు నిరంకుశ చర్యలకు పాల్పడుతోంది. ప్రభుత్వం ప్రజలకు దూరమైనప్పుడు, నిరసనలను తప్పించుకొనేందుకే అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, వగైరా వగైరా. గతంలో బషీర్‌బాగ్ కాల్పులు, అంగన్‌వాడీలపై పైశాచిక దాడి టిడిపిని అధికారానికి ఆమడ దూరానికి నెట్టాయి. ఇప్పుడు కూడా చంద్ర బాబు ప్రభుత్వం అదే నిరంకుశ పోకడలకు పోతోంది. అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికులు, స్కీం వర్కర్లు, రాజధాని ప్రాంత రైతుల నిరసనలపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేసింది. పార్టీల, సంఘాల నాయకులను రాత్రికి రాత్రి పికప్ చేసింది. నాగార్జున వర్శిటీలో విద్యార్థులపైనా అంతే. ఈ నిరంకుశ చర్యలన్నీ ప్రభుత్వ అసహనానికి ఉదాహరణలు. మధు అరెస్టు సహా సర్కారీ నియంతృత్వ పోకడలను అన్ని పార్టీలు, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలపై అప్రమత్తం కావాలి.