ఎపి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్య నెలకొల్పిన మద్యం షాపును వెంటనే తొలగించాలని కాకినాడలో మహిళలు ఆందోళనకు దిగారు. రామారావుపేట నైట్ హోటల్ సెంటర్‌లో ధర్నాకు దిగిన మహిళలకు సీపీఎం మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో మధు పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబుపై మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆడిన మాట తప్పారని..మోసగాడని ఘాటుగా విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే.. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన బాబు అధికారంలోకి వచ్చాక.. విస్తరింపచేసే కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు. మహిళల అందోళనకు రాజకీయ పక్షాలు పూర్తి మద్దతిస్తున్నాయని చెప్పారు. ఇదే విషయంలో సాయంత్రం అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కలుస్తామని చెప్పారు. అదే విధంగా మహిళల ఆధ్వర్యంలో జేఏసీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మద్యం షాపు తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని మధు హెచ్చరించారు.