ఇటీవల స్మార్ట్ సిటీల గురించి పదేపదే వార్తలొస్తు న్నాయి. 2014లో ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణం చేసిన తర్వాత భారతదేశంలో స్మార్ట్‌సిటీలు నిర్మిస్తామని ప్రకటించారు. దేశంలో 100 నగరాలు నిర్మిస్తామని, కనీసంగా ప్రతి రాష్ట్రంలోనూ ఒక నగరమైనా నిర్మిస్తామని ప్రకటించారు. గరిష్టంగా గుజరాత్, కేరళ, కర్ణాటకలో ఒక్కో రాష్ట్రంలోనూ ఏడు సిటీల చొప్పున, కనిష్టంగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకే ఒక్క నగరాన్ని నిర్మిస్తామని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో సరాసరిన 4 నుంచి 5 వరకూ నగరాలను నిర్మించనున్నట్టు ప్రకటనలు గుప్పించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నగరాలు నిర్మిస్తారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేసి జిల్లాకో స్మార్ట్ సిటీ నిర్మిస్తామని ప్రచారం చేశారు. వారి ప్రకటనల ప్రకారం మొత్తం 100 నగరాలకు గాను 20 నగరాలను 2014 చివరి నాటికి ఎంపిక చేసి పని ప్రారంభించాలి. మరో 40 నగరాలు వచ్చే రెండేళ్లలో అంటే 2016 నాటికి గుర్తించి పని ప్రారంభిస్తారు. ఇందుకోసం రూ.98 వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ పని సజావుగా సాగడానికి అటల్ మిషన్, 'అమృత్' పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ స్మార్ట్ సిటీల నిర్మాణానికి అంతర్జాతీయ సహకారం తీసుకుంటారు. ప్రస్తుతం సిటీలో మొత్తం ఒకేసారి సాధ్యం కాకపోతే సిటీలో కొంత భాగాన్ని ముందుగా ఎంపిక చేస్తారు. ఢిల్లీలో కన్నాట్‌ప్లేస్, బొంబాయిలో బెండిబజారు లాంటివి. ఇంతకీ స్మార్ట్ సిటీ అంటే ఏమిటి? ఇది సామాన్యులం దిరిలోనూ తలెత్తే ప్రశ్న. స్మార్ట్ సిటీ అంటే పూర్తిగా డిజిటల్ సిటీ అన్నమాట. మొత్తం ఇంటర్నెట్ ఆధారంగా సిటీలో పాలనా వ్యవహారాలు ఆన్‌లైన ్‌లో నడుస్తాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవస రం ఉండదు. అన్నింటినీ ఇ-గవర్నెన్స్ ద్వారా పరిష్కరిస్తారు. పరిశుభ్రత, శానిటేషన్ ఉన్నత స్థాయిలో నిర్వహిస్తారు. చెత్తను వృథాకానివ్వరు. చెత్త నుంచి గ్యాస్, ఇంధనం, విద్యుత్, కంపోస్టు తయారు చేస్తారు. ఆ స్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు ఉంటాయని ఊహించుకోవాలి. మంచినీరు, విద్యుత్, గ్యాస్, ఇంటర్నెట్ నిరంతరాయంగా సరఫరా అవుతాయి. (మీకు డౌటే వద్దు). అపార్ట్‌మెంట్లన్నిటికీ సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తారు. సిటీ అంతటా వెడల్పాటి రోడ్లు, రోడ్లపై చెట్లు, అటూ ఇటూ పచ్చగా ఉంటుంది. అర్బన్ అడవులు పెంచుతారు. ఇరుకు రోడ్లను వెడల్పాటి రోడ్లుగా మారుస్తారు. రింగ్‌రోడ్ల నిర్మాణం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా వ్యవస్థలను అండర్ గ్రౌండ్‌లోనే నిర్మిస్తారు. ఇదీ స్మార్ట్ సిటీ కథాకమామిషు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సామాన్యుడి కలల సౌథం, పగటిపూటే ఆవిష్కరించే అద్భుత ప్రపంచం. ఇదంతా ఎలా సాధ్యం? పైన పేర్కొన్నదంతా ప్లాను. ఇప్పుడు ఆచరణకు రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ వెళ్లి అక్కడ మంత్రితో మాటామంతి కలిపి స్మార్ట్ సిటీ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆంధ్రాలోని 13 జిల్లాల ముఖ్య పట్టణాలను ఇందులో భాగంగా అభివృద్ధి చేస్తారు. తొలుత ఇందు కోసం కాకినా డను ఎంపిక చేశారు. జపాన్‌లోని యొకొహామా సిటీ మోడల్‌లో కాకినాడను అభివృద్ధి చేయాలని చెబుతున్నారు. ఇప్పటికే యొకొహామా సిటీ నిర్మాణం ప్రారంభమైంది. అయితే యొకొహామా సిటీని చూసి ఆ పద్ధతిలో కాకినాడను నిర్మిం చాలను కున్నా, మరే సిటీని నిర్మించాలకున్నా పొర పాటే అవుతుంది. పులిని చూసి నక్క వాత పెట్టు కున్న చందమే. యొకొహామా సిటీ అత్యంత ధనవంతమైన నగరం. ఆ నగర ఆర్థికవ్యవస్థ ఎంత పెద్దదంటే శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కంటే కూడా పెద్దది. నగరం అంతా ఇప్పటికే అభివృద్ధి చెంది ఉంది. ఆకాశహర్మ్యాలు, భారీ షాపింగ్‌మాల్స్, ప్లైఓవర్‌లతో కూడిన సిటీ అది.
పోలిక రీత్యా చూస్తే కాకినాడ అతి చిన్న నగరం. ఎంత చిన్నదంటే కాకినాడ 36 చదరపు కిలోమీటర్లు కాగా యొకహోమా సిటీ 435 చదరపు కిలోమీటర్లు. కాకినాడ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. యొకొహామా సిటీలో ప్రతి పనినీ ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారు. పానాసోనిక్, సోనీ, తోషిబా, హిటాచి లాంటి కార్పొరేట్ దిగ్గజాలు పనులను చేజిక్కించుకున్నాయి. యొకొహామా సిటీ ప్రణాళిక మరో నాలుగు అడుగులు ముందుకేసింది. ఆ ప్లాను ప్రకారమే ఆంధ్రాలో తొలిసారిగా కాకినాడను నిర్మిస్తారు. యొకొహా మాను స్మార్ట్ సిటీగా నిర్మించే ప్రక్రియ 2010లో ప్రారంభమైంది. షెడ్యూలు ప్రకారం 2015కు ముగించాలి. మొత్తం సిటీ అత్యల్ప కర్బన నగరంగా ఉంటుంది. అతి తక్కువ కర్బనం విడు దల చేసేలాంటి బ్యాటరీ ఆధారిత వాహనాలకు రూపకల్పన చేస్తున్నారు. ఎక్కడా, చివరకు కర్మాగారాల్లో సైతం పొగ విడుదల కారాదు. బస్సులన్నింటికీ జనరేషన్ టెక్నాలజీని ఉపయోగి స్తారు. సిటీని 4-5 భాగాలుగా విభజించారు. ప్రత్యేక గ్రీన్ జోన్‌లను నిర్మిస్తున్నారు. అపార్ట్‌మెంట్లన్నింటికీ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పానాసోనిక్, సోనీ, తోషిబా, నిస్సాన్ లాంటి కంపెనీలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. మొత్తం పనుల్లో, ప్రణాళికల్లో 95 శాతం కార్పొరేట్ కంపెనీలదే. మరికొంత భాగం స్థానిక సిటిజన్ కమిట ీలది. ఈ స్మార్ట్ సిటీ నిర్మాణానికి తొలి అంచనా ప్రకా రం రూ.7,500 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే పోల వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులో 3వ వం తు. ఇందులో కొంత జపాన్ ప్రభుత్వం, మరికొంత సిటిజన్ కమిటీలు, మరికొంత యూజర్ ఛార్జీలుగా ఉంటుంది. యొకొహామా సిటీ నిర్మాణం దాదాపు పూర్తి అయింది. కాకినాడలో జపాన్ బృందం తొలివిడత వచ్చి చూసి వెళ్లింది. స్మార్ట్ సిటీలో మోటారు సైకిళ్లు, సైకిళ్లు, పాదచారులు ఉండరు. మరి కాకినాడలో ఉన్న వీళ్లను ఏమి చేయాలి? ఇరుకు సందులు, కట్టె పుల్లలతో పొయ్యిలు నేటికీ ఉన్నాయి. వీటి సంగతేమిటి? వీటన్నింటికీ మూలమైన అథమ స్థితిలో ఉన్న ప్రజల ఆదాయాల మాటేమిటి? రాష్ట్రంలోనే తూర్పు గోదావరి జిల్లా సంపన్నవంతమైన జిల్లా. అటువంటి జిల్లాలోనే ఇన్ని సమస్యలుంటే మరి ఇతర పట్టణాల మాటేమిటి? కేంద్రం డబ్బులి స్తుందంటే నమ్మవచ్చా? పోలవరం ప్రాజెక్టుకు నిధు లు ఇవ్వలేని వారు దీనికి విదుల్చు తారా? స్మార్ట్ సిటీల విషయంలో ఎదురయ్యే ప్రధాన సమస్య ప్రతి పనినీ ప్రైవేటు పరం చేస్తారు. ప్రజల భాగస్వామ్యం పేరుతో యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. అది కూడా భారీగా ఉంటుంది. అలా అయితేనే నిర్మాణం పూర్తి కాగలదు. నిర్వహణ జరగాలంటే అధిక యూజర్ ఛార్జీ లు తప్పని సరి. అటువంటి భారాలేమీ లేకుండా స్మార్ట్ సిటీని నిర్మిస్తే అందరికీ మంచిదే... కానీ ప్రజలపై భారాలు వేసి సిటీని నిర్మించడం ఎంతవరకూ సమజసం అనేది అందరి నోటా వస్తున్న ప్రశ్న.
- దువ్వ శేషబాబ్జి
(వ్యాసకర్త సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి)