గత సంవత్సర కాలంగా 9/77 అసైన్డ్ చట్ట సవరణపై చర్చ జరుగు తున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. త్వరలో ఈ చట్టాన్ని సవరిస్తామని, అసైన్డ్ భూములకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్లకు ఉత్తర్వులు అందినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చట్ట సవరణపై చర్చిస్తామని ముఖ్య మంత్రి ప్రకటించటంతో మరీ వేడెక్కింది. ఈ చట్టం ఉద్దేశం ఏమిటి? ఎవరి రక్షణ కోసం ఈ చట్టం వచ్చింది? ఇప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉబలాట పడుతోందనేదాన్ని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం 9/77 చట్టాన్ని సవరించింది. నాడు ఈ చట్ట సవరణకు సిపిఐ(యం) శాసనసభ్యులు అసెంబ్లీలో గట్టిగా వ్యతిరేకించారు. నాడు ప్రధా న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు వామపక్షాలతో గొంతుకలిపి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెజ్‌లు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన భూములన్నింటినీ విచారించి అక్రమంగా కట్టబెట్టిన భూములన్నీ వెనక్కి తీసుకొని పేదలకిస్తామని ప్రకటించారు. అంతేగాక 2014 ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే కుటుంబానికి రెండెక రాల భూమి, అసైన్డ్ భూములకు జిరాయితీ భూములతో సమా నంగా అన్ని హక్కులూ కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలు నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చారు. గద్దనెక్కిన పెద్దమనిషి అసెం బ్లీలో ఇచ్చిన మాట, ఎన్నికల్లో చేసిన వాగ్దానం మరచి ఎందుకు వెనక్కి తిరిగారో ఒక్కసారి ఆలోచించాలి.
స్వాతంత్య్రానంతరం ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు వివిధ రూపాలలో చేసిన పోరాటాల వల్ల కానీ, పాలకవర్గాల స్వార్థ రాజకీయ లబ్ధి కోసం కానీ సుమారు 42 లక్షల కుటుంబాలకు అన్ని రకాల భూములు కలిపి 75 లక్షల ఎకరాలు పేదల చేతికి వచ్చింది. ఈ భూములను పెత్తందార్లు, పలుకుబడి కల్గినవారు పదో, పాతికో పేదలకిచ్చి ఎక్కువ శాతం భూములను తెల్ల కాగితాల మీద రాయించుకొని కాజేయడం మొదలుపెట్టారు. ఒక పక్క పేదలకిచ్చినట్లే ఇచ్చి పెద్దల చేతికి తిరిగి పోవడంతో ఎలాగైనా పేదల భూములు రక్షించాలని 1977లో పేదల ఆశాజ్యోతి, వామపక్ష శ్రేయోభిలాషి ఎస్ఆర్ శంకరన్, మరి కొందరు అభ్యుదయవాదుల ప్రోద్బలంతో 9/77 అసైన్డ్ చట్టం వచ్చింది.
ఈ చట్టం ఏం చెబుతుంది? అసైన్డ్ భూమి అంటే ప్రభు త్వం ఇచ్చిన భూమి. ప్రభుత్వ భూమి అంటే ప్రజలదే. ఈ భూమి పొందిన వారు అత్యధికులు దళిత, గిరిజన, వెనుకబడిన కులా లకు చెందిన వారే. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ భూమి పొందా లంటే గ్రామీణ ప్రాంతాలలో నివాసముండాలి. ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. కుటుంబానికి సొంత భూమి ప్రభుత్వం ఇచ్చే భూమి కలిపి మెట్ట అయితే 5 ఎకరాలు, మాగాణి అయితే రెండున్నర ఎకరాలకు మించి ఇవ్వడానికి వీలు లేదు. అసైన్డ్ భూములను రిజిష్టర్ చేయరాదు. ఈ భూమిని అమ్మ రాదు, ఇతరులు కొనరాదు. తెలిసో, తెలియకో కొన్నా భూమి కోల్పోయిన పేదలు తమ భూమి తమకే కావాలని ఆ వ్యక్తి కానీ, వారసులు కానీ కోరితే తిరిగి వారికే ఇవ్వాలి. అంతేకాక అనర్హులు కొంటే ఆరు నెలలు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించాలని చట్టం స్పష్టంగా చెబుతోంది. పేదల భూముల రక్షణ కవచంగా ఉన్న అసైన్డ్ చట్టాన్ని ఎత్తేయడానికి గత రెండు దశాబ్దాలుగా పాలకవర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి.
అసైన్డ్ చట్టం ఉన్నప్పటికీ మూడు దశాబ్దాల కాలంలో ఉమ్మడి రాష్ట్రాలలో సుమారు 25 లక్షల ఎకరాల భూమి (ఎపిలో సుమారు 15 లక్షలు) అన్యాక్రాంతమైనట్లు 2006లో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తన తండ్రి రాజారెడ్డి తెలిసో, తెలియకో 300 ఎకరాల అసైన్డ్ భూమి పొందినట్లు చెప్పి తిరిగి పేదలకిస్తానని ప్రకటించారు (పంచారో, లేదో తెలియదు). కాబట్టి అక్రమంగా అసైన్డ్ భూములు పొందినవారు తిరిగి ఇవ్వాలని, ఇచ్చినవారిపై ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పారు. అయినా ఎవరూ స్పందించలేదు. కోనేరు రంగారావు భూ కమిటీ కూడా లక్షలాది ఎకరాల అసైన్డ్ భూము లు అక్రమంగా పెద్దలు అనుభవిస్తున్నారని, వారి నుండి వెనక్కి తీసుకొని తిరిగి పేదలకివ్వాలని చెప్పింది. ఇంత చర్చ జరిగినా నాటి ముఖ్యమంత్రి అసైన్డ్ భూములు వెనక్కి తీసుకోకపోగా చట్టంలోని సెక్షన్ 4లో అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకొని తిరిగి పేదలకివ్వాలన్న నిబంధనలను మార్చి ఈ భూములు పొందినవారు పరిశ్రమలు పెట్టుకున్నా, విద్యాలయా లు నెలకొల్పుకున్నా, మౌలిక వసతుల కోసం ఉపయోగించు కున్నా తిరిగి వారికే ఇవ్వాలని సవరణ చేయడం వల్ల లక్షలాది ఎకరాల భూములను పెద్దలు పొందారు.
నాడు చంద్రబాబు నాయుడు ఊరూవాడా తిరుగుతూ పేదల భూములు ఆక్రమించుకున్న వారి నుంచి కక్కించి తిరిగి పేదలకిస్తానని, అధికారంలోకి వస్తే లేని కుటుంబాలకు రెండు ఎకరాల భూమి ఇస్తానని చెప్పారు. అంతటితో ఆగకుండా అసైన్డ్ భూములకు అన్ని హక్కులూ కల్పిస్తామని వాగ్దానం చేసిన పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నుంచి పేదలకు భూ పంపిణీ చేసేది లేదని చిత్తూరు జిల్లాలో ప్రకటించారు. అంతేకాక రాజశేఖర్ రెడ్డి అసైన్డ్ చట్ట సవరణ చేస్తే నేడు ఆ చట్టాన్నే గొంతు కోయడానికి చంద్రబాబు నాయుడు పూనుకొ న్నారు. రాష్ట్ర విభజన జరిగి నూతన రాజధాని ప్రకటించిన తరువాత చుట్టుపక్కల జిల్లాల్లో భూముల విలువ కోట్లలో పెరిగింది. మరో పక్క పోర్టు, పరిశ్రమలు, విమానాశ్రయాలు ప్రకటించి కృత్రిమంగా భూముల విలువ పెంచేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో పేదలకిచ్చిన అసైన్డ్ భూములలో ఎక్కువ శాతం అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే ఆక్రమించుకున్నారు. కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రధాన వ్యక్తే సుమారు 100 ఎకరాలు కుటుంబ సభ్యుల పేరుతో అసైన్డ్ భూములను అనుభవిస్తున్నారు. ఈ భూములన్నీ అమ్ముకోవాలంటే 9/77 చట్టం అడ్డొస్తుంది. ఈ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన లబ్ధిదారులకే తిరిగి చెందాలి. కాబట్టి పెద్దలకు కట్టబెట్టాలనే దురుద్దేశాన్ని పక్కకు పెట్టి అసైన్డ్ భూమి కలిగిన పేదలు అమ్ముకోవడానికే ఈ అసైన్డ్ చట్ట సవరణను చేస్తున్నా మని బయటికి చెబుతున్నారు. ఇప్పటికే 15 లక్షల దళిత, గిరిజన, వెనుకబడిన కులాలకు చెందిన పేదల భూములు పెద్దల చేతు ల్లోకి వెళ్ళిపోయాయి. ఈ సవరణ జరిగితే భూములన్నీ పెద్దలకు కట్టబెట్టవచ్చు. ఇదే అమలు జరిగితే ఈ రాష్ట్రంలో పేదల చేతిలో ఒక్క సెంటు భూమి కూడా మిగలదు. ఈ ఉద్దేశంతోనే కార్పొరేట్ల ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర ఇది. అదే విధంగా 2013 భూ సేకరణ చట్టంలో జిరాయితీ భూములతో సమానంగా అసైన్డ్ భూములకు అన్ని హక్కులూ కల్పించాలని చెబితే ఆ చట్టాన్ని బుట్టదాఖలు చేసి అభివృద్ధి మాటున 15 లక్షల ఎకరాల భూమి భూ బ్యాంక్ పేరుతో బలవంతంగా గుంజుకో వడానికి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి 9/77 చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. అసైన్డ్ భూములు పేదలకే చెందాలి. అనర్హులు, అక్రమంగా పొందిన వారిపై చర్యలు తీసుకొని వారి నుంచి భూములు వెనక్కి తీసుకొని తిరిగి ఆ పేదలకే ఇవ్వాలి.
- వి వెంకటేశ్వర్లు
(వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)